Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Isaiah 50 >> 

1యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. <<నేను మీ తల్లిని విడిచిపెట్టి ఇచ్చిన విడాకుల పత్రం ఏదీ? నా అప్పులవాళ్ళలో మిమ్ములను ఎవరికి అమ్మివేశాను? కేవలం మీ దోషాలను బట్టే మీరు అమ్ముడుపోయారు. మీ తిరుగుబాటును బట్టే మీ తల్లికి విడాకులు ఇవ్వడం జరిగింది.

2నేను వచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరు, ఎందుకు? నేను పిలిచినప్పుడు ఎవరూ జవాబు చెప్పలేదెందుకు? నా చెయ్యి మిమ్ములను విమోచించలేనంత కురచగా అయి పోయిందా? విడిపించడానికి నాకు శక్తి లేదా? నా గద్దింపుతో సముద్రాన్ని ఎండిపోయేలా చేస్తాను. నదులను ఎడారిగా చేస్తాను. నీళ్లు లేకపోవడం చేత వాటిలోని చేపలు చచ్చిపోయి కంపుకొడతాయి.

3ఆకాశాన్ని చీకటి కమ్మేలా చేస్తాను. దాన్ని గోనెపట్టతో కప్పుతాను.>>

4అలసినవాణ్ణి నా మాటలతో ఆదరించే జ్ఞానం నాకు కలిగేలా శిష్యునికి ఉండాల్సిన నాలుక యెహోవా నాకిచ్చాడు. శిష్యునిలాగా నేను వినడానికి ఆయన ప్రతి ఉదయాన నన్ను మేల్కొలుపుతాడు.

5ప్రభువైన యెహోవా నా చెవికి వినే బుద్ధి పుట్టించాడు కాబట్టి నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా దూరం జరగలేదు.

6నన్ను కొట్టే వారికి నా వీపును, వెంట్రుకలు పెరికే వారికి నా చెంపలను అప్పగించాను. ఉమ్మి వేసేవారికి, అవమానించే వారికి నా ముఖం దాచుకోలేదు.

7ప్రభువైన యెహోవా నాకు సాయం చేస్తాడు కాబట్టి నేనేమీ సిగ్గుపడలేదు. నాకు సిగ్గు కలగదని తెలుసు కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలాగా చేసుకున్నాను.

8నన్ను నీతిమంతునిగా ఎంచేవాడు నాకు సమీపంగా ఉన్నాడు. నన్ను వ్యతిరేకించే వాడెవడు? మనం కలిసి వాదించుకుందాం. నా ప్రతివాది ఎవడు? అతణ్ణి నా దగ్గరికి రానివ్వండి.

9ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. నా మీద ఎవరు నేరం మోపుతారు? వారంతా బట్టలాగా పాతబడిపోతారు. వారిని చిమ్మెట తినివేస్తుంది.

10మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వాడెవడు? వెలుగు లేకుండా చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకోవాలి.

11ఇదిగో, నిప్పులు వెలిగించి మీ చుట్టూ మంటలను పెట్టుకొనే వారంతా మీ అగ్ని వెలుగులో, మీరు వెలిగించిన మంటల్లో నడవండి. ఇది మీకు నా చేతినుండే కలుగుతున్నది. మీరు వేదనతో పండుకుంటారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 50 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran