Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Isaiah 39 >> 

1ఆ సమయంలో బబులోను రాజు, బలదాను కొడుకు అయిన మెరోదక్ బలదాను హిజ్కియా జబ్బు చేసి బాగుపడ్డాడని విని తన రాయబారులతో ఒక కానుకతోబాటు శుభాకాంక్షల సందేశాన్ని అతనికి పంపించాడు.

2హిజ్కియా వారిని లోపలికి రప్పించి, తన ఇంటిలో, రాజ్యంలో ఉన్న సమస్త వస్తువుల్లో దేనిని దాచిపెట్టకుండా తన సామగ్రి దాచే గదులు, వెండి బంగారాలు, సుగంధద్రవ్యాలు, పరిమళ తైలం, ఆయుధశాల మొదలైన వాటిలో ఉన్న తన పదార్థాలన్నిటినీ వారికి చూపించాడు.

3అప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి <<ఆ మనుషులు ఏమన్నారు? వారు ఎక్కడ నుండి వచ్చారు?>> అని అడిగాడు. హిజ్కియా <<వారు బబులోను అనే దూరదేశం నుంచి వచ్చారు>> అని చెప్పాడు.

4<<వాళ్ళు నీ ఇంటిలో ఏమేమి చూశారు?>> అని అడిగినప్పుడు, హిజ్కియా <<నా వస్తువుల్లో దేనినీ దాచకుండా నా ఇంటిలో ఉన్న సమస్తాన్నీ నేను వారికి చూపించాను>> అన్నాడు.

5అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు. <<యెహోవా చెబుతున్న మాట విను.

6రాబోయే రోజుల్లో ఏమీ మిగలకుండా నీ ఇంటిలో ఉన్న సమస్తాన్నీ, ఈ రోజువరకూ నీ పూర్వికులు పోగుచేసి దాచిపెట్టినదంతా బబులోను పట్టణానికి దోచుకుపోతారని సేనల అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు.

7నీ గర్భంలో పుట్టిన నీ కొడుకులను బబులోను రాజనగరంలో నపుంసకులుగా చేయడానికి వారు తీసుకుపోతారు.>>

8అందుకు హిజ్కియా <<నువ్వు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. అయితే నా జీవితకాలమంతటిలో నాకు శాంతిభద్రతలు, క్షేమం ఉండు గాక>> అని యెషయాతో అన్నాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 39 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran