Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 90 >> 

1ప్రభూ, తరతరాలుగా నువ్వే మాకు నివాసస్థానం.

2పర్వతాలు ఉనికిలోకి రాకముందే, భూమినీ లోకాన్నీ నువ్వు సృష్టించకముందే, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే దేవుడివి.

3నువ్వు మనుషుల్ని తిరిగి మట్టిగా మారుస్తావు. మనుషులారా, తిరిగి రండి, అంటావు.

4నీ దృష్టిలో వెయ్యేళ్ళు గడిచిపోయిన నిన్నలాగా ఒక రాత్రిపూటలాగా ఉన్నాయి.

5వరదలో కొట్టుకుపోయినట్టు నువ్వు వారిని లాక్కెళ్ళిపోతావు, వాళ్ళు నిద్ర పోతారు. పచ్చ గడ్డిలాగా వాళ్ళు పొద్దున్నే చిగురిస్తారు.

6ఉదయాన అది మొలిచి పెరుగుతుంది, సాయంకాలం అది వాడిపోయి ఎండిపోతుంది.

7నీ కోపం చేత మేము హరించుకుపోతున్నాం, నీ ఉగ్రత మమ్మల్ని భయపెడుతూ ఉంది.

8మా అపరాధాలను నువ్వు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి.

9నీ ఉగ్రత భరిస్తూ మా జీవితం గడుపుతున్నాం. నిట్టూర్పులాగా మా జీవితకాలం త్వరగా గడిచిపోతుంది.

10మా ఆయుర్దాయం డెభ్భై ఏళ్ళు. ఆరోగ్యంగా ఉంటే ఎనభై ఏళ్ళుకూడా ఉండొచ్చు. అయినా మా శ్రేష్ట కాలం కష్టాలూ దుఃఖాలే. అవును, అవి త్వరగా గడిచిపోతాయి. మేము ఎగిరిపోతాం.

11నీ కోపం ఎంత తీవ్రమో ఎవరికి తెలుసు? నీ ఆగ్రహం దానికి తగిన భయాన్ని రేపుతుందని ఎవరికి తెలుసు?

12కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.

13యెహోవా, తిరిగి రా! ఎంతకాలం పడుతుంది? నీ సేవకుల పట్ల జాలి పడు.

14ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా రోజులన్నీ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతాం.

15నువ్వు మమ్మల్ని బాధించిన రోజుల లెక్కప్రకారం మేము కష్టాలు అనుభవించిన సంవత్సరాలకు తగ్గట్టుగా మమ్మల్ని సంతోషపరచు.

16నీ సేవకులకు నీ పని చూపించు, మా సంతానం నీ ఘనత చూడనివ్వు.

17మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 90 >> 


Bible2india.com
© 2010-2026
Help
Dual Panel

Laporan Masalah/Saran