Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 77 >> 

1నేను బిగ్గరగా దేవునికి మొరపెడతాను, నేను దేవుణ్ణి పిలుస్తాను, నా దేవుడు నా మాట వింటాడు.

2నా కష్ట సమయంలో నేను ప్రభువును వెతికాను. రాత్రంతా నేను నా చేతులెత్తి ప్రార్థించాను, నా ప్రాణం ఓదార్పు పొందడం లేదు.

3నా వేదనలో నేను దేవుణ్ణి గుర్తు చేసుకున్నాను, నీరసించిపోయి నేను ఆయన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. సెలా

4నువ్వు నా కళ్ళు తెరచి ఉంచుతున్నావు. నేను మాట్లాడలేనంతగా కలవరపడుతున్నాను.

5గతించిన రోజులనూ గత కాలాన్నీ గురించి ఆలోచించాను,

6ఒకప్పుడు నేను పాడిన పాట రాత్రివేళ గుర్తుకు తెచ్చుకున్నాను. నేను జాగ్రత్తగా ఆలోచించాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.

7ప్రభువు శాశ్వతంగా నన్ను తోసివేస్తాడా? ఆయన ఇంకెన్నటికీ మళ్ళీ నా మీద దయ చూపడా?

8ఆయన కృప ఎప్పటికీ రాదా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నేరవేరదా?

9దేవుడు కనికరించడం మరచిపోయాడా? ఆయన కోపం దయకు అడ్డుపడిందా? సెలా

10ఇది నా బాధ. మా పట్ల సర్వశక్తుని కుడి చెయ్యి మారుతూ ఉంది, అని నేనన్నాను.

11అయితే యెహోవా, గతంలోని నీ అద్భుత క్రియలను నేను గుర్తుకు తెచ్చుకుంటాను.

12నీ పనులన్నిటినీ నేను తలంచుకుంటాను. వాటిని మననం చేసుకుంటాను.

13దేవా! నీ తీరు అసాధారణం. మన గొప్ప దేవునికి సాటి అయిన దేవుడెవరు?

14నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, ప్రజా సమూహాల్లో నువ్వు నీ ప్రభావాన్ని ప్రత్యక్షపరచావు.

15నీ గొప్ప బలంతో నీ ప్రజలకు- యాకోబు యోసేపుల సంతతికి విజయాన్నిచ్చావు. సెలా

16దేవా, నీళ్ళు నిన్ను చూశాయి, నీళ్ళు నిన్ను చూసి భయపడ్డాయి, అగాధంలోని నీళ్ళు వణికిపోయాయి.

17మబ్బులు నీళ్లు కుమ్మరించాయి, ఆకాశం గర్జించింది, నీ బాణాలు రివ్వున ఎగిశాయి.

18నీ ఉరుముల మోత సుడిగాలిలో మోగింది. మెరుపులు లోకాన్ని వెలిగించాయి. భూమి వణికి కంపించింది.

19సముద్రంలో నీ దారి వెళ్ళింది. ప్రవాహాల్లోగుండా నీ దారి మళ్ళింది. అయితే నీ కాలిముద్రలు కనబడలేదు.

20మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందలాగా నడిపించావు.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 77 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran