Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Revelation 15 >> 

1పరలోకంలో మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం నేను చూశాను. అదేమిటంటే ఏడుగురు దేవదూతలు తమ చేతుల్లో ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇవి చివరివి. వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది.

2తరువాత నేను ఒక గాజు సముద్రం లాంటిది చూశాను. దానితో అగ్ని కలసి ఉంది. క్రూర మృగాన్నీ, దాని విగ్రహాన్నీ, దాని పేరునూ సూచించే సంఖ్యనూ జయించిన వారు ఆ గాజు సముద్రం దగ్గర నిలబడి ఉండడం నేను చూశాను. వారి చేతుల్లో దేవుడు ఇచ్చిన తీగ వాయిద్యాలు ఉన్నాయి.

3వారు దేవుని సేవకుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ, “ప్రభువైన దేవా, సర్వపరిపాలకా, నీవి గొప్పకార్యాలు, అద్భుతాలు. సార్వభౌమా, నీ విధానాలు న్యాయమైనవి, సత్యమైనవి.

4ప్రభూ, నువ్వు మాత్రమే పరిశుద్ధుడివి, నీకు భయపడనివారెవరు? నీ నామాన్ని కీర్తించనిదెవరు? నీ న్యాయక్రియలు అందరికీ తెలిశాయి. కాబట్టి అన్ని జాతుల వారూ నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు.”

5ఆ తరువాత నేను చూస్తున్నప్పుడు పరలోకంలో సాక్షపు గుడారం ఉన్న అతి పరిశుద్ధ స్థలం తెరుచుకుంది.

6అప్పుడు ఏడు తెగుళ్ళు చేతిలో పట్టుకుని ఏడుగురు దూతలు ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చారు. వారంతా పవిత్రమైన, ప్రకాశవంతమైన బట్టలు వేసుకుని ఉన్నారు. రొమ్ముకు బంగారు వల్లెవాటు కట్టుకుని ఉన్నారు.

7అప్పుడు ఆ నాలుగు ప్రాణుల్లో ఒకడు ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాడు. ఆ పాత్రల్లో నిత్యం జీవించే దేవుని ఆగ్రహం నిండి ఉంది.

8దేవుని యశస్సు నుండీ, బలం నుండీ లేచిన పొగతో అతి పరిశుద్ధ స్థలం నిండిపోయింది. కాబట్టి ఆ ఏడుగురు దూతలకిచ్చిన కీడులన్నీ జరిగే వరకూ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Revelation 15 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran