Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 140 >> 

1యెహోవా, దుష్టుల బారి నుండి నన్ను విడిపించు. దుర్మార్గుల చేతుల్లో పడకుండా నన్ను కాపాడు.

2వాళ్ళు తమ హృదయాల్లో ప్రమాదకరమైన తలంపులు పెట్టుకుంటారు. అన్నివేళలా కలహాలు పుట్టించాలని ఎదురు చూస్తుంటారు.

3వాళ్ళు పాము నాలుకలాగా తమ నాలుకలు పదును చేసుకుంటారు. వారి పెదాల కింద పాము విషం ఉంచుకుంటారు. సెలా.

4యెహోవా, దుర్మార్గుల బారిన పడకుండా నన్ను కాపాడు. దౌర్జన్యపరుల చేతిలోనుండి నన్ను రక్షించు. నన్ను పడగొట్టడానికి వాళ్ళు పథకాలు వేస్తున్నారు.

5గర్వాంధులు నాకోసం బోను పెట్టారు. వాళ్ళు దారి పక్కన వల పరిచారు. నన్ను బంధించడానికి ఉచ్చులు పన్నారు. సెలా.

6అయితే నేను యెహోవాతో ఇలా మనవి చేసుకుంటున్నాను, యెహోవా, నా దేవుడివి నువ్వే. నా విన్నపాలు ఆలకించు.

7యెహోవా ప్రభూ, నువ్వే నాకు ఆశ్రయమిచ్చే కోట. యుద్ధ సమయంలో నా తలకు కాపు కాసే వాడివి నువ్వే.

8యెహోవా, భక్తిహీనుల కోరికలను నేరవేర్చకు. వాళ్ళు మిడిసిపడకుండేలా వాళ్ళ పథకాలు భగ్నం చెయ్యి. సెలా.

9నా చుట్టూ మూగిన వాళ్ళ తల మీదికి వాళ్ళ మాటల ద్వారా కీడు కలుగు గాక.

10కణకణలాడే నిప్పులు వాళ్ళపై కురియాలి. వాళ్ళను అగ్నిగుండంలో పడవెయ్యి. ఎన్నటికీ లేవకుండా అగాధంలో పడవెయ్యి.

11దూషకులకు భూమి మీద భద్రత లేకుండా పోవాలి. దౌర్జన్యపరులను ఆపదలు వెంటాడి పడగొట్టాలి.

12బాధితుల తరపున యెహోవా వాదిస్తాడనీ. ఆయన దరిద్రులకు న్యాయం చేకూరుస్తాడని నాకు తెలుసు.

13నీతిపరులు నీ నామానికి కచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవర్తనులు నీ సన్నిధిలో నివసిస్తారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 140 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran