Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 19 >> 

1ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది!

2రోజు వెంబడి రోజు అది మాట్లాడుతూ ఉంది. రాత్రి వెంబడి రాత్రి జ్ఞానం కనపరుస్తూ ఉంది.

3వాటికి భాష గాని మాటలు గాని లేవు. వాటి స్వరం వినిపించదు.

4అయినా వాటి మాటలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి, వాటి ఉపదేశం భూమి అంచుల వరకూ వెళ్ళింది. వాటిలో ఆయన సూర్యుడికి గుడారం వేశాడు.

5సూర్యుడు తన విడిదిలోనుంచి బయటకు వస్తున్న పెళ్లి కొడుకులాగా, పందెంలో పరిగెత్తడానికి వేగిరపడే దృఢకాయునిలాగా ఉన్నాడు.

6ఆకాశంలో సూర్యుడు ఈ దిగంశాన ఉదయించి ఆ దిక్కుకు దాటతాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.

7యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి.

8యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి.

9యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి.

10అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి.

11వాటివల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. వాటికి లోబడినందువల్ల గొప్ప ప్రతిఫలం ఉంటుంది.

12తన పొరపాట్లు తాను తెలుసుకోగలిగే వారెవరు? దాచిన తప్పులనుంచి నన్ను శుద్ధి చెయ్యి.

13దురహంకార పాపాల్లో పడకుండా నీ సేవకుణ్ణి కాపాడు. అవి నన్ను ఏలకుండా చెయ్యి. అప్పుడు నేను పరిపూర్ణుడిగా ఉంటాను. అనేక అతిక్రమాల విషయం నిర్దోషిగా ఉంటాను.

14యెహోవా, నా ఆశ్రయశిలా, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవుతాయి గాక.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 19 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran