Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Isaiah 18 >> 

1అయ్యో! ఇతియోపియా నదుల అవతల టపటపా కొట్టుకునే రెక్కలున్న దేశానికి దుఃఖం!

2అది సముద్రంపై నీళ్ళ మీద జమ్ము పడవల్లో రాయబారులను పంపిస్తూ ఉంది. వేగిరపడే వార్తాహరులారా! వెళ్ళండి. నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజల దగ్గరికి వెళ్ళండి! చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేసే ఆ బలమైన జనాల దగ్గరకూ, నదులు విభజించే వాళ్ళ దేశానికీ వెళ్ళండి!

3ప్రపంచంలో నివసించే మీరు, భూమిపైన జీవించే మీరు పర్వతాల పైన సంకేతంగా జెండా ఎత్తినప్పుడు చూడండి! బాకా ఊదినప్పుడు వినండి!

4యెహోవా నాకు చెప్పిన మాట ఇదే. <<వేసవిలో ఉడుకెత్తే వేడిలా, కోతకాలంలో ఏర్పడే పొగమంచు మబ్బులా నేను నిశ్శబ్దంగా నా నివాస స్థలం నుండి గమనిస్తూ ఉంటాను.>>

5కోతకాలం రాకముందు పువ్వు వికసించే దశ ముగిసిన తర్వాత, పువ్వు ద్రాక్షగా మారుతున్న దశలో ఆయన పోటకత్తులతో ద్రాక్షకాయలను కత్తిరిస్తాడు. వ్యాపిస్తున్న ద్రాక్ష కొమ్మలను నరికి అవతల పారవేస్తాడు.

6వాటిని పర్వతాల్లోని పక్షులకూ, భూమి మీద ఉన్న మృగాలకూ వదిలివేస్తాడు. వేసవికాలంలో పక్షులూ, చలికాలంలో భూమి మీద మృగాలూ వాటిని తింటాయి.

7ఆ రోజుల్లో నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజలు, చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేస్తూ ఆ బలమైన జనాలు, నదులతో నిండి ఉన్న వాళ్ళ దేశం నుండి సేనల ప్రభువు అయిన యెహోవాకు కానుకలు తీసుకుని వస్తారు. సేనల ప్రభువు అయిన యెహోవా నామాన్ని ధరించిన సీయోను పర్వతానికి తీసుకు వస్తారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 18 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran