Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Isaiah 63 >> 

1ఎర్రటి బట్టలు కట్టుకుని ఎదోములోని బొస్రా నుంచి వస్తున్న ఈయనెవరు? రాజ వస్త్రాలతో తన మహా బలంతో గంభీరంగా వస్తున్న ఈయనెవరు? నీతితో మాట్లాడే నేనే. రక్షించడానికి సమర్ధుణ్ణి.

2నీ బట్టలు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? నీ బట్టలు ద్రాక్షగానుగ తొక్కేవాడి బట్టల్లాగా ఎందుకున్నాయి?

3ఒంటరిగా ద్రాక్షగానుగ తొక్కాను. రాజ్యాల్లో ఎవడూ నాతో చేరలేదు. కోపంతో వారిని తొక్కాను. ఆగ్రహంతో వారిని అణగదొక్కాను. వారి రక్తం నా బట్టల మీద చిందింది. నా బట్టలన్నీ మరకలే.

4పగ తీర్చుకునే రోజు కోసం చూశాను. నా విడుదల సంవత్సరం వచ్చింది.

5సాయం చేసేవాడి కోసం చూశాను. ఎవరూ రాలేదు. ఎవడూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాను. అయితే నా హస్తమే నాకు విజయం సాధించిపెట్టింది. నా ఆగ్రహం నన్ను నడిపించింది.

6కోపంతో ప్రజలను తొక్కేశాను. నా ఆగ్రహంతో వారికి మత్తెక్కించాను. వారి రక్తాన్ని నేల పారబోశాను.

7యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయాన్ని, యెహోవా స్తుతి పాత్రమైన పనులను వర్ణిస్తాను. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని గురించి నేను చెబుతాను. తన వాత్సల్యాన్ని బట్టి, కృపాతిశయాన్ని బట్టి, ఇశ్రాయేలు వంశం వారికి ఆయన చూపిన మహాకనికరాన్ని నేను ప్రకటన చేస్తాను.

8అయితే ఆయన ఇలా అన్నాడు. <<కచ్చితంగా వారు నా ప్రజలు. అవిధేయులు కాని పిల్లలు.>> ఆయన వారికి రక్షకుడయ్యాడు.

9వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో, కనికరంతో వారిని రక్షించాడు. పురాతన దినాలన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ మోస్తూ వచ్చాడు.

10అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. కాబట్టి ఆయన వారికి శత్రువయ్యాడు. తానే వారితో పోరాడాడు.

11ఆయన ప్రజలు పూర్వదినాల్లోని మోషేను గుర్తుకు తెచ్చుకున్నారు. వారిలా అన్నారు, తన మందకాపరులతోబాటు సముద్రంలో నుంచి ప్రజలను తీసుకు వచ్చినవాడేడి? వారి మధ్య తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి?

12మోషే కుడిచేతి వైపున తన ఘనమైన బలాన్ని పంపించిన వాడేడి?

13తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగాలని వారిముందు నీళ్లను విభజించినవాడేడి? లోతైన నీళ్ళగుండా వారిని నడిపించిన వాడేడి? మైదానంలో గుర్రం లాగా వాళ్ళు తొట్రుపడలేదు.

14లోయలో దిగే పశువుల్లాగా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగచేశాడు. నీకు ఘనమైన పేరు కలగాలని నువ్వు నీ ప్రజలను నడిపించావు.

15పరలోకం నుంచి చూడు. నీ దివ్యమైన పవిత్ర నివాసం నుంచి చూడు. నీ ఆసక్తి, నీ గొప్పపనులు ఎక్కడున్నాయి? మా పట్ల నీ కనికరం, నీ వాత్సల్యం, ఆగిపోయాయేమిటి.

16అయితే మా తండ్రివి నువ్వే. అబ్రాహాముకు మేము తెలియక పోయినా ఇశ్రాయేలు మమ్ములను అంగీకరించకపోయినా, యెహోవా, నువ్వే మా తండ్రివి. అనాదికాలం నుంచి <<మా విమోచకుడు>> అని నీకు పేరు గదా.

17యెహోవా, నీ విధానాలనుంచి మమ్ములను తప్పిస్తున్నావెందుకు? మాకు నీ పట్ల భయభక్తులు ఉండకుండా మా హృదయాలను ఎందుకు కఠినపరుస్తున్నావు? నీ సేవకుల కోసం నీ సొత్తుగా ఉన్న గోత్రాలకోసం తిరిగి రా.

18నీ పవిత్ర ఆలయం నీ ప్రజల ఆధీనంలో కొద్దికాలమే ఉంది. అయితే మా శత్రువులు దాన్ని తొక్కివేశారు.

19నువ్వెన్నడూ పాలించని వాళ్ళలాగా అయ్యాం. నీ పేరెన్నడూ ధరించని వాళ్ళలాగా అయ్యాం.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 63 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran