Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 34 >> 

1అన్ని సమయాల్లో నేను యెహోవాను స్తుతిస్తాను. నా నోట్లో నిత్యమూ ఆయన స్తుతి ఉంటుంది.

2నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక!

3నాతో కలసి యెహోవాను ప్రశంసించండి. మనం అందరం కలసి ఆయన నామాన్ని పైకెత్తుదాం.

4నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటిమీదా నాకు విజయమిచ్చాడు.

5ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు.

6అణచివేతకు గురైన ఈ వ్యక్తి విలపించాడు. దాన్ని యెహోవా విన్నాడు. సమస్యలన్నిటి నుండి అతణ్ణి రక్షించాడు.

7యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు.

8యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి.

9యెహోవా ఎన్నుకున్న ప్రజలారా! ఆయన అంటే భయమూ, భక్తీ కలిగి ఉండండి. ఆయనంటే భయభక్తులు ఉన్నవాడికి ఎలాంటి కొరతా ఉండదు.

10సింహం పిల్లలు ఆహారం లేక ఆకలితో ఉంటాయి. కాని యెహోవాను సమీపించి ప్రార్ధించే వారికి అన్ని మేళ్లూ కలుగుతాయి.

11పిల్లలూ, రండి, నా మాటలు వినండి. యెహోవా అంటే భయభక్తులు నేను మీకు బోధిస్తాను.

12జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించే వాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చేయాలి?

13దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్దాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.

14చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.

15యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్ధనలను వింటూ ఉన్నాయి.

16చెడు కార్యాలు చేసే వాళ్ళ జ్ఞాపకం భూమిపై ఉండకుండా చేయడానికి యెహోవా వాళ్లకు విరోధంగా ఉన్నాడు.

17ధర్మాత్ములు ప్రార్ధించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.

18విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.

19ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.

20ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. వాటిలో ఒక్కటి కూడా విరిగి పోదు.

21చెడుతనం దుర్మార్గుల్ని హతం చేస్తుంది. ధర్మాత్ముణ్ణి అసహ్యించుకునే వాడు శిక్ష పొందుతాడు.

22యెహోవా తన సేవకుల ప్రాణాలను విడుదల చేస్తాడు. ఆయన శరణు వేడిన వాడికి శిక్ష ఉండదు.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 34 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran