Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Isaiah 3 >> 

1చూడండి, సేనలకు అధిపతి, ప్రభువూ అయిన యెహోవా యెరూషలేము నుంచి దాని పోషణ, దాని ఆధారం తీసివేయబోతున్నాడు. దాని ఆహార సంబంధమైన ఆధారం, నీటి సరఫరా,

2శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు,

3సోదెగాళ్ళు, పెద్దలు, పంచ దశాధిపతులు, ఘనత వహించిన వాళ్ళు, మంత్రులు, శిల్పశాస్త్రం తెలిసిన వాళ్ళు, మాంత్రికులు, అందరినీ యెరూషలేములోనుంచీ, యూదా దేశంలోనుంచీ, తీసివేయబోతున్నాడు.

4<< నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను. పసివాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేస్తారు.

5ప్రజల్లో ఒకడు మరొకణ్ణి అణిచివేస్తారు. ప్రతి ఒక్కడూ తన పొరుగువాడి చేత అణిచివేతకు గురౌతాడు. పెద్దవాడి మీద చిన్నవాడు, ఘనుని మీద నీచుడు గర్వించి సవాలు చేసి తిరస్కారంగా ఉంటారు.

6ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుణ్ణి పట్టుకుని, <నీకు పైవస్త్రం ఉంది. నువ్వు మా మీద అధిపతిగా ఉండు. ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలో ఉండనివ్వు> అంటాడు.

7అతడు ఆ రోజున కేక వేసి, <నేను సంరక్షణ కర్తగా ఉండను, నాకు ఆహారం గాని, వస్త్రాలు గాని లేవు. నన్ను ప్రజలకు అధిపతిగా నియమించవద్దు> అంటాడు.>>

8తన మాటలు, చేతలు యెహోవాకు విరుద్ధంగా ఉన్నాయి గనుక యెరూషలేము పాడైపోయింది, యూదా పతనమయ్యింది.

9వాళ్ళ ముఖమే వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. తమ పాపం దాచకుండా సొదొమవాళ్ళలాగా దాన్ని కనపరుస్తారు. వాళ్లకు బాధ! వాళ్ళు తమకు తామే తమ మీదకి ఈ మహా విపత్తు తెచ్చుకున్నారు.

10నీకు మేలు కలుగుతుందని నీతిమంతుడితో చెప్పు. వాళ్ళు తమ క్రియల ఫలం అనుభవిస్తారు.

11దుష్టుడికి బాధ! అతనికి కీడు జరుగుతుంది. అతని చేతి పనుల ఫలం అతడు పొందుతాడు.

12చిన్న పిల్లలు నా ప్రజలను హింసిస్తారు. స్త్రీలు వాళ్ళ మీద ఏలుబడి చేస్తారు. నా ప్రజలారా, మీ నాయకులు మిమ్ములను మీ మార్గంలో అయోమయం పాలుచేసి తప్పు దోవ పట్టిస్తారు.

13తీర్పు తీర్చడానికి యెహోవా ఆవరణలో నిలిచి ఉన్నాడు. తన ప్రజలకు తీర్పు తీర్చడానికి నిలబడి ఉన్నాడు.

14యెహోవా తన ప్రజల పెద్దల మీద, వాళ్ళ నాయకుల మీద తన తీర్పు ప్రకటిస్తాడు. <<మీరే ద్రాక్షతోటను తినేశారు. మీరు దోచుకున్న పేదల సొమ్ము మీ ఇళ్ళల్లోనే ఉంది.

15నా ప్రజలను నలగ్గొట్టి, వాళ్ళ ముఖాలు మీరెందుకు నేల రాస్తున్నారు?>> అని ప్రభువూ, సేనలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు.

16యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమార్తెలు గర్విష్టులు. మెడ చాచి నడుస్తూ, ఓర చూపులు చూస్తూ, కులుకుతో నడుస్తూ, తమ కాళ్ల గజ్జెలు మోగిస్తున్నారు.

17కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల తలల మీద గజ్జి పుండ్లు పుట్టిస్తాడు. వాళ్ళ తలలు యెహోవా బోడి తలలుగా చేస్తాడు.

18ఆ రోజున ప్రభువు వాళ్ళ కాళ్ళ గజ్జెలు, శిరోభూషణాలూ, చంద్రవంక నాగరాలూ,

19కర్ణభూషణాలూ, కడియాలూ, మేలి ముసుగులూ,

20తలకు కట్టుకునే పాగాలూ, కాళ్ల గొలుసులూ, ఒడ్డాణాలూ, పరిమళ ద్రవ్యపు భరిణెలూ,

21తాయెత్తులు, ఉంగరాలు, ముక్కు కమ్మలు,

22ఉత్సవ వస్త్రాలూ, ఉత్తరీయాలూ, పైటలూ, సంచులూ,

23చేతి అద్దాలు, సన్ననారతో నేసిన జలతారు ముసుగులు, పాగాలు, శాలువాలు తీసేస్తాడు.

24అప్పుడు పరిమళ ద్రవ్యానికి బదులుగా దుర్గంధం, నడికట్టుకు బదులుగా తాడూ, అల్లిన జడకు బదులుగా బోడి తల, ప్రశస్థమైన పైటకు బదులు గోనెపట్టా, అందానికి బదులు వాత ఉంటాయి.

25మనుషులు కత్తివాత కూలి పోతారు. యుద్ధంలో నీ శూరులు పడిపోతారు.

26యెరూషలేము గుమ్మాలు శోకించి దుఃఖిస్తాయి. ఆమె ఒంటరిదై నేల మీద కూర్చుంటుంది.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 3 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran