Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Revelation 19 >> 

1ఈ విషయాలు జరిగిన తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు ఒక పెద్ద శబ్దం పరలోకంలో నుండి నాకు వినిపించింది. “హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే.

2ఆయన తీర్పులు సత్యంగా న్యాయంగా ఉన్నాయి. తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన మహా వేశ్యను ఆయన శిక్షించాడు. ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతీకారం తీర్చాడు.”

3రెండోసారి వారంతా, “హల్లెలూయ! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది” అన్నారు.

4అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి, “ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు.

5అప్పుడు, “దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు, గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి” అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది.

6తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది. “హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.”

7“గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది. కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం. ఆయనకు మహిమ ఆపాదించుదాం.”

8ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, పరిశుభ్రమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు. ఈ శ్రేష్ఠవస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు.

9అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు.

10అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగపడబోయాను. కానీ అతడు, “అలా చేయకు! యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకూ నేను తోటి దాసుణ్ణి మాత్రమే” అన్నాడు.

11తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు.

12ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు.

13ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది.

14ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్ల గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు.

15వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప లాఠీతో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు.

16ఆయన బట్టల మీదా, తొడ మీదా ‘రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు’ అనే పేరు రాసి ఉంది.

17అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండడం నేను చూశాను. అతడు బిగ్గరగా కేక వేసి పైన ఎగిరే పక్షుల్ని పిలిచాడు, “రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి.

18రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, బలవంతుల మాంసం, గుర్రాల మాంసం, వాటిపై స్వారీ చేసేవారి మాంసం, స్వతంత్రులూ, బానిసలూ, పలుకుబడి లేనివారూ, గొప్పవారూ అయిన మనుషులందరి మాంసం, వచ్చి తినండి” అన్నాడు.

19క్రూరమృగం, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండడం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు.

20అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేశాడు. ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు.

21మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా ఆరగించాయి.


  Share Facebook  |  Share Twitter

 <<  Revelation 19 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran