Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 39 >> 

1ఇది నా నిర్ణయం, నా నాలుకతో పాపం చేయకుండా ఉండటానికి నా మాటలను జాగ్రత్తగా చూసుకుంటాను. దుర్మార్గుడి సమీపంలో నా నోటికి కళ్ళెం వేసుకుంటాను.

2నేను మౌనంగా ఉన్నాను. మంచి సంగతులను కూడా పలకకుండా ఉన్నాను. నా వేదన అధికమైంది.

3నా గుండె నాలో రగులుతూ ఉంది. ఈ విషయాలను గూర్చి నేను ఆలోచిస్తూ ఉంటే అది ఇంకా అగ్నిలా మండుతున్నది. చివరకు నేను ఇలా అన్నాను.

4యెహోవా, నా జీవితం ఎప్పుడు అంతమౌతుందో నాకు తెలియజెయ్యి. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియజెయ్యి. నా జీవితం ఎంత క్షణ భంగురమో నేను తెలుసుకునేలా చెయ్యి.

5ఇదిగో, నువ్వు నా జీవితంలో రోజులను ఒక బెత్తెడంతగా చేశావు. నా జీవితకాలం నీ ఎదుట అసలు లేనట్టే ఉంది. ప్రతి మనిషీ నిశ్చయంగా కేవలం ఊపిరిలాగా ఉన్నాడు. సెలా.

6నిశ్చయంగా ప్రతి మనిషీ నీడలా తిరుగుతూ ఉంటాడు. నిస్సందేహంగా మనుషులు సంపదలు సమకూర్చుకోవడానికి త్వరపడుతూ ఉంటారు, అవన్నీ చివరగా ఎవరికి దక్కుతాయో తెలియకపోయినా సరే.

7ప్రభూ, ఇప్పుడు నేను దేని కోసం వేచి ఉన్నాను? నాకున్న ఆధారం నువ్వే.

8నా పాపాలన్నిటిపైనా నాకు విజయం దయచెయ్యి. మూర్ఖులు అవమానించడానికి లక్ష్యంగా నన్ను చేయవద్దు.

9ఇదంతా నువ్వే జరిగించావు. నేను నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాను.

10నన్ను గాయపరచడం ఇక ఆపు. నీ చేతి దెబ్బ నన్ను అణచివేస్తుంది.

11పాపం కారణంగా నువ్వు మనుషుల్ని శిక్షించినప్పుడు చెద పురుగులా వారి శక్తిని నువ్వు హరిస్తావు. నిశ్చయంగా మనుషులందరూ ఆవిరిలాంటి వాళ్ళు. సెలా.

12యెహోవా, నా ప్రార్థన విను. నేను చెప్పేది విను. నా రోదనను పట్టించుకో. చెవిటివాడిలాగా ఉండకు. నీ ఎదుట నేను పరదేశిలా ఉన్నాను. నా పూర్వీకులందరిలాగ శరణార్ధిలాగా ఉన్నాను.

13నేను చనిపోయేముందు నేను సంతోషించేలా నా నుంచి నీ కోపపు చూపులు చాలించుకో.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 39 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran