Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 89 >> 

1యెహోవా కృపాకార్యాలను నేను కలకాలం గానం చేస్తాను. రాబోయే తరాలకు నీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తాను.

2నేను అంటున్నాను, నిబంధన విశ్వసనీయత శాశ్వతంగా స్థాపించావు. నీ సత్యం పరలోకంలో శాశ్వతంగా స్థిరపరచావు.

3నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను.

4శాశ్వతంగా ఉండేలా నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను.సెలా.

5యెహోవా, ఆకాశాలు నీ అద్భుతాలను ప్రస్తుతిస్తాయి, పవిత్రుల సమావేశంలో నీ విశ్వసనీయతకు స్తుతులు కలుగుతున్నాయి.

6ఆకాశాల్లో యెహోవాకు సాటి ఎవడు? దైవపుత్రుల్లో యెహోవాలాంటి వాడెవడు?

7పవిత్రుల సభలో ఆయన గౌరవనీయుడైన దేవుడు. తన చుట్టూ ఉన్న వారందరిలో ఆయన సంభ్రమాశ్చర్యాలుగొలిపే వాడు.

8యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీలాంటి బలిష్టుడెవడు? నీ విశ్వాస్యత నిన్ను ఆవరించి ఉంది.

9ఉప్పొంగే సముద్రాన్ని నువ్వు అదుపులో ఉంచుతావు, అలలు ఉవ్వెత్తుగా లేస్తే నువ్వు వాటిని అణచివేస్తావు.

10చచ్చిన దానితో సమానంగా నువ్వు రాహాబును నలిపేశావు. నీ బాహుబలంతో నీ శత్రువులను చెదరగొట్టి వేశావు.

11ఆకాశాలు నీవే, భూమి కూడా నీదే. లోకాన్నీ దానిలో ఉన్నదంతా నువ్వే చేశావు.

12ఉత్తర దక్షిణ దిక్కులను నువ్వే సృష్టించావు. తాబోరు హెర్మోనులు నీ నామాన్నిబట్టి ఆనందిస్తున్నాయి.

13నీకు బలిష్టమైన హస్తం ఉంది. నీ హస్తం దృఢమైనది. నీ కుడిచెయ్యి ఘనమైనది.

14నీతిన్యాయాలు నీ సింహాసనానికి ఆధారాలు. కృప, నమ్మకత్వం నీకు ముందుగా నడుస్తాయి.

15నిన్ను ఆరాధించే వాళ్ళు ధన్యులు! యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్ళు నడుస్తారు.

16నీ నామాన్ని బట్టి వాళ్ళు రోజంతా ఆనందిస్తారు, నీ నీతిలో వాళ్ళు నిన్ను పొగడుతారు.

17వాళ్ళ వైభవోపేతమైన బలం నువ్వే. నీ దయవల్ల మాకు విజయం కలిగింది.

18మా డాలు యెహోవాది. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధుడు.

19ఒకప్పుడు నువ్వు దర్శనంలో నీ భక్తులతో మాట్లాడావు. నువ్విలా అన్నావు, నేను ఒక శూరుడికి కిరీటం పెట్టాను. ప్రజల్లోనుంచి ఎన్నుకుని అతణ్ణి హెచ్చించాను.

20నా సేవకుడైన దావీదును నేను ఎన్నుకున్నాను. నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.

21నా చెయ్యి అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది.

22ఏ శత్రువూ అతన్ని మోసగించలేడు, దుర్మార్గులు ఎవరూ అతన్ని అణచలేరు.

23అతని శత్రువులను అతని ఎదుటే పడగొడతాను. అతన్ని ద్వేషించే వాళ్ళను నేను చంపేస్తాను.

24నా సత్యం, నా కృప అతనికి తోడుగా ఉంటుంది. నా నామాన్నిబట్టి అతనికి విజయం వస్తుంది.

25సముద్రం మీద అతని చేతినీ నదుల మీద అతని కుడిచేతినీ నేను ఉంచుతాను.

26నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు.

27నేను అతన్ని నా పెద్దకొడుకుగా చేసుకుంటాను, భూరాజులందరికంటే ఉన్నత స్థితి ఇస్తాను.

28నా కృప శాశ్వతంగా అతనిపట్ల ఉండేలా చేస్తాను. నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది.

29అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను ఆకాశమున్నంత వరకూ అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను.

30అతని సంతానం నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే, నా ఆజ్ఞల్ని అనుసరించకపోతే,

31వాళ్ళు నా నియమాలను ఉల్లంఘించి నా న్యాయవిధులను పాటించకపోతే,

32నేను వారి తిరుగుబాటుకు బెత్తంతో, వారి దోషానికి దెబ్బలతో శిక్షిస్తాను.

33అయితే నా కృపను అతనినుంచి తీసివేయను. నామాట తప్పను.

34నా ఒడంబడిక నేను రద్దు చేయను. నా పెదాల మీది మాట మార్చను.

35అతని సంతానం శాశ్వతంగా ఉంటుంది అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా ఎదుట ఉంటుంది

36చంద్రుడున్నంత కాలం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది.

37నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను దావీదుతో నేను అబద్ధమాడను. సెలా.

38అయితే నువ్వు మమ్మల్ని నిరాకరించి వదిలేశావు, నీ అభిషిక్తుని మీద నువ్వు కోపంతో ఉన్నావు.

39నీ సేవకుని ఒడంబడిక విడిచిపెట్టేశావు. అతని కిరీటాన్ని నేల మీద పడేసి అపవిత్రపరచావు.

40అతని గోడలన్నీ నువ్వు పగలగొట్టావు. అతని కోటలను పాడుచేశావు.

41దారిన పోయేవాళ్ళంతా అతన్ని దోచుకున్నారు. తన పొరుగువాళ్లకు అతడు నిందకు ఆస్పదమయ్యాడు.

42అతని విరోధుల కుడిచేతిని నువ్వు హెచ్చించావు. అతని శత్రువులందరికీ నువ్వు ఆనందం కలిగించావు.

43అతని కత్తిమొన తొలగించావు యుద్దంలో అతన్ని నిలవకుండా చేశావు.

44అతని వైభవానికి చరమగీతం పాడావు. అతని సింహాసనాన్ని నేలమట్టం చేశావు.

45అతని యువప్రాయాన్ని కుదించావు. సిగ్గుతో అతన్ని కప్పావు. సెలా.

46యెహోవా, ఎంతకాలం? నువ్వు శాశ్వతంగా దాక్కుంటావా? ఎంతకాలం నీ కోపం మంటలాగా మండుతూ ఉంటుంది?

47నా ఆయుష్షు ఎంత స్వల్పమో తలచుకో. పనికిరాని దేనికోసం నువ్వు మనుషులందరినీ సృష్టించావు?

48చావకుండా బతికేవాడెవడు? లేక మృత్యులోకంనుంచి తన జీవాన్ని తప్పించుకోగల వాడెవడు? సెలా.

49ప్రభూ, నీ విశ్వసనీయతతో నువ్వు దావీదుతో ప్రమాణం చేసి మొదట చూపిన నీ కృపా కార్యాలు ఏవి?

50ప్రభూ, నీ సేవకులకు వచ్చిన నిందను బలమైన రాజ్యాలన్నిటి నుంచి వచ్చిన అవమానాన్ని నా గుండెలో నేనెలా భరిస్తున్నానో తలచుకో.

51యెహోవా, నీ శత్రువులు నిందలు మోపుతున్నారు, నీ అభిషిక్తుని అడుగులపై వాళ్ళు నిందలు మోపుతున్నారు.

52యెహోవాకు శాశ్వతంగా స్తుతి కలుగు గాక. ఆమేన్‌, ఆమేన్‌.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 89 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran