Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Deuteronomy 3 >> 

1మనం తిరిగి బాషాను దారిలో వెళ్తుండగా బాషాను రాజు ఓగు, అతని ప్రజలంతా ఎద్రెయీలో మనతో యుద్ధం చేయడానికి ఎదురుగా వచ్చారు.

2యెహోవాా నాతో ఇలా అన్నాడు, <<అతనికి భయపడ వద్దు. అతన్నీ అతని ప్రజలనూ అతని దేశాన్నీ నీ చేతికి అప్పగించాను. హెష్బోనులో అమోరీయుల రాజు సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడా చేయాలి.>>

3ఆ విధంగా మన దేవుడు యెహోవాా బాషాను రాజు ఓగును, అతని ప్రజలందరినీ మన చేతికి అప్పగించాడు. అతనికి ఎవ్వరూ మిగలకుండా అందరినీ హతం చేశాం.

4ఆ కాలంలో అతని పట్టణాలన్నీ స్వాధీనం చేసుకున్నాం. మన స్వాధీనంలోకి రాని పట్టణం ఒక్కటీ లేదు. బాషానులో ఓగు రాజ్యం అర్గోబు ప్రాంతంలో ఉన్న 60 పట్టణాలు ఆక్రమించుకున్నాం.

5ఆ పట్టణాలన్నీ గొప్ప ప్రాకారాలు, ద్వారాలు, గడియలతో ఉన్న దుర్గాలు. అవిగాక ప్రాకారాలు లేని ఇంకా చాలా పట్టణాలు స్వాధీనం చేసుకున్నాం.

6మనం హెష్బోను రాజు సీహోనుకు చేసినట్టు వాటిని నిర్మూలం చేశాం. ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ నాశనం చేశాం.

7వారి పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.

8ఆ కాలంలో అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ, యొర్దాను అవతల ఉన్న దేశాన్ని ఇద్దరు అమోరీయుల రాజుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నాం.

9సీదోనీయులు హెర్మోనును <<షిర్యోను>> అనేవారు. అమోరీయులు దాన్ని <<శెనీరు>> అనేవారు.

10మైదానంలోని పట్టాణాలన్నిటిని, బాషానులోని ఓగు రాజ్య పట్టణాలైన సల్కా, ఎద్రెయీ అనేవాటి వరకూ గిలాదు అంతటినీ బాషానునూ ఆక్రమించాం.

11రెఫాయీయులలో బాషాను రాజు ఓగు మాత్రం మిగిలాడు. అతనిది ఇనుప మంచం. అది అమ్మోనీయుల రబ్బాలో ఉంది గదా? దాని పొడవు తొమ్మిది మూరలు, వెడల్పు నాలుగు మూరలు.

12అర్నోను లోయలో ఉన్న అరోయేరు నుండి గిలాదు కొండ ప్రాంతంలో సగమూ మనం అప్పుడు స్వాధీనం చేసుకొన్న దేశమూ దాని పట్టణాలూ రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను.

13ఓగు రాజుకు చెందిన బాషాను అంతటినీ, గిలాదులో మిగిలిన రెఫాయీయుల దేశమని పిలిచే బాషానునూ, అర్గోబు ప్రాంతమంతా మనష్షే అర్ధ గోత్రానికి ఇచ్చాను.

14మనష్షే కొడుకు యాయీరు గెషూరీయుల, మాయాకాతీయుల సరిహద్దుల వరకూ అర్గోబు ప్రాంతాన్ని పట్టుకొని, తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామాలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ వాటి పేరు అదే.

15మాకీరీయులకు గిలాదును ఇచ్చాను.

16గిలాదు నుండి అర్నోను లోయ మధ్య వరకూ, యబ్బోకు నది వరకూ, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకూ రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను.

17ఇవి కాక, కిన్నెరెతు నుండి తూర్పున పిస్గా కొండ వాలుల కింద, ఉప్పు సముద్రం అని పిలిచే అరాబా సముద్రం దాకా వ్యాపించిన అరాబా ప్రాంతాన్ని, యొర్దాను లోయ మధ్యభూమిని, రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను.

18అప్పుడు నేను మీతో, <<మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడు యెహోవాా ఈ దేశాన్ని మీకిచ్చాడు. మీలో యుద్ధవీరులంతా సిద్ధపడి మీ సోదరులైన ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నది దాటి రావాలి.

19యెహోవాా మీకు విశ్రాంతినిచ్చినట్టు మీ సోదరులకు కూడా విశ్రాంతినిచ్చే వరకూ నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి.

20అంటే మీ యెహోవాా దేవుడు యొర్దాను అవతల వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునే వరకూ, మీ భార్యలు, మీ పిల్లలు, మీ మందలు నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. ఆ తరువాత మీరు మీ స్వాస్థ్యాలకు తిరిగి రావాలి అని మీకు ఆజ్ఞాపించాను. మీ మందలు చాలా ఎక్కువని నాకు తెలుసు>> అన్నాను.

21ఆ సమయంలో నేను యెహోషువకు ఇలా ఆజ్ఞాపించాను, <<మీ యెహోవాా దేవుడు ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా నువ్వు కళ్ళారా చూశావు గదా. నువ్వు వెళ్తున్న రాజ్యాలన్నిటికీ యెహోవాా అదే విధంగా చేస్తాడు.

22మీ యెహోవాా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి వారికి భయపడ వద్దు.>>

23ఆ రోజుల్లో నేను, <<యెహోవాా, ప్రభూ, నీ మహిమనూ, నీ బాహుబలాన్నీ నీ దాసునికి చూపించడం ప్రారంభించావు.

24ఆకాశంలో గాని, భూమిపై గాని నువ్వు చేసే పనులు చేయగల దేవుడెవడు? నీ అంత పరాక్రమం చూపగల దేవుడెవడు?

25నేను అవతలికి వెళ్లి యొర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశాన్ని, ఆ మంచి కొండ ప్రాంతాన్ని, ఆ లెబానోనును చూసేలా అనుగ్రహించు>> అని యెహోవాాను బతిమాలుకున్నాను.

26యెహోవాా మీ కారణంగా నా మీద కోపపడి నా మనవి వినలేదు. ఆయన నాతో ఇలా అన్నాడు. <<చాలు. ఇంక ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు.

27నువ్వు ఈ యొర్దాను దాటకూడదు. అయితే, పిస్గా కొండ ఎక్కి పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు తేరి చూడు.

28నీకు బదులుగా యెహోషువకు ఆజ్ఞాపించి, అతణ్ణి ప్రోత్సహించి, బలపరచు. అతడు ఈ ప్రజలను నడిపించి, నది దాటి, నువ్వు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకొనేలా చేస్తాడు.>>

29ఆ సమయంలో మనం బేత్పయోరు ఎదుట ఉన్న లోయలో ఉన్నాం.


  Share Facebook  |  Share Twitter

 <<  Deuteronomy 3 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran