Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Isaiah 31 >> 

1<<ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి పట్టించుకోకుండా, ఆలోచన కోసం యెహోవా దగ్గరకి వెళ్ళకుండా సహాయం కోసం ఐగుప్తుకి వెళ్ళే వాళ్ళకీ, గుర్రాలపై ఆధార పడేవాళ్ళకీ, అసంఖ్యాకంగా ఉన్న వాళ్ళ రథాలపైనా, లెక్కకు మించిన రౌతుల పైనా నమ్మకం ఉంచే వాళ్ళకీ బాధ!

2అయినా ఆయన జ్ఞాని. ఆయన నాశనాన్ని పంపిస్తాడు. తన మాటలను ఆయన వెనక్కి తీసుకోడు. దుర్మార్గుల ఇంటి మీదికీ, పాపులకు సహాయం చేసే వాళ్ళ మీదికీ ఆయన లేస్తాడు.

3ఐగుప్తు వాడు మనిషే. దేవుడు కాదు. వాళ్ళ గుర్రాలు రక్త మాంసాలే, ఆత్మ కాదు. యెహోవా తన చేతిని చాపినప్పుడు సహాయం చేసిన వాడూ, సహాయం పొందినవాడూ, ఇద్దరూ పతనమవుతారు. ఇద్దరూ నాశనం అవుతారు. >>

4యెహోవా నాకు ఇలా చెప్పాడు. <<ఒక సింహం, ఒక కొదమ సింహం తాను వేటాడి తెచ్చిన జంతువు దగ్గర గర్జించినప్పుడు దాన్ని తప్పించడానికి కొందరు గొర్రెల కాపరులు ఎన్ని శబ్దాలు చేసినా కొదమ సింహం వాళ్ళ శబ్దాలకి ఏ మాత్రం భయపడదు. అక్కడి నుంచి జారుకోడానికి ప్రయత్నించదు. ఆ విధంగా సేనల ప్రభువు అయిన యెహోవా యుద్ధం చేయడానికి సీయోను పర్వతం పైకి దిగి వస్తాడు. ఆ పర్వతంపై ఆయన యుద్ధం చేస్తాడు.

5ఎగురుతూ ఉండే పక్షిలాగా సేనల ప్రభువు యెహోవా యెరూషలేమును కాపాడుతాడు. ఆయన దానిపై సంచరించేటప్పుడు దాన్ని సంరక్షిస్తాడు, విడిపిస్తాడు, భద్రపరుస్తాడు.

6ఇశ్రాయేలు ప్రజలారా, ఎవరి నుండి మీరు పూర్తిగా తొలగిపోయారో ఆయన వైపుకి తిరగండి.

7మీలో ప్రతి ఒక్కడూ తన చేతులతో పాపం చేసి తయారు చేసిన వెండి విగ్రహాలనూ, బంగారు విగ్రహాలనూ ఆ రోజున పారవేస్తాడు.

8అష్షూరు కత్తి మూలంగా కూలుతుంది. అయితే అది మనిషి ఝళిపించే కత్తి కాదు. అతడు ఆ కత్తిని ఎదుర్కోలేక పారిపోతాడు. అతని పిల్లలు బానిసలై బలవంతంగా కఠిన శ్రమ చేస్తారు.

9మహా భయం చేత వాళ్ళు నమ్మకాన్ని అంతా కోల్పోతారు. అతని అధిపతులు యెహోవా యుద్ధ జెండాను చూసినంతనే భయపడిపోతారు.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ఆయన అగ్ని సీయోనులోనూ, ఆయన కొలిమి యెరూషలేములోనూ ఉన్నాయి.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 31 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran