Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 79 >> 

1దేవా, విదేశీయులు నీ వారసత్వ భూమిలోకి వచ్చేశారు, వాళ్ళు నీ పవిత్రాలయాన్ని అపవిత్రపరచారు. యెరూషలేమును రాళ్ళ కుప్పగా మార్చివేశారు.

2వాళ్ళు నీ సేవకుల శవాలను రాబందులకు ఆహారంగా, నీ భక్తుల మృత దేహాలను అడవి జంతువులకు ఆహారంగా పడేశారు.

3నీళ్లలాగా వారి రక్తాన్ని యెరూషలేము చుట్టూ పారబోశారు. వాళ్ళను పాతిపెట్టేవారు ఎవరూ లేరు.

4మా పొరుగు వారికి మేము ఎగతాళి అయ్యాం. మా చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని వెక్కిరించి అపహసిస్తారు.

5యెహోవా, ఎంతకాలం నీకు మా మీద కోపం? నీ కోపం శాశ్వతంగా ఉంటుందా? నీ రోషం ఎంతకాలం మంటలాగా మండుతూ ఉంటుంది?

6నిన్నెరగని రాజ్యాల మీద, నీ పేరున ప్రార్థన చేయని రాజ్యాల మీద నీ ఉగ్రత కుమ్మరించు.

7వాళ్ళు యాకోబు సంతతిని దిగమింగారు. అతని గ్రామాలను పాడు చేశారు.

8మేమెంతో కుంగిపోయి ఉన్నాం. మా పూర్వీకుల అపరాధాలకు మమ్మల్ని బాధ్యుల్ని చేయవద్దు. నీ వాత్సల్యం మా మీదికి రానివ్వు.

9దేవా, మా రక్షకా! నీ పేరు ప్రతిష్టలకు తగ్గట్టుగా మాకు సాయం చెయ్యి. నీ నామాన్ని బట్టి మా పాపాలను క్షమించి మమ్మల్ని రక్షించు.

10వాళ్ళ దేవుడెక్కడ? అని ఇతర ప్రజలు ఎందుకు అనాలి? వాళ్ళు ఒలికించిన నీ సేవకుల రక్తం విషయం ప్రతిదండన మా కళ్ళ ఎదుట కనబడనీ.

11ఖైదీల నిట్టూర్పులు నీ దగ్గరికి రానివ్వు, నీ గొప్ప బలంతో చావనై ఉన్న వారిని కాపాడు.

12ప్రభూ, మా పొరుగు దేశాలు నిన్ను నిందించినందుకు ప్రతిగా వారిని ఏడంతల నిందకు గురి చెయ్యి.

13అప్పుడు నీ ప్రజలమూ నీ మంద గొర్రెలమూ అయిన మేము ఎప్పటికీ నీకు ధన్యవాదాలు చెబుతాం. తరతరాలకు నీ కీర్తి ప్రచురిస్తాం.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 79 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran