Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 40 >> 

1యెహోవా కోసం నేను సహనంతో వేచి ఉన్నాను. ఆయన నా మాటలు విన్నాడు. నా మొర ఆలకించాడు.

2భీకరమైన గుంటలో నుండి, జారుడు మట్టితో నిండి ఉన్న ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నా పాదాలను రాయిపై నిలబెట్టాడు. నా అడుగులు స్థిరం చేశాడు.

3తనకు స్తుతులు చెల్లించే ఒక కొత్త పాటను మన దేవుడు నా నోట్లో ఉంచాడు. అనేకమంది దాన్ని చూసి ఆయన్ని కీర్తిస్తారు. యెహోవాలో నమ్మకముంచుతారు.

4యెహోవాను నమ్ముకోకుండా అబద్దాలను నమ్మేవాళ్ళనూ అహంకారులనూ పట్టించుకోకుండా యెహోవానే తన ఆధారంగా చేసుకున్న వాడు ధన్యజీవి.

5యెహోవా నా దేవా, నువ్వు చేసిన ఆశ్చర్యకరమైన పనులు అసంఖ్యాకంగా ఉన్నాయి. మా కోసం నీకున్న ఆలోచనలు లెక్కించడానికి వీల్లేనంత ఉన్నాయి. ఒకవేళ నేను వాటి గురించి చెప్పాలనుకుంటే అవి లెక్కకు అందనంత ఎక్కువ ఉన్నాయి.

6నీకు బలులన్నా, నైవేద్యాలన్నా సంతోషం ఉండదు. అయితే నువ్వు నా చెవులు తెరిచావు. దహన బలులుగానీ పాపం కోసం చేసే బలులు గానీ నీకు అక్కర లేదు.

7అప్పుడు నేను ఇలా చెప్పాను. ఇదిగో, నేను వచ్చాను. పుస్తకపు చుట్టలో నా గురించి రాసిన దాని ప్రకారం నేను వచ్చాను.

8నా దేవా, నీ సంకల్పాన్ని నెరవేర్చడం నాకు సంతోషం.

9నేను నీతిని గూర్చిన శుభవార్తను మహా సమాజంలో ప్రకటించాను. యెహోవా, అది నీకు తెలుసు.

10నీ నీతిని నా హృదయంలో దాచుకుని ఉండలేదు. నీ విశ్వసనీయతనూ, నీ ముక్తినీ నేను ప్రకటించాను. నీ నిబంధన కృపనూ, నీ విశ్వసనీయతనూ మహా సమాజానికి ప్రకటించకుండా నేను దాచలేదు.

11యెహోవా, నా కోసం నువ్వు కనికరంతో చేసే పనులను నా నుండి దూరం చేయకు. నీ నిబంధన కృప, నీ విశ్వసనీయత ఎప్పుడూ నన్ను కాపాడనీ.

12అసంఖ్యాకమైన ఆపదలు నన్ను చుట్టుముట్టాయి. నా దోషాలు నన్ను తరిమి పట్టుకున్నాయి. దాంతో నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను. అవి నా తల వెంట్రుకలకంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. నా గుండె జారిపోయింది.

13యెహోవా, దయచేసి నన్ను కాపాడు. నాకు సహాయం చేయడానికి వేగిరపడు.

14నా ప్రాణం తీయాలని నా వెంటపడే వాళ్ళు సిగ్గుపడేలా, అయోమయానికి గురయ్యేలా చెయ్యి. నన్ను గాయపరచాలని చూసేవాళ్ళు వెనక్కి మళ్లేలా, అవమానానికి గురయ్యేలా చెయ్యి.

15నన్ను చూసి ఆహా, ఆహా అనే వాళ్ళు తమకు కలిగిన అవమానం చూసి విభ్రాంతి చెందాలి.

16నీ కోసం చూసే వాళ్ళంతా నీలో సంతోషించి, ఆనందిస్తారు గాక! నీ రక్షణను ప్రేమించే వాళ్ళంతా అందరూ యెహోవాను స్తుతించాలి అని చెప్తారు గాక!

17నేను పేదవాణ్ణి. అవసరాల్లో ఉన్నాను. అయినా ప్రభువు నా గురించి ఆలోచిస్తున్నాడు. నా సహాయం నువ్వే. నన్ను కాపాడటానికి నువ్వు వస్తావు. నా దేవా, ఆలస్యం చేయకు.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 40 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran