Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 10 >> 

1యెహోవా, నువ్వెందుకు దూరంగా నిలిచి ఉంటావు? ఆపద సమయాల్లో నువ్వెందుకు దాగి ఉంటావు?

2తమ అహంకారాన్నిబట్టి దుర్మార్గులు పీడిత ప్రజలను తరుముతున్నారు. కానీ వారు పన్నిన మోసపు ఎత్తుగడల్లో వారే చిక్కుకునేలా చెయ్యి.

3దుర్మార్గుడు తమ హృదయవాంఛను బట్టి గర్విస్తాడు. అత్యాశాపరులకు అనుగ్రహం చూపించి యెహోవాను అవమానిస్తాడు.

4దుర్మార్గుడు బహు గర్విష్టి అయిన కారణంగా అతడు యెహోవాను వెదకడు. అతడు దేవుణ్ణి పట్టించుకోడు గనక దేవుని గురించి ఆలోచించడు.

5అన్నివేళలా అతడు ఆందోళన లేనివాడుగా ఉంటాడు. కాని, నీ న్యాయవిధులు అతనికి అందనంత ఎత్తులో ఉన్నాయి. అతడు తన శత్రువులందరినీ చూసి మండిపడతాడు.

6నేను ఎన్నడూ ఓడిపోను, తరతరాల వరకూ విరోధాన్ని చూడను, అని అతడు తన మనసులో అనుకుంటాడు.

7అతని నోరు శాపంతో, కపటంతో, హానికరమైన మాటలతో నిండి ఉంది. అతని నాలుక గాయపరిచి నాశనం చేస్తుంది.

8గ్రామాల దగ్గర అతడు పొంచి ఉంటాడు, రహస్య ప్రదేశాల్లో నిరపరాధులను హత్య చేస్తాడు. నిస్సహాయులైన బాధితుల కోసం అతడి కళ్ళు వెతుకుతాయి.

9గుబురుగా ఉన్న పొదలోని సింహం లాగా అతడు దాగి ఉంటాడు. పీడితులను పట్టుకోవడానికి పొంచి ఉంటాడు. తన వలను లాగి పీడితులను పట్టుకుంటాడు.

10అతని బాధితులు నలిగిపోయి దెబ్బలు తింటారు. వాళ్ళు అతని బలమైన వలల్లో పడిపోతారు.

11దేెెవుడు మరచిపోయాడు, ఆయన తన ముఖం కప్పుకున్నాడు, ఆయనకు చూసే ఉద్దేశం లేదు, అని తన హృదయంలో అనుకుంటాడు.

12యెహోవా లేచి రా. దేవా, నీ చెయ్యెత్తి తీర్పు తీర్చు. పీడితులను మరిచిపోవద్దు.

13నువ్వు నన్ను బాధ్యుణ్ణి చెయ్యవు అని దేవుణ్ణి తృణీకరిస్తూ దుర్మార్గుడు తన హృదయంలో ఎందుకు అనుకుంటున్నాడు?

14నువ్వు దీన్ని గమనించావు. ఎందుకంటే కష్టం, దుఖం కలిగించే వాళ్ళను నువ్వు ఎప్పుడూ గమనిస్తూ ఉంటావు. నిస్సహాయుడు తనను తాను నీకు అప్పగించుకుంటాడు. తండ్రిలేని వాళ్ళను నువ్వు కాపాడతావు.

15దుష్ట దురాత్ముడి చెయ్యి విరగగొట్టు. నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవనుకుని అతడు చేస్తూ వచ్చిన చెడుపనులకు అతన్నే బాధ్యుణ్ణి చెయ్యి.

16ఎన్నటెన్నటికీ యెహోవాయే రాజు. ఆయన తన భూభాగం నుంచి అన్యజాతులను పారదోలుతాడు.

17యెహోవా, పీడితుల అవసరతలు నువ్వు విన్నావు. నువ్వు వాళ్ళ హృదయాన్ని బలపరుస్తావు. వాళ్ళ ప్రార్ధన వింటావు.

18ఏ మనిషీ మళ్ళీ ఎన్నడూ భయభ్రాంతులు కలగజేయకుండా ఉండేలా తండ్రి లేని వాళ్ళను, పీడితులను నువ్వు రక్షిస్తావు.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 10 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran