Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Isaiah 17 >> 

1ఇది దమస్కు నగరం గూర్చిన దైవ ప్రకటన. <<దమస్కు ఇక మీదట నగరంగా ఉండదు. అది శిథిల గృహంలా ఉంటుంది.

2అరోయేరు పట్టణాలు జనాలు లేకుండా ఉంటాయి. అవి గొర్రెల మందలు మేసే ప్రదేశాలవుతాయి. అవి అక్కడ ఎవరి భయమూ లేకుండా పడుకుంటాయి.

3ఎఫ్రాయిములో భద్రత కోసం కట్టిన ప్రాకారాలూ, దమస్కులో రాజ్యాధికారమూ మాయమవుతాయి. ఇశ్రాయేలు ప్రజల ప్రాభవానికి జరిగినట్టే సిరియాలో మిగిలి ఉన్న వారికీ జరుగుతుంది.>> ఇది సేనల ప్రభువైన యెహోవా మాట.

4<<ఆ రోజుల్లో యాకోబు ప్రాభవం హీన దశకు చేరుకుంటుంది. బలిసిన అతని శరీరం చిక్కి పోతుంది.

5అది పంట కోసేవాడు ధాన్యాన్ని సమకూర్చినట్టుగా, అతడి చేయి కంకులను కోసినట్టుగా ఉంటుంది. రెఫాయీము లోయలో ఒకడు పరిగె సేకరించినట్టుగా ఉంటుంది.

6అయినా ఒలీవ చెట్టును దులిపినప్పుడు పైన కొన్ని పళ్ళు మిగిలి ఉన్నట్టుగా పరిగె మిగిలి ఉంటుంది. రెండు మూడు ఒలీవ పళ్ళు చిట్టచివరి కొమ్మలో మిగిలి ఉన్నట్టుగా, ఫలభరితమైన చెట్టు చిటారు కొమ్మలో నాలుగైదు పళ్ళు మిగిలి ఉన్నట్టుగా పరిగె మిగిలి ఉంటుంది.>> ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రకటన ఇది.

7ఆ రోజుల్లో మనుషులు తమ సృష్టికర్త వైపు చూస్తారు. ఇశ్రాయేలు ప్రజల పరిశుద్ధ దేవునిపై తమ దృష్టి నిలుపుతారు.

8తమ చేతులతో చేసిన బలిపీఠాలను గానీ, తమ చేతివేళ్ళతో చేసిన ఆషేరా దేవతా స్తంభాలను గానీ, సూర్యుడి విగ్రహాలను గానీ చూడరు.

9ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల భయం వల్ల వాళ్ళు వదిలి వెళ్ళిన బలమైన పట్టణాలు కొండ శిఖరాల పైన నిర్జనమైన అడవుల్లా ఉంటాయి. అవి నాశనమై పోతాయి.

10ఎందుకంటే నీ రక్షణకు కారకుడైన దేవుణ్ణి నువ్వు మర్చి పోయావు. నీ బలానికి ఆధారంగా ఉన్న బండను అలక్ష్యం చేశావు. కాబట్టి నువ్వు అందమైన మొక్కలను నాటావు. అన్య దేశాల ద్రాక్ష చెట్లు నాటావు.

11నువ్వు వాటిని నాటిన రోజున దానికి కంచె వేసి సేద్యం చేశావు. త్వరలోనే నీ విత్తనాలు ఫలించి మొక్కలు పెరిగాయి. కానీ అమితమైన దుఃఖం, భయంకరమైన విచారం కలిగే రోజున నీ పంట విఫలమవుతుంది.

12అయ్యో! భీకరమైన సముద్ర ఘోషలా అనేక జనాలు వేసే కేకలు, బలమైన నీటి ప్రవాహపు హోరులాగా అనేక జాతులు తరలి పోతున్న శబ్దాలూ వినిపిస్తున్నాయి.

13అనేక నీటి ప్రవాహాల హోరులాగా జాతులు గర్జిస్తున్నాయి. కానీ దేవుడు వాళ్ళని గద్దిస్తాడు. వాళ్ళు దూరంగా పారిపోతారు. గాలికి ఎగిరిపోయే చచ్చిన మొక్కలను గాలి ఎగర గొట్టినట్టుగా, సుడిగాలిలో పిచ్చి మొక్కలు గిర్రున తిరిగి పోయినట్టుగా వాళ్ళు పారిపోతారు.

14సాయంత్రం, చూడండి, భయోత్పాతం! ఉదయం కాకుండానే వాళ్ళు కనిపించకుండా పోతారు. మమ్ములను దోచుకునే వాళ్లకి పట్టే గతి ఇదే. మా సంపదను దొంగతనం చేసేవాళ్ళకి దక్కేది ఇదే.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 17 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran