Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Isaiah 54 >> 

1<<గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ఎన్నడూ ప్రసవవేదన పడనిదానా, సంతోషంతో గట్టిగా గానం చెయ్యి. పెళ్ళయిన స్త్రీ పిల్లలకంటే భర్త వదిలేసిన స్త్రీకి పుట్టే పిల్లలు ఎక్కువమంది>> అని యెహోవా చెబుతున్నాడు.

2నీ డేరా పెద్దదిగా చెయ్యి. నీ డేరా తెరలను ఇంకా పొడిగించు. నీ తాళ్ళు పొడుగు చెయ్యి. నీ మేకులు దిగ్గొట్టు.

3ఎందుకంటే నువ్వు కుడివైపుకూ ఎడమవైపుకూ వ్యాపిస్తావు. నీ సంతానం రాజ్యాలను స్వాధీనం చేసుకుంటుంది. పాడైన పట్టణాలను నివాస స్థలాలుగా చేస్తారు.

4భయపడవద్దు. నువ్వు సిగ్గు పడనక్కరలేదు. నీకు అవమానం కలగదు. అధైర్య పడవద్దు. చిన్నతనంలోని నీ అవమానాన్నీ సిగ్గునూ మరచిపోతావు. నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకం చేసుకోవు.

5నిన్ను సృష్టించినవాడు నీకు భర్త. ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. లోమంతటికీ దేవుడు అని ఆయన్ని పిలుస్తారు.

6భర్త వదిలి వేయగా ఎంతో విచారంతో ఉన్న భార్యను భర్త తిరిగి రప్పించినట్టు, పడుచుతనంలో పెళ్ళిచేసుకుని తృణీకారానికి గురి అయిన భార్యను తిరిగి రప్పించినట్టుగా యెహోవా నిన్ను తిరిగి రప్పించాడని, నీ దేవుడు చెబుతున్నాడు.

7కొంతసేపే నేను నిన్ను వదిలేశాను. అయితే ఎంతో జాలితో నేను నిన్ను చేరదీస్తాను.

8కాసేపే నీమీద కోపంతో నా ముఖం దాచాను. నీ మీద జాలి చూపిస్తాను. నిన్నెప్పటికీ నమ్మకంగా ప్రేమిస్తానని నిన్ను విమోచించే యెహోవా చెబుతున్నాడు.

9<<ఇది నాకు నోవహు రోజుల్లోని జలప్రళయంలాగా ఉంది. భూమి మీదికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదని నేను ప్రమాణం చేశాను. అలాగే, నీ మీద కోపంగా ఉండననీ నిన్ను గద్దించననీ ప్రమాణం చేశాను.

10పర్వతాలు కూలిపోయినా కొండలు కదిలినా నా కృప నీనుంచి తొలగిపోదు. నా శాంతి ఒడంబడిక, నిన్ను విడిచిపోదు>> అని నీ మీద జాలిపడే యెహోవా చెబుతున్నాడు.

11బాధపడుతున్న దానా! తుఫాను బాధితురాలా, ఆదరణలేనిదానా! నేను నీ కాలిబాట వైడూర్యాలతో చేస్తాను. నీలమణులతో నీ పునాదులు వేస్తాను.

12కెంపులతో నీ కోట బురుజులను, మెరిసే రాళ్ళతో నీ గుమ్మాలను, విలువైన రత్నాలతో నీ గోడలను నిర్మిస్తాను.

13యెహోవా నీ పిల్లలందరికీ బోధిస్తాడు. నీ పిల్లలకు పరిపూర్ణమైన నెమ్మది ఉంటుంది.

14నీతితో నిన్ను తిరిగి స్థాపిస్తాను. నువ్వు ఇంకెన్నటికీ హింస అనుభవించవు. నువ్వు భయపడనక్కరలేదు. నిన్ను భయపెట్టేది నీ దగ్గరికి రాదు.

15ఎవరైనా చిక్కు తెస్తే, అది నా వలన కాదు. చిక్కు తెచ్చే వారెవరైనా ఓడిపోతారు.

16ఇదిగో విను! నిప్పులు ఊదే కమ్మరిని నేనే చేశాను. అతడు అక్కడ ఆయుధాలను చేస్తాడు. నాశనం చేయడానికి నాశనం చేసేవాణ్ణి చేసింది నేనే.

17నీకు విరోధంగా తయారైన ఎలాంటి ఆయుధమూ గెలవదు. నీ మీద నేరారోపణ చేసే వారందరినీ నువ్వు శిక్షిస్తావు. యెహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది. వారిని నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది. యెహోవా ప్రకటించేది ఇదే.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 54 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran