Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Revelation 12 >> 

1అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సంకేతం కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్ర బింబం ఉంది. ఆమె తలపై పన్నెండు నక్షత్రాల కిరీటం ఉంది.

2ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులకు తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది.

3ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి.

4వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం.

5ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనప దండం పట్టుకుని జాతులన్నిటిపై పరిపాలన చేయాల్సి ఉంది. ఆమె బిడ్డను ఆమె దగ్గరనుంచి లాక్కుని దేవుని దగ్గరకూ, ఆయన సింహాసనం దగ్గరకూ తీసుకు వెళ్ళారు.

6ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. అక్కడ ఆమెను 1,260 రోజులు ఉంచి పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.

7అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేశాడు.

8కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర దూతలకూ స్థానం లేకపోయింది.

9ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచర దూతలనూ భూమి మీదికి తోసి వేశారు.

10అప్పుడు పరలోకం నుండి బిగ్గరగా ఒక స్వరం వినపడింది, “మన సోదరులను నిందించే వాడూ, పగలనీ రాత్రనీ లేకుండా దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపే వాడైన అపవాదిని భూమి మీదికి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా శక్తీ రాజ్యమూ వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది.

11వారు గొర్రెపిల్ల రక్తం తోనూ, తమ సాక్షాలతోనూ వాణ్ణి జయించారు. మరణం వచ్చినా సరే, తమ ప్రాణాలను ప్రేమించలేదు.

12కాబట్టి పరలోకమూ, పరలోకంలో నివసించే వారూ, సంబరాలు చేసుకోండి. భూమీ, సముద్రం, మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ దగ్గరికి దిగి వచ్చాడు. వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు.

13తనను భూమి పైకి తోసివేయడాన్ని చూసి ఆ మహాసర్పం, మగబిడ్డను ప్రసవించిన ఆ స్త్రీని వెంటాడాడు.

14కానీ అరణ్యంలో తనకు సిద్ధం చేసిన చోటుకు వెళ్ళడానికి ఆమె డేగ రెక్కల్లాంటి రెండు రెక్కలు పొందింది. అక్కడ సర్పానికి అందుబాటులో లేకుండా ఒక కాలం, కాలాలు, ఒక అర్థకాలం ఆమెకు పోషణ ఏర్పాటయింది.

15కాబట్టి ఆ స్త్రీ నీళ్ళలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదీ ప్రవాహంగా వెళ్ళగక్కాడు.

16కానీ భూమి ఆ స్త్రీకి సహాయం చేసింది. అది నోరు తెరచి ఆ మహాసర్పం నోటి నుండి వచ్చిన నదీ ప్రవాహాన్ని మింగివేసింది.

17అందుచేత తీవ్రమైన ఆగ్రహం తెచ్చుకున్న ఆ మహా సర్పం, దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్న ఆమె సంతానంలో మిగిలిన వారితో యుద్ధం చేయడానికి బయల్దేరాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Revelation 12 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran