Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Deuteronomy 18 >> 

1యాజకులుగా నియమితులైన లేవీయులకు, అంటే లేవీగోత్రం వారికి ఇశ్రాయేలు ప్రజలతో భాగం గానీ, వారసత్వపు హక్కు గానీ ఉండవు. వారు యెహోవాాకు దహనబలిగా అర్పించే వాటినే తింటారు.

2వారి సోదరులతో వారికి వారసత్వం ఉండదు. యెహోవాా వారితో చెప్పినట్టు ఆయనే వారి వారసత్వం.

3ఎవరైనా ఎద్దును గానీ, గొర్రెెను గానీ, మేకను గానీ బలిగా అర్పించినప్పుడు అర్పించిన వాటి కుడి జబ్బ, రెండు దవడలు, పొట్ట భాగం యాజకులకు ఇవ్వాలి.

4ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో ప్రథమ ఫలం యాజకునికి ఇవ్వాలి. గొర్రెెల బొచ్చు కత్తిరింపులో మొదటి భాగం యాజకునికి ఇవ్వాలి.

5యెహోవాా పేరున నిలబడి ఎప్పుడూ సేవ చేయడానికి మీ గోత్రాలన్నిటిలో అతణ్ణి, అతని సంతానాన్నీ మీ యెహోవాా దేవుడు ఎన్నుకున్నాడు.

6ఒక లేవీయుడు ఇశ్రాయేలు దేశంలో తాను నివసిస్తున్న ఒక ఊరిలో నుంచి యెహోవాా ఏర్పరచుకునే చోటుకు వచ్చేందుకు ఆసక్తి కనపరిస్తే

7అక్కడ యెహోవాా ఎదుట నిలబడే లేవీయుల్లాగే అతడు తన యెహోవాా దేవుని పేరున సేవ చేయవచ్చు.

8తన పిత్రార్జితాన్ని అమ్మగా వచ్చినది కాక, ఇతరుల్లాగే అతడు వంతు పొందాలి.

9మీ యెహోవాా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ ప్రజల నీచమైన పనులను మీరు చేయడానికి నేర్చుకోకూడదు.

10తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి,

11ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించే వాణ్ణి మీమధ్య ఉండనివ్వకూడదు.

12వీటిని చేసే ప్రతివాడూ యెహోవాాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవాా దేవుడు మీ ఎదుట నుంచి ఆ ప్రజల్ని వెళ్లగొట్టేస్తున్నాడు.

13మీరు మీ యెహోవాా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి.

14మీరు స్వాధీనం చేసుకోబోయే ప్రజలు మేఘ శకునాలు చెప్పేవారి మాట, సోదె చెప్పేవారి మాట వింటారు. మీ యెహోవాా దేవుడు అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు.

15మీ యెహోవాా దేవుడు మీ మధ్య నా వంటి ప్రవక్తను మీ సోదరుల్లోనుంచి మీ కోసం పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి.

16హోరేబులో సమావేశమైన రోజున మీరు, <<మా యెహోవాా దేవుని స్వరం మళ్ళీ మనం వినొద్దు, ఈ గొప్ప అగ్నిని ఇకనుంచి మనం చూడొద్దు. లేకపోతే మేమంతా చస్తాం>> అన్నారు.

17అప్పుడు యెహోవాా నాతో ఇలా అన్నాడు, <<వాళ్ళు చెప్పిన మాట బాగానే ఉంది.

18వాళ్ళ సోదరుల్లోనుంచి నీలాంటి ప్రవక్తను వారికోసం పుట్టిస్తాను. అతని నోట్లో నా మాటలు ఉంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించేదంతా అతడు వారితో చెబుతాడు.

19అతడు నా పేరుతో చెప్పే నా మాటల్ని విననివాణ్ణి నేను శిక్షిస్తాను.

20అయితే, ఏ ప్రవక్త అయినా అహంకారంతో, నేను చెప్పమని తనకాజ్ఞాపించని మాటను నా పేరున చెబితే, లేదా ఇతర దేవుళ్ళ పేరున చెబితే ఆ ప్రవక్త కూడా చావాలి.>>

21ఏదైనా ఒక సందేశం యెహోవాా చెప్పింది కాదని మేమెలా తెలుసుకోగలం అని మీరనుకుంటే,

22ప్రవక్త యెహోవాా పేరుతో చెప్పినప్పుడు ఆ మాట జరగకపోతే, ఎన్నటికీ నెరవేరకపోతే అది యెహోవాా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారంతోనే దాన్ని చెప్పాడు కాబట్టి దానికి భయపడవద్దు.


  Share Facebook  |  Share Twitter

 <<  Deuteronomy 18 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran