Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Exodus 24 >> 

1దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, <<నువ్వు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దలలో 70 మంది యెహోవా దగ్గరికి ఎక్కి వచ్చి దూరాన సాగిలపడండి.

2మోషే ఒక్కడు మాత్రమే యెహోవాను సమీపించాలి. మిగిలినవారు ఆయన సమీపానికి అతనితో కలసి ఎక్కి రాకూడదు.>>

3మోషే వచ్చి యెహోవా మాటలను, కట్టుబాట్లను ప్రజలకు వివరించాడు. ప్రజలంతా <<యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తాం>> అని ముక్త కంఠంతో జవాబిచ్చారు.

4మోషే యెహోవా చెప్పిన మాటలన్నిటినీ రాశాడు. అతడు ఉదయాన్నే లేచి ఆ కొండ పాదం దగ్గర బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేలు ప్రజల పన్నెండు గోత్రాల ప్రకారం పన్నెండు స్తంభాలు నిలిపాడు.

5తరవాత ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు యువకులను పంపినప్పుడు వాళ్ళు వెళ్లి హోమ బలులు అర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించారు.

6అప్పుడు మోషే వాటి రక్తంలో సగం పళ్ళెంలో పోశాడు. మిగతా సగం బలిపీఠం మీద కుమ్మరించాడు.

7తరువాత అతడు నిబంధన గ్రంథం చేతబట్టుకుని ప్రజలకు వినిపించాడు. ప్రజలంతా <<యెహోవా చెప్పినవన్నీ చేస్తూ ఆయనకు విధేయులుగా ఉంటాం>> అన్నారు.

8మోషే అప్పుడు రక్తం తీసుకుని ప్రజల మీద చిలకరించాడు. <<ఇది నిబంధన రక్తం. ఇదిగో ఈ విషయాలన్నిటి ప్రకారం యెహోవా మీతో చేసిన నిబంధన ఇదే>> అని చెప్పాడు.

9ఆ తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు 70 మంది కొంతవరకు కొండ ఎక్కి వెళ్ళారు.

10అక్కడ వారికి ఇశ్రాయేలీయుల దేవుని ప్రత్యక్షత కలిగింది. ఆయన పాదాల కింద మెరిసిపోతున్న నీలాలు అలికినట్టున్న వేదిక ఉంది. అది ఆకాశమంత నిర్మలంగా ఉంది.

11ఆయన ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు ఎలాంటి హాని కలిగించలేదు. అక్కడ వాళ్ళు దేవుని దర్శనం చేసుకుని అన్న పానాలు పుచ్చుకున్నారు.

12అప్పుడు యెహోవా మోషేతో, <<నువ్వు కొండ ఎక్కి నా దగ్గరికి వచ్చి అక్కడ ఉండు. నేను రాతి పలకలపై రాసిన ఆజ్ఞలనూ, ధర్మశాస్త్రాన్నీ నీకు ఇస్తాను. నువ్వు వాటిని ప్రజలకు బోధించాలి.>>

13మోషే తన సహాయకుడు యెహోషువను తీసుకుని దేవుని పర్వతం ఎక్కాడు.

14మోషే ఇశ్రాయేలు పెద్దలతో, <<మేము తిరిగి మీ దగ్గరకు వచ్చేంత వరకు ఇక్కడే ఉండండి. ఇక్కడ అహరోను, హూరు మీతోనే ఉన్నారు. మీలో ఏవైనా తగాదాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి పరిష్కరించుకోండి>> అని చెప్పి దేవుని కొండ ఎక్కాడు.

15మోషే కొండ ఎక్కినప్పుడు దేవుని మేఘం ఆ కొండంతా కమ్మివేసింది.

16యెహోవా మహిమా ప్రకాశం సీనాయి కొండపై కమ్ముకుంది. ఆరు రోజులపాటు మేఘం కమ్ముకుని ఉంది. ఏడవ రోజున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచాడు.

17యెహోవా మహిమా ప్రకాశం ఆ కొండ శిఖరంపై దహించే మంటల్లాగా ఇశ్రాయేలు ప్రజలకు కనబడింది.

18అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ ఎక్కాడు. మోషే ఆ కొండ మీద నలభై పగళ్ళూ, నలభై రాత్రులూ ఉండిపోయాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Exodus 24 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran