Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 135 >> 

1యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి. ఆయన నామాన్ని కీర్తించండి.

2యెహోవా మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలబడే వాళ్ళంతా యెహోవాను స్తుతించండి.

3యెహోవా మంచి వాడు. ఆయనను స్తుతించండి. ఆయన నామాన్ని కీర్తించడం అత్యంత మనోహరం!

4యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజను తన ఆస్తిగా ఏర్పాటు చేసుకున్నాడు.

5యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. దేవుళ్ళని పిలిచే వాళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడు.

6భూమి పైన, ఆకాశంలో, సముద్రాల్లో, అగాధ సముద్రాల్లో ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు.

7భూమి అంచుల నుంచి ఆయన మేఘాలను రప్పిస్తాడు. వర్షంతో బాటు ఆకాశంలో మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగిలోనుంచి గాలిని బయటికి తెస్తాడు.

8ఈజిప్టు ప్రజల తొలిచూలు సంతానాన్ని, పశువుల తొలి సంతతిని ఆయన హతం చేశాడు.

9ఐగుప్తూ, నీ మధ్య ఆయన సూచకక్రియలు, అద్భుతాలు కనపరచాడు. ఫరోకు, అతని పరివారానికీ వ్యతిరేకంగా వాటిని చేశాడు.

10ఆయన అనేక జాతులపై దాడి చేసాడు. బలిష్టులైన రాజులను ఆయన హతం చేశాడు.

11అమోరీయుల రాజు సీహోనును, బాషాను రాజు ఓగును కనాను రాజ్యాలన్నిటినీ నేలమట్టం చేశాడు.

12ఆయన వాళ్ళ దేశాలను స్వాస్థ్యంగా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చాడు.

13యెహోవా, నీ నామం శాశ్వతంగా నిలుస్తుంది. యెహోవా, నిన్ను గూర్చిన జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది.

14యెహోవా తన ప్రజల పక్షంగా నిలబడతాడు. అయితే తన సేవకుల విషయం కనికరం చూపిస్తాడు.

15ఇతర ప్రజల దేవుళ్ళు మనుషులు తమ చేతులతో తయారు చేసిన వెండి, బంగారం విగ్రహాలు.

16వాటికి నోళ్ళు ఉన్నప్పటికీ మాట్లాడవు. కళ్ళు ఉన్నా చూడలేవు.

17వాటికి చెవులు ఉన్నాయి గానీ వినలేవు. వాటికి నోట్లో ఊపిరి లేదు.

18వాటిని తయారు చేసేవాళ్ళు, వాటిపై నమ్మకముంచి పూజించే వాళ్లంతా వాటిలాగే అవుతారు.

19ఇశ్రాయేలు వంశానికి చెందిన ప్రజలారా, యెహోవాను కీర్తించండి. అహరోను వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి.

20లేవి వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి. యెహోవా అంటే భయభక్తులు ఉన్నవాళ్ళంతా యెహోవాను కీర్తించండి.

21యెరూషలేములో నివసించే యెహోవాకు సీయోనులో స్తుతి కలుగు గాక. యెహోవాను స్తుతించండి.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 135 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran