Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Exodus 34 >> 

1యెహోవా మోషేతో, <<మొదటి పలకల్లాంటి రాతి పలకలు మరో రెండు చెక్కు. నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలు నేను ఆ పలకల మీద రాస్తాను.

2తెల్లవారేటప్పటికి నువ్వు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి దాని శిఖరం మీద నా సన్నిధిలో నిలిచి ఉండాలి.

3ఏ మనిషీ నీతోబాటు ఈ కొండ దగ్గరికి రాకూడదు, ఏ మనిషీ ఈ కొండ మీద ఎక్కడా కనబడకూడదు. ఈ కొండ పరిసరాల్లో గొర్రెెలు గానీ, ఎద్దులుగానీ మేత మేయకూడదు>> అని చెప్పాడు.

4కాబట్టి మోషే మొదటి పలకల్లాంటి రెండు రాతి పలకలు చెక్కాడు. తనకు యెహోవా ఆజ్ఞాపించినట్టు ఉదయాన్నే తొందరగా లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కాడు.

5యెహోవా మేఘం నుండి దిగి అక్కడ మోషే దగ్గర నిలిచి యెహోవా తనను వెల్లడి చేసుకున్నాడు.

6యెహోవా అతని ఎదురుగా అతణ్ణి దాటి వెళ్తూ, <<యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, అమితమైన కృప, సత్యం గల దేవుడు.

7ఆయన వేలాది మందికి తన కృప చూపిస్తాడు. అతిక్రమాలు, అపరాధాలు, పాపాలు క్షమిస్తాడు. అయితే దోషులను ఏమాత్రం శిక్షించకుండా ఉండడు. తండ్రుల దోష ఫలితం మూడు నాలుగు తరాలదాకా వారి సంతానం మీదికి రప్పించేవాడు>> అని ప్రకటించాడు.

8మోషే వెంటనే నేలకు తల వంచి సాష్టాంగపడి నమస్కరించాడు.

9<<ప్రభూ, నా మీద నీకు దయ ఉంటే నా మనవి ఆలకించు. దయచేసి నా ప్రభువు మా మధ్య మాతో ఉండి మాతో కలసి ప్రయాణించాలి. ఈ ప్రజలు మాటకు లోబడేవాళ్ళు కారు. మా అపరాధాలను, పాపాలను క్షమించు. మమ్మల్ని నీ సొత్తుగా స్వీకరించు>> అన్నాడు.

10అందుకు ఆయన, <<ఇదిగో నేను ఒక ఒడంబడిక చేస్తున్నాను. ఇంతవరకు భూమిపై ఎక్కడైనా, ఏ ప్రజల్లోనైనా ఇంత వరకూ చేయని అద్భుత కార్యాలు నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నువ్వు నాయకత్వం వహించి నడిపిస్తున్న ఆ ప్రజలంతా యెహోవా చేసే పనులు చూస్తారు. నేను నీ పట్ల చేయబోయే కార్యాలు భయం కలిగిస్తాయి.

11ఇప్పుడు నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ పాటించు. నేను మీ ఎదుట నుండి అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొడతాను.

12మీరు వెళ్లబోయే ఆ పరదేశపు నివాసులతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. అలా గనక చేసుకుంటే అవి మీకు ఉరిగా మారవచ్చు.

13అందువల్ల మీరు వాళ్ళ బలిపీఠాలను విరగగొట్టాలి, వాళ్ళ దేవుళ్ళ ప్రతిమలను పగలగొట్టాలి, వాళ్ళ దేవతా స్తంభాలను పడదోయాలి.

14మీరు వేరొక దేవునికి మొక్కకూడదు. నేను <రోషం గల దేవుడు> అనే పేరున్న యెహోవాను. నేను రోషం గల దేవుణ్ణి.

15ఆ దేశాల్లో నివసించే ప్రజలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆ ప్రజలు ఇతరుల దేవుళ్ళ విషయం వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. వాళ్ళ దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలు తినమని ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు వాటి విషయం జాగ్రత్త వహించాలి.

16మీ కొడుకులకు వాళ్ళ కూతుళ్ళను పెళ్లి చేసుకోకూడదు. అలా గనక చేస్తే వాళ్ళ కూతుళ్ళు తమ తమ దేవుళ్ళను పూజిస్తూ మీ కొడుకులు కూడా వాళ్ళ దేవుళ్ళను పూజించేలా చేస్తారేమో.

17పోతపోసిన దేవుళ్ళ విగ్రహాలను తయారు చేసుకోకూడదు.

18పొంగజేసే పిండి లేని రొట్టెల పండుగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తునుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమించిన సమయంలో ఏడు రోజులపాటు పొంగజేసే పిండి లేని రొట్టెలు తినాలి. మీరు అబీబు నెలలో ఐగుప్టు లోనుండి బయలుదేరి వచ్చారు గదా.

19జంతువుల్లో మొదట పుట్టిన ప్రతి పిల్ల నాది. నీ పశువుల్లో మొదటిగా పుట్టిన ప్రతి మగది, అది దూడ గానీ, గొర్రెెపిల్ల గానీ అది నాకు చెందుతుంది.

20గాడిదను విడిపించాలంటే దానికి బదులు గొర్రెెపిల్లను అర్పించాలి. గాడిదను విమోచించకపోతే దాని మెడ విరగగొట్టాలి. మీ సంతానంలో పెద్ద కొడుకుని వెల చెల్లించి విడిపించాలి. నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో కనిపించకూడదు.

21ఆరు రోజులు మీ పనులు చేసుకున్న తరువాత ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలి. అది పొలం దున్నే కాలమైనా, కోత కోసే కాలమైనా.

22మీ పొలాల్లో పండిన గోదుమల తొలి పంటల కోత సమయంలో వారాల పండగ ఆచరించాలి. సంవత్సరం ముగింపులో పొలాలనుండి నీ వ్యవసాయ ఫలాన్ని కూర్చుకొని జనమంతా సమకూడి పండగ ఆచరించాలి.

23సంవత్సరంలో మూడుసార్లు పురుషులంతా ఇశ్రాయేలియుల దేవుడు, ప్రభువు అయిన యెహోవా సముఖంలో కనబడాలి.

24మీరు సంవత్సరంలో మూడు సార్లు మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో సమకూడడానికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ నీ భూమిని స్వాధీనం చేసుకోరు. ఎందుకంటే నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్లగొట్టి నీ సరిహద్దులు విస్తరించేలా చేస్తాను.

25నాకు అర్పించే బలుల రక్తంలో పొంగజేసే పదార్థమేమీ ఉండకూడదు. పస్కా పండగలో అర్పించిన ఎలాటి మాంసమైనా ఉదయం దాకా నిలవ ఉండకూడదు.

26నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్టకూడదు.>>

27యెహోవా మోషేతో ఇంకా చెప్పాడు, <<ఇప్పుడు పలికిన మాటలు రాసి ఉంచు. ఎందుకంటే ఈ మాటలను బట్టి నేను నీతో, ఇశ్రాయేలు ప్రజలతో ఒప్పందం చేసుకుంటున్నాను.>>

28మోషే నలభై రాత్రింబగళ్ళు యెహోవా దగ్గరే ఉండిపోయాడు. అతడు భోజనం చెయ్యలేదు, నీళ్ళు తాగలేదు. ఆ సమయంలో దేవుడు చెప్పిన శాసనాలను, అంటే పది ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాడు.

29మోషే సీనాయి కొండ దిగే సమయానికి ఆజ్ఞలు రాసి ఉన్న ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. అతడు ఆయనతో మాట్లాడుతున్న సమయంలో అతని ముఖం వెలుగుతో ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదు. అతడు కొండ దిగి వచ్చాడు.

30అహరోను, ఇశ్రాయేలు ప్రజలు మోషేకు ఎదురు వచ్చారు. ప్రకాశిస్తున్న అతని ముఖం చూసి అతణ్ణి సమీపించడానికి భయపడ్డారు.

31మోషే వాళ్ళను పిలిచాడు. అహరోను, సమాజంలోని పెద్దలంతా అతని దగ్గరికి వచ్చినప్పుడు మోషే వాళ్ళతో మాట్లాడాడు.

32అ తరువాత ఇశ్రాయేలు ప్రజలందరూ అతన్ని సమీపించినప్పుడు సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పిన విషయాలన్నీ వాళ్లకు ఆజ్ఞాపించాడు.

33మోషే వాళ్ళతో ఆ విషయాలు చెప్పడం ముగించిన తరువాత తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు.

34కానీ మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధానం లోకి వెళ్ళినప్పుడల్లా ముసుగు తీసివేసి బయటకు వచ్చేదాకా ముసుగు లేకుండా ఉన్నాడు. అతడు బయటికి వచ్చినప్పుడల్లా యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ ప్రజలకు చెప్పేవాడు.

35ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖం చూసినప్పుడు అది కాంతిమయమై ప్రకాశిస్తూ ఉంది, మోషే ఆయనతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళేవరకు తన ముఖాన్ని ముసుగుతో కప్పుకునేవాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Exodus 34 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran