Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 18 >> 

1యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

2యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు.

3స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను నివేదన చేస్తాను, నేను నా శత్రువులనుంచి రక్షణ పొందుతాను.

4మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, దుర్మార్గులు వరద ప్రవాహంలా నా మీద పడి నన్ను అణిచివేస్తున్నారు

5పాతాళ పాశాలు నన్ను చుట్టుముట్టాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి.

6నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు సహాయం చెయ్యమని దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలోనుంచి నా స్వరం విన్నాడు, నా నివేదన ఆయన సన్నిధిలో ఆయన చెవిన పడింది.

7అప్పుడు భూమి కంపించి వణికింది. దేవుడు కోపంగా ఉన్నాడు గనక పర్వతాల పునాదులు కూడా కదిలి వణికాయి.

8ఆయన ముక్కు పుటాలనుంచి పొగ లేచింది. ఆయన నోట్లోనుంచి అగ్ని వచ్చి నిప్పులు రగిలించింది.

9ఆయన ఆకాశాలను తెరిచి కిందకు వచ్చాడు. ఆయన పాదాల కింద చిమ్మచీకటి ఉంది.

10కెరూబు మీద స్వారీ చేస్తూ ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద ఆయన తేలి వచ్చాడు.

11తన చుట్టూ అంధకారాన్ని, దట్టమైన వర్షమేఘాలను గుడారంగా చేశాడు.

12ఆయన ఎదుట మెరుపులు, వడగళ్ళు, మండుతున్న నిప్పులు కురిసాయి.

13యెహోవా ఆకాశంలో ఉరిమాడు! సర్వోన్నతుడు సింహనాదం చేసి వడగళ్ళు, మండుతున్న నిప్పులు కుమ్మరించాడు.

14ఆయన తన బాణాలు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాడు. మెరుపులు మెండుగా మెరిపించి వాళ్ళను బెదరగొట్టాడు.

15యెహోవా, నీ నాసికారంధ్రాల ఊపిరికి నీ సింహనాదానికి ప్రవాహాలు బయలు దేరాయి. భూమి పునాదులు బయటపడ్డాయి.

16పైనుంచి చెయ్యి చాపి ఆయన నన్ను అందుకున్నాడు. దూసుకొచ్చే జలప్రవాహాలనుంచి నన్ను బయటకు లాగాడు.

17నన్ను ద్వేషించే నా బలమైన శత్రువులనుంచి ఆయన నన్ను రక్షించాడు. ఎందుకంటే వాళ్ళను ఎదుర్కొనే బలం నాకు లేదు.

18ఆపత్కాలంలో వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు యెహోవా నన్ను ఆదుకున్నాడు.

19విశాలమైన స్థలానికి ఆయన నన్ను తీసుకు వచ్చాడు. నన్నుబట్టి ఆయన సంతోషించాడు గనక ఆయన నన్ను రక్షించాడు.

20నా నిర్దోషత్వాన్నిబట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నా చేతులు పరిశుభ్రంగా ఉన్నాయి గనక ఆయన నన్ను పునరుద్ధరించాడు.

21ఎందుకంటే యెహోవా మార్గాలు నేను అనుసరించాను. దుర్మార్గంగా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు.

22ఆయన న్యాయవిధులన్నీ నా ఎదుట ఉన్నాయి. ఆయన శాసనాలనుంచి నేను వెనుదిరగలేదు.

23పాపం నుంచి నేను దూరంగా ఉన్నాను. ఆయన దృష్టిలో నేను యథార్ధంగా ఉన్నాను.

24కాబట్టి, నేను నిర్దోషిగా ఉన్న కారణంగా, తన దృష్టిలో నా చేతులు పరిశుభ్రంగా ఉన్న కారణంగా యెహోవా నన్ను పునరుద్ధరించాడు.

25నిర్దోషుల పట్ల నిన్ను నువ్వు నిర్దోషివిగా కనపరచుకుంటావు. నమ్మదగిన వాళ్ళ పట్ల నువ్వు నమ్మదగిన వాడివిగా కనపరచుకుంటావు.

26స్వచ్ఛంగా ఉన్నవాళ్ళ పట్ల నిన్ను నువ్వు స్వచ్ఛంగా కనపరచుకుంటావు. అయితే వక్రబుద్ధి గలవాళ్ళ పట్ల వికటంగా ఉంటావు.

27బాధపడే వాళ్ళను నువ్వు రక్షిస్తావు. కాని, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కిందకు అణిచి వేస్తావు!

28నా దీపానికి వెలుగును ఇచ్చేవాడివి నువ్వే. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేస్తాడు.

29నీవల్ల నేను అడ్డంకులను అధిగమించగలను. నా దేవునివల్ల అడ్డుగోడలు దూకగలను.

30దేవుని విషయమైతే, ఆయన పరిపూర్ణుడు. యెహోవా వాక్కు స్వచ్ఛమైనది. ఆయనలో ఆశ్రయం పొందిన వాళ్లకు ఆయన ఒక డాలు.

31యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుడు తప్ప ఆశ్రయశిల ఏది?

32ఒక నడికట్టులాగా నాకు బలం ధరింపజేసేవాడు ఆయనే. నిరపరాధిని తన మార్గంలో నడిపించేవాడు ఆయనే.

33ఆయన నాకాళ్లు జింక కాళ్లలా చురుగ్గా చేస్తున్నాడు, కొండలమీద నన్ను ఉంచుతున్నాడు.

34నా చేతులకు యుద్ధం చెయ్యడం, ఇత్తడి విల్లును వంచడం నేర్పిస్తాడు.

35నీ రక్షణ డాలును నువ్వు నాకిచ్చావు. నీ కుడిచెయ్యి నన్ను ఆదుకుంది, నీ దయ నన్ను గొప్పచేసింది.

36జారిపోకుండా నా పాదాలకింద స్థలం విశాలం చేశావు.

37నా శత్రువులను తరిమి పట్టుకున్నాను. వాళ్ళు నాశనం అయ్యేవరకు నేను వెనుతిరగలేదు.

38వాళ్ళు లేవలేనంతగా వాళ్ళను చితకగొట్టాను. వాళ్ళు నా కాళ్ళ కింద పడ్డారు.

39యుద్ధానికి కట్టిన దట్టీలా నువ్వు నాకు బలం ధరింపజేశావు. నా మీదికి లేచిన వాళ్ళను నువ్వు నా కింద పడేశావు.

40నా శత్రువుల మెడ వెనుకభాగం నువ్వు నాకు అప్పగించావు. నన్ను ద్వేషించిన వాళ్ళను నేను పూర్తిగా నాశనం చేశాను

41వారు సాయం కోసం మొరపెట్టారు గాని వాళ్ళను రక్షించడానికి ఎవరూ రాలేదు. వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు గాని ఆయన వాళ్లకు జవాబివ్వలేదు.

42అప్పుడు గాలికి ఎగిరే దుమ్ములాగా నేను వాళ్ళను ముక్కలుగా కొట్టాను. వీధుల్లో మట్టిని విసిరేసినట్టు విసిరేశాను.

43ప్రజల కలహాలనుంచి నువ్వు నన్ను కాపాడావు. జాతులకు నన్ను సారధిగా చేశావు. నేను ఎరగని ప్రజలు నన్ను సేవిస్తున్నారు.

44నా గురించి వినగానే వాళ్ళు నాకు లోబడుతున్నారు. పరదేశులు బలవంతంగా నాకు సాష్టాంగపడ్డారు.

45తమ దుర్గాలనుంచి పరదేశులు వణుకుతూ బయటకు వచ్చారు.

46యెహోవా జీవం గలవాడు. నా ఆశ్రయశిల స్తుతి పొందుతాడు గాక. నా రక్షణకర్త అయిన దేవుడు ఘనత పొందుతాడు గాక.

47ఆయన నా కోసం పగ తీర్చే దేవుడు. జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.

48ఆయన నా శత్రువులనుంచి నన్ను విడిపించాడు! నా మీదకి లేచిన వారికంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించావు. హింసాత్మక వ్యక్తుల నుంచి నువ్వు నన్ను రక్షించావు.

49అందువల్ల యెహోవా, జాతులలో నేను నీకు కృతజ్ఞత తెలియజేస్తాను. నీ నామానికి స్తుతుల కీర్తన పాడతాను!

50దేవుడు తన రాజుకు గొప్ప జయం ఇస్తాడు. తాను అభిషేకించిన వాడికి, దావీదుకు అతని సంతానానికి, శాశ్వతంగా ఆయన తన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 18 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran