Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Exodus 27 >> 

1నీవు తుమ్మచెక్కతో ఐదు మూరల పొడవు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠం చెయ్యాలి. ఆ బలిపీఠం నలుచదరంగా ఉండాలి. దాని యెత్తు మూడు మూరలు.

2దాని నాలుగు మూలలా దానికి కొమ్ములు చెయ్యాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి; దానికి ఇత్తడి రేకు పొదిగించాలి.

3దాని బూడిద ఎత్తడానికి కుండలను, గరిటెలను, గిన్నెలను, ముళ్ళను, అగ్నిపాత్రలను చెయ్యాలి. ఈ ఉపకారణాలన్నిటినీ ఇత్తడితో చెయ్యాలి.

4దానికి వలలాంటి ఇత్తడి జల్లెడ చెయ్యాలి.

5ఆ వల మీద దాని నాలుగు మూలలా నాలుగు ఇత్తడి రింగులు చేసి ఆ వల బలిపీఠం మధ్యకి చేరేలా కిందిభాగంలో బలిపీఠం గట్టు కింద దాన్ని ఉంచాలి.

6బలిపీఠం కోసం మోతకర్రలను చెయ్యాలి. ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగించాలి.

7ఆ మోతకర్రలను ఆ రింగుల్లో చొప్పించాలి. బలిపీఠం మోయడానికి ఆ మోతకర్రలు దాని రెండువైపులా ఉండాలి.

8పలకలతో గుల్లగా దాన్ని చెయ్యాలి. కొండ మీద నీకు చూపించిన నమూనా ప్రకారం దాన్ని చెయ్యాలి.

9నీవు మందిరానికి ఆవరణం ఏర్పాటు చెయ్యాలి. కుడివైపున, అంటే దక్షిణ దిక్కున ఆవరణం నూరు మూరల పొడవు ఉండాలి. పేనిన సన్న నార తెరలు ఒక వైపుకు ఉండాలి.

10దాని ఇరవై స్తంభాలు, వాటి ఇరవై దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండివి.

11అలాగే పొడవులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడవు గల తెరలు ఉండాలి. దాని ఇరవై స్తంభాలు, వాటి ఇరవై దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండివి.

12పడమటి దిక్కున ఆవరణం వెడల్పులో ఏభై మూరల తెరలు ఉండాలి. వాటి స్తంభాలు పది. వాటి దిమ్మలు పది.

13తూర్పు వైపున, అంటే తూర్పు దిక్కున ఆవరణం వెడల్పు ఏభై మూరలు.

14ఒక వైపు పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.

15రెండవ వైపు పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.

16ఆవరణ ద్వారానికి నీల ధూమ్ర రక్త వర్ణాల తెరలు ఇరవై మూడు ఉండాలి. అవి పేనిన సన్ననారతో కళాకారుని పనిగా ఉండాలి. వాటి స్తంభాలు నాలుగు, వాటి దిమ్మలు నాలుగు.

17ఆవరణం చుట్టూ ఉన్న స్తంభాలన్నీ వెండి పెండెబద్దలు కలవి. వాటి కొక్కేలు వెండివి. వాటి దిమ్మలు ఇత్తడివి.

18ఆవరణం పొడవు నూరు మూరలు. దాని వెడల్పు ఏభై మూరలు. దాని ఎత్తు ఐదు మూరలు. అవి పేనిన సన్ననారతో చేశారు. వాటి దిమ్మలు ఇత్తడివి.

19మందిరంలో వాడే ఉపకరణాలన్నీ ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై యుండాలి.

20దీపం నిత్యం వెలుగుతుండేలా ప్రమిదలకు దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవల నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.

21సాక్ష్యపు మందసం ఎదుట ఉన్న తెర బయట ప్రత్యక్ష గుడారంలో అహరోను, అతని కుమారులు సాయంకాలం మొదలు ఉదయం దాకా యెహోవా సన్నిధిలో దాన్ని సవరిస్తూ ఉండాలి. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరాల వరకు నిత్య శాసనం.


  Share Facebook  |  Share Twitter

 <<  Exodus 27 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran