Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Zechariah 10 >> 

1కడవరి వాన కాలంలో వర్షం దయచేయమని యెహోవాను వేడుకోండి. ఆకాశంలో మెరుపులు పుట్టేలా చేసేవాడు యెహోవాయే. ఆయన ప్రతి ఒక్కరి పొలంలో పంటలు పెరిగేలా సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడు.

2గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికాయి. సోదె చెప్పేవాళ్ళకు వ్యర్ధమైన కలలు వచ్చాయి. వాళ్ళు కపటంతో ఆ కలలకు అర్ధం చెప్పారు. మోసపూరిత భావాలు చెప్పి ఓదార్చారు. కాబట్టి ప్రజలు గొర్రెల మంద తిరిగినట్టు తిరిగారు. తమను కాచే కాపరి లేకపోవడం వల్ల బాధల పాలయ్యారు.

3<<కాపరులపై నా కోపాగ్ని మండుతున్నది. మందలో మేకలను నేను శిక్షిస్తాను>> అని సేనల ప్రభువు యెహోవా అంటున్నాడు. ఆయన తన మందయైన యూదా ప్రజలను దర్శించి వాళ్ళను తన యుద్ధాశ్వాలుగా మలుచుకుంటాడు.

4ఆ వంశంలో నుంచి మూలరాయి పుడుతుంది. గుడారపు మేకు, యుద్ధ ధనుస్సు వారి నుండి పుడతాయి. యుద్ధ నేర్పు గలవాడు వారిలో నుండి పుడతాడు.

5వారు పరాక్రమంతో యుద్ధం చేస్తూ శత్రువులను వీధుల్లోని బురదలో తొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉంటాడు కనుక వారు యుద్ధం చేసినప్పుడు గుర్రపు రౌతులు సిగ్గు పడి పరాజయం పాలౌతారు.

6నేను యూదా ప్రజలను బలపరుస్తాను. యోసేపు సంతానానికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలం ఇస్తాను. నేను వారిపట్ల కనికరం చూపుతాను. నేను వారి ప్రార్థన ఆలకిస్తాను కనుక నేను వాళ్ళను నిరాకరించిన విషయం మరచిపోతారు. నేను వారి దేవుడనైన యెహోవాను,

7ఎఫ్రాయిము ప్రజలు మహా బలవంతులు అవుతారు. ద్రాక్షారసం తాగిన వాళ్ళు సంతోషం పొందినట్టు వాళ్ళు తమ హృదయాల్లో ఆనందిస్తారు. అది చూసిన వారి సంతానం ఆనందపడతారు. వాళ్ళు యెహోవా చేసిన దాన్నిబట్టి హృదయపూర్వకంగా సంతోషిస్తారు.

8నేను వారిని విమోచించాను కనుక ఈల వేసి పిలిచి వాళ్ళను సమకూరుస్తాను. ఇంతకు ముందు విస్తరించినట్టు వాళ్ళు అభివృద్ది చెందుతారు.

9నేను వాళ్ళను ఇతర దేశాలకు చెదరగొట్టినప్పటికీ వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసికొంటారు. వారూ, వారి సంతానం సజీవులుగా తిరిగి చేరుకుంటారు.

10నేను వాళ్ళను ఐగుప్తు దేశం నుండి తిరిగి తీసుకు వస్తాను. అష్షూరు దేశం నుండి వాళ్ళను సమకూరుస్తాను. గిలాదు, లెబానోను దేశాల్లో ఎక్కడా స్థలం చాలనంత విస్తారమైన జనాంగాన్ని తోడుకొని వస్తాను.

11వాళ్ళు దుఃఖసముద్రం దాటవలసి వచ్చినప్పుడు సముద్రపు అలలు అణగారి పోతాయి. నైలునదిలోని లోతైన స్థలాలను ఆయన ఇంకిపోయేలా చేస్తాడు. అష్షూరీయుల గర్వం అణిగి పోతుంది, ఐగుప్తీయుల నుండి రాజరికం తొలిగి పోతుంది.

12నేను వాళ్ళను యెహోవా నామం పేరిట బలపరుస్తాను. ఆయన పేరు స్మరించుకుంటూ వారు కొనసాగుతారు. ఇది యెహోవా వాక్కు.


  Share Facebook  |  Share Twitter

 <<  Zechariah 10 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran