Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 65 >> 

1దేవా, సీయోనులో నీ ఎదుట మౌనంగా కనిపెట్టడం, నీకు మా మొక్కుబడి చెల్లించడం ఎంతో మంచిది.

2ప్రార్థన ఆలకించే నీ దగ్గరికి మనుషులంతా వస్తారు.

3మా దోషాలు మమ్మల్ని ముంచెత్తాయి. మా అతిక్రమాలకు నీవే ప్రాయశ్చిత్తం చేస్తావు.

4నీ ఆవరణల్లో నివసించడానికి నీవు ఎంపిక చేసుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం అనే నీ మందిరంలోని మేలుతో మేము తృప్తిపొందుతాము.

5మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతాల్లో, దూర సముద్రం మీద ఉన్న వారికందరికీ నీవే ఆశ్రయం. నీతిని బట్టి అద్భుతమైన క్రియల ద్వారా నువ్వు మాకు జవాబిస్తావు.

6బలాన్నే నడికట్టుగా కట్టుకుని నీ శక్తితో పర్వతాలను స్థిరపరచింది నువ్వే.

7నువ్వే సముద్రాల హోరునూ వాటి అలల ఘోషనూ శాంతింపజేసేవాడివి. ప్రజల అల్లరిని అణిచేవాడివి.

8నీ క్రియలు జాడలను చూసి ఈ భూమి అంచుల్లో నివసించే ప్రజలు భయపడతారు. తూర్పు పడమరలు సంతోషించేలా చేసేది నువ్వే.

9నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. దాన్ని ఐశ్వర్యవంతం చేస్తున్నావు. దేవుని నది జలమయంగా ఉంది. నువ్వు భూమిని ఆ విధంగా సిద్ధం చేసి మానవాళికి ధాన్యం దయ చేస్తున్నావు.

10దాని దుక్కులను నీళ్లతో సమృద్ధిగా తడిపి దాని నాగటి చాళ్ళను చదును చేస్తున్నావు. వాన జల్లు కురిపించి దాన్ని మెత్తన చేస్తున్నావు. అది మొలకెత్తినప్పుడు దాన్ని ఆశీర్వదిస్తున్నావు.

11సంవత్సరమంతటికీ నీ మంచితనం ఒక కిరీటంగా ఉంది. నీ రథ చక్రాల జాడలు సారం ఒలికిస్తున్నాయి.

12అడవి బీడులు సారాన్ని వెదజల్లుతున్నాయి. కొండలు ఆనందాన్ని నడుముకు కట్టుకున్నాయి.

13గొర్రెల మందలు పచ్చిక మైదానాలను శాలువాలాగా కప్పాయి. లోయలు పంట ధాన్యంతో కప్పి ఉన్నాయి. అవన్నీ సంతోషధ్వని చేస్తున్నాయి. అవన్నీ పాటలు పాడుతున్నాయి.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 65 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran