Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 42 >> 

1మగ జింక సెలయేళ్ల కోసం తృష్ణగొన్నట్టు దేవా, నా హృదయం నీ కోసం తపించిపోతోంది.

2నా ప్రాణం దేవుని కోసం, సజీవుడైన దేవుని కోసం తీవ్రమైన దాహంతో ఉంది. దేవుని సమక్షంలోకి నేను ఎప్పుడు వస్తాను? ఆయన సమక్షంలో నేను ఎప్పుడు కనిపిస్తాను?

3నా శత్రువులు ప్రతినిత్యం నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? అంటుంటే నా కన్నీళ్ళే రేయింబవళ్ళు నాకు ఆహారమయ్యాయి.

4జన సమూహంతో కలసి వాళ్ళని దేవుని మందిరానికి తీసుకు వెళ్ళిన సంగతినీ, వాళ్ళతో కలసి సంతోష గానంతో, స్తుతులతో పండగ చేసుకున్న సంగతినీ జ్ఞాపకం చేసుకుంటుంటే నా ప్రాణం కరిగి నీరైపోతున్నది.

5నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? అంతరంగంలో నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. ఆయన సన్నిధి సహాయం కోసం నేను ఆయన్ని స్తుతిస్తాను.

6నా దేవా, నా హృదయం నాలో నిరుత్సాహంగా ఉంది. కాబట్టి యొర్దాను ప్రదేశం నుండీ హెర్మోను పర్వతం నుండీ మిసారు కొండ నుండీ నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను.

7నీ జలపాతాల ధ్వనికి అగాధం అగాధాన్ని పిలుస్తుంది. నీ అలలూ నీ కెరటాలూ నా పైగా ప్రవహిస్తున్నాయి.

8అయినా పగటివేళ యెహోవా తన నిబంధన కృప కలగాలని ఆజ్ఞాపిస్తాడు. రాత్రిపూట ఆయనను గూర్చిన గీతం నాతో ఉంటుంది. నా జీవానికి దేవుడైన యెహోవా ప్రార్ధన నాతో ఉంటుంది.

9నా ఆశ్రయశిల అయిన దేవునితో ఇలా అంటాను. నువ్వు నన్నెందుకు మర్చిపోయావు? శత్రువు నన్ను అణగదొక్కుతూ ఉంటే నేను రోదిస్తూ ఎందుకు తిరగాలి?

10నీ దేవుడు ఏమయ్యాడని నా శత్రువులు నన్ను ప్రశ్నిస్తూ ఉంటే అది నా ఎముకల్లో బాకులాగా గుచ్చుకుంటుంది.

11నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? అంతరంగంలో నువ్వు ఎందుకు ఆందోళనపడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. ఆయన సన్నిధి సహాయం కోసం నేను ఆయన్ని స్తుతిస్తాను.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 42 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran