1ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చెప్పాలి. యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
2మనుషులు మన మీదికి ఎగబడినప్పుడు, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
3వాళ్ళ ఆగ్రహజ్వాలలు మనపై రగులుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు.
4నీళ్ళు మనల్ని కొట్టుకుపోయేలా చేసి ఉండేవి. ప్రవాహాలు మనలను ముంచెత్తి ఉండేవి.
5జల ప్రవాహాల పొంగు మనలను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండేవి.
6వారి పళ్ళు మనల్ని చీల్చివేయకుండా కాపాడిన యెహోవాకు స్తుతి.
7వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకున్నాము.
8భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం.