Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Isaiah 32 >> 

1ఇదిగో, వినండి! ఒక రాజు నీతిమంతంగా రాజ్య పరిపాలన చేస్తాడు. అధిపతులు న్యాయసమ్మతంగా ఏలుబడి చేస్తారు.

2వాళ్ళల్లో ప్రతీ ఒక్కడూ గాలి విసిరినప్పుడు ఆశ్రయంలాగా, తుఫానులో అభయమిచ్చే స్థలంలాగా ఉంటాడు. ఎడారిలో జలధారల్లా, అలసి సొలసిన దేశంలో నీడనిచ్చే గొప్ప రాతి బండలాగా ఉంటాడు.

3అప్పుడు చూసే వాళ్ళ కళ్ళు కాంతిహీనంగా ఉండవు. వినేవాళ్ళ చెవులు శ్రద్ధగా వింటాయి.

4దుడుకుగా ప్రవర్తించేవాళ్ళు వివేకంతో జాగ్రత్తగా ఆలోచిస్తారు. నత్తిగా మాట్లాడేవాడు స్పష్టంగా ధారాళంగా మాట్లాడతాడు.

5మూర్ఖుణ్ణి ఇకమీదట గౌరవనీయుడని చెప్పరు. మోసగాణ్ణి నియమబద్ధమైన వ్యక్తి అని చెప్పరు.

6మూర్ఖుడు మూర్ఖంగా మాట్లాడతాడు. అతడి హృదయం దుర్మార్గం గూర్చీ, దైవరహితమైన పనులను గూర్చీ ఆలోచిస్తుంది. అతడు యెహోవాను గూర్చి తప్పుగా మాట్లాడతాడు. అతడు ఆకలితో ఉన్నవాళ్ళ దగ్గర ఉన్నది కూడా లాగేసుకుంటారు. దాహంతో ఉన్నవాళ్ళకి నీళ్ళు లేకుండా చేస్తాడు.

7మోసగాడి పద్ధతులన్నీ దుర్మార్గంగా ఉంటాయి. పేదవాళ్ళు సరైనదేదో చెప్పినా, పేదవాళ్ళని నాశనం చేయడానికి వాడు అబద్దాలతో పన్నాగాలు పన్నుతాడు.

8అయితే ఒక ఘనుడు గౌరవనీయమైన ఆలోచనలు చేస్తాడు. అతడు చేసే గౌరవనీయమైన పనులను బట్టి అతడు నిలబడతాడు.

9సుఖమైన, తేలికైన జీవితాన్ని జీవించే స్త్రీలారా, లేచి నా మాటలు వినండి. నిశ్చింతగా ఉన్న ఆడపడుచులు, నా మాటలు వినండి.

10మరో సంవత్సరం, కొద్ది రోజులకి మీ నమ్మకం వీగిపోతుంది. నిశ్చింతగా ఉన్న స్త్రీలూ, ద్రాక్షపంట నష్టమౌతుంది. ద్రాక్షపళ్ళు ఇంటికి రావు.

11సుఖమైన, తేలికైన జీవితాన్ని జీవించే పడతులారా, వణకండి. తమపై నమ్మకం కలిగిన స్త్రీలూ, కలవరపడండి. చక్కని మీ బట్టలు తీసివేసి నగ్నంగా తయారవ్వండి. మీ నడుముకి గోనెగుడ్డ కట్టుకోండి.

12ఉల్లాసకరమైన పొలాల కోసం, ఫలభరితమైన ద్రాక్ష తోటల కోసం మీరు ఏడుస్తారు.

13నా ప్రజల భూమిలో ముళ్ళ తుప్పలూ, గచ్చపొదలూ పెరుగుతాయి. వేడుకలు జరిగే పట్టణంలో ఒకప్పుడు సంతోషం నిండిన ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటుంది. పైనుండి ఆత్మ కుమ్మరింపు జరిగే వరకూ,

14రాజ భవనాన్ని విడిచి పెట్టేస్తారు. జనసమ్మర్దమైన పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది. కొండ, నిఘా గోపురాలు ఇక ఎప్పటికీ గుహల్లా ఉంటాయి. అవి అడవి గాడిదలు ఆనందించే స్థలంగానూ, పశువులు మేసే స్థలంగానూ ఉంటాయి. ఆత్మ కుమ్మరింపు జరిగే వరకూ ఇలా జరుగుతుంది.

15తర్వాత అరణ్యం ఫలభరితమైన భూమిగా ఉంటుంది. ఫలభరితమైన భూమి అరణ్యంలా ఉంటుంది.

16అప్పుడు న్యాయం అరణ్యంలో నివసిస్తుంది. ఫలభరితమైన భూమిలో నీతి ఉంటుంది.

17నీతి శాంతిని కలుగ చేస్తుంది. నీతి ఫలితంగా నిత్యమైన నెమ్మదీ నమ్మకమూ కలుగుతాయి.

18నా ప్రజలు శాంతిభరితమైన చోట, సురక్షితమైన ఇళ్ళల్లో నివసిస్తారు.

19కానీ వడగళ్ళు పడి అరణ్యం నాశనమైనప్పుడు పట్టణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.

20మీలో నీటి ప్రవాహాల పక్కనే విత్తనాలు నాటుతూ, అక్కడ తమ ఎద్దులనూ, గాడిదలనూ తిరగనిచ్చేవాడు ధన్యుడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 32 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran