Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Isaiah 8 >> 

1యెహోవా <<నీవు పెద్ద పలక తీసుకుని <మహేర్ షాలాల్‌ హాష్‌ బజ్‌> అనే మాటలు దాని మీద రాయి.

2నా నిమిత్తం నమ్మకమైన సాక్ష్యం పలకడానికి యాజకుడైన ఊరియా, యెబెరెక్యా కుమారుడు జెకర్యాలను పిలుస్తాను>> అని నాతో చెప్పాడు.

3అప్పుడు నేను స్త్రీ ప్రవక్త దగ్గరికి పోయాను. ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది. యెహోవా <<వాడికి <మహేర్ షాలాల్‌ హాష్‌ బజ్‌> అనే పేరు పెట్టు.

4ఈ పిల్లవాడు నాన్నా, అమ్మా అనగలిగే ముందే అష్షూరు రాజు, అతని మనుషులు దమస్కు ఐశ్వర్యాన్నీ షోమ్రోను దోపుడు సొమ్మునూ ఎత్తుకు పోతారు>> అన్నాడు.

5యెహోవా ఇంకా నాతో ఇలా సెలవిచ్చాడు.

6<<ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీళ్లు వద్దని, రెజీనును బట్టి, రెమల్యా కుమారుణ్ణి బట్టి సంతోషిస్తున్నారు.>>

7కాబట్టి ప్రభువు బలమైన యూఫ్రటీసు నది వరద జలాలను, అంటే అష్షూరు రాజును అతని సైన్యమంతటిని వారి మీదికి రప్పిస్తాడు. అవి దాని కాలవలన్నిటి పైగా పొంగి తీరాలన్నిటి మీదా పొర్లి పారుతాయి.

8అవి యూదా దేశంలోకి వచ్చి వరద పొంగులా ప్రవహిస్తాయి. అవి మెడలోతు అవుతాయి. ఇమ్మానుయేలూ, దాని రెక్కలు నీ దేశమంతా కప్పేస్తాయి.

9ప్రజలారా, మీరు ముక్కలు చెక్కలై పోతారు. దూరదేశాల్లారా, మీరందరూ వినండి. మీరు యుద్ధానికి సన్నద్ధులు కండి, ముక్కలు చెక్కలైపొండి. యుద్ధానికి సన్నద్ధులు కండి, ముక్కలు చెక్కలై పొండి.

10పథకం వేసుకోండి గానీ దాన్ని అమల్లో పెట్టలేరు. ఆజ్ఞ ఇవ్వండి గానీ ఎవరూ దాన్ని పాటించరు. ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు.

11తన బలిష్ఠమైన చేతిని నాపై ఉంచి ఈ ప్రజల దారిలో నడవకూడదని యెహోవా ఖండితంగా నాతో చెప్పాడు.

12ఈ ప్రజలు కుట్ర అని చెప్పేదంతా కుట్ర అనుకోకండి. వారు భయపడే దానికి భయపడకండి. హడలి పోకండి.

13సేనల ప్రభువైన యెహోవాయే పరిశుద్ధుడని ఎంచాలి. మీరు భయపడవలసిన వాడు, భీతి చెందవలసిన వాడు ఆయనే.

14అప్పుడాయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. అయితే ఆయన ఇశ్రాయేలు రెండు కుటుంబాలకు తొట్రుపడజేసే రాయిగా తూలి పడేసే బండగా ఉంటాడు. యెరూషలేము నివాసులకు బోనుగా చిక్కుకునే వలగా ఉంటాడు.

15చాలా మంది వాటికి తగిలి తొట్రుపడి కాళ్లు చేతులు విరిగి వలలో చిక్కి పట్టుబడతారు.

16ఈ సాక్ష్య వాక్యాన్ని కట్టు. ఈ అధికారిక వార్తను సీలు వేసి నా శిష్యులకు అప్పగించు.

17యాకోబు వంశానికి తన ముఖం దాచుకున్న యెహోవా కోసం నేను ఎదురు చూస్తాను. ఆయన కోసం నేను ఎదురు చూస్తాను.

18ఇదిగో, నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు. సీయోను కొండ మీద నివసించే సేనల ప్రభువు యెహోవా మూలంగా సూచనలుగా, మహత్కార్యాలుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.

19వారు మాతో <<శకునాలు చెప్పే వారి దగ్గరికి, గొణుగుతూ గుసగుసలాడుతూ ఉండే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్లి విచారణ చెయ్యండి>> అని చెబుతారు. కానీ ప్రజలు విచారించవలసింది తమ దేవుడి దగ్గరనే గదా? బతికి ఉన్న వారి కోసం చచ్చిన వారి దగ్గరికి వెళ్లడం సమంజసమా?

20ధర్మశాస్త్రం పైనా సాక్ష్యం పైనా దృష్టి నిలపండి. వారు ఇలా చెప్పక పోతే అందుకు కారణం వారికి అరుణోదయం కలగలేదు.

21అలాటి వారు ఇబ్బంది పడుతూ ఆకలితో దేశమంతా తిరుగులాడుతారు. ఆకలేసి కోపపడతారు. తమ ముఖాలు ఆకాశం వైపుకు ఎత్తి తమ రాజును, తమ దేవుణ్ణి దూషిస్తారు.

22భూమి వైపు తేరి చూసి, దురవస్థ, అంధకారం, భరించరాని వేదన అనుభవిస్తారు. వారు గాఢాంధకార దేశంలోకి తోలివేయబడుతారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 8 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran