Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Exodus 31 >> 

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,

2<<యూదా గోత్రానికి చెందిన బెసలేలును నేను నియమించుకున్నాను. అతడు ఊరు కొడుకు, హూరు మనుమడు.

3అతనికి నేను అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, సమస్త జ్ఞానం, నేర్పరితనం ప్రసాదించాను. అతణ్ణి నా ఆత్మతో నింపాను.

4అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కను కోసి నునుపు చేయడంలో నిపుణుడు.

5నేను ప్రసాదించిన సమస్త జ్ఞానం, వివేకాలతో అతడు పనులు జరిగిస్తాడు.

6దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయంగా ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ తయారు చేయగల నిపుణులందరి హృదయాల్లో నా జ్ఞానం ఉంచుతాను.

7నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు సన్నిధి గుడారం, సాక్ష్యపు మందసం, దాని మీద ఉన్న కరుణాపీఠాన్ని, గుడారపు సామగ్రిని తయారు చెయ్యాలి.

8సన్నిధి బల్ల, దాని సామగ్రి, నిర్మలమైన దీపవృక్షం, దాని సామగ్రి తయారు చెయ్యాలి.

9ధూపవేదిక, దహన బలిపీఠం, దాని సామగ్రి, గంగాళం, దాని పీట,

10యాజక ధర్మం నెరవేర్చే అహరోనుకు, అతని కొడుకులకు ప్రతిష్టించిన దుస్తులు సిద్ధం చెయ్యాలి.

11పరిశుద్ధ స్థలం కోసం అభిషేక తైలాన్ని, సుగంధ ధూప ద్రవ్యాలను సిద్ధం చెయ్యాలి. ఇవన్నీ నేను నీకు ఆజ్ఞాపించినట్టు జరగాలి.>>

12యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, <<నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. మీరు నేను నియమించిన విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి.

13మిమ్మల్ని పవిత్రంగా చేసే యెహోవాను నేనే అని మీరు తెలుసుకునేలా విశ్రాంతి దినం నాకు, మీకు, మీ తరతరాలకు ఒక చిహ్నంగా ఉంటుంది.

14అందువల్ల మీరు విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి. అది మీకు పవిత్రమైనది. ఆ దినాన్ని అపవిత్రం చేసే వాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.

15ఆరు రోజులు పని చేసిన తరువాత యెహోవాకు ప్రతిష్ఠితమైన ఏడవ రోజును విశ్రాంతి దినంగా పాటించాలి. విశ్రాంతి దినాన పని చేసే ప్రతివాడికీ తప్పకుండా మరణశిక్ష విధించాలి.

16ఇశ్రాయేలు ప్రజలు తమ తరతరాలు విశ్రాంతి దిన ఆచారం పాటించి ఆ దినాన్ని ఆచరించాలి. ఇది శాశ్వత కాలం నిలిచి ఉండే నియమం.

17నాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య అది శాశ్వతంగా ఒక గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు భూమి ఆకాశాలను సృష్టి చేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు.>>

18ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడడం ముగించిన తరువాత ఆయన తన వేలితో రాసిన శాసనాలు ఉన్న రెండు పలకలను మోషేకు అందించాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Exodus 31 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran