Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Revelation 20 >> 

1తరువాత ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ అగాధం తాళం చెవీ ఉన్నాయి.

2అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం అయిన మహా సర్పాన్ని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు.

3వాణ్ణి అగాధంలో పడవేసి, దాన్ని మూసివేసి దానికి ముద్ర వేశాడు. ఆ వెయ్యి సంవత్సరాలయ్యే వరకూ ప్రజలను మోసం చేయకుండా వాడు అగాధంలోనే బందీగా ఉండాలి. ఆ తరువాత కొద్ది సమయం వాణ్ణి వదిలిపెట్టాలి.

4అప్పుడు సింహాసనాలు చూశాను. వాటిపై కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చారు. యేసును గురించి తాము చెప్పిన సాక్ష్యం కోసమూ, దేవుని వాక్కును ప్రకటన చేసినందుకూ తల నరికించుకున్న భక్తుల ఆత్మలు చూశాను. వారు క్రూర మృగాన్ని గానీ, వాడి విగ్రహాన్ని గానీ పూజించలేదు. వారి నుదుటి మీద గానీ చేతి మీద గానీ ముద్ర వేయనీయలేదు. వారిప్పుడు సజీవులై క్రీస్తుతో కలిసి వెయ్యేళ్ళు పరిపాలించారు.

5ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు. ఇదే మొదటి పునరుత్థానం.

6ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు పరిశుద్ధులు, దీవెన పొందిన వారు. వీళ్ళపై రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికీ, క్రీస్తుకీ యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.

7వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు.

8వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో ఉన్న గోగు, మాగోగులను మోసం చేసి లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని యుద్ధానికై సమకూరుస్తాడు.

9వారు అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.

10వారిని మోసం చేసిన అపవాదిని గంధకం ఉన్న అగ్ని సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు.

11తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు.

12చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.

13సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు.

14మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం.

15జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Revelation 20 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran