Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Exodus 11 >> 

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, <<ఫరో మీదికీ ఐగుప్తు మీదికీ మరొక తెగులు రప్పించబోతున్నాను. దాని తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. ఎవ్వరూ మిగలకుండా శాశ్వతంగా అతడు మిమ్మల్ని దేశం నుండి పంపించి వేస్తాడు.

2కాబట్టి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఐగుప్తు జాతి వాళ్ళైన తమ పొరుగువాళ్ళ దగ్గర నుండి వెండి, బంగారు నగలు అడిగి తీసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి.>>

3యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఐగుప్తీయులకు కనికరం కలిగేలా చేశాడు. అంతేకాక ఐగుప్తు దేశవాసులు, ఫరో సేవకులు మోషేను చాలా గొప్పగా ఎంచారు.

4మోషే ఫరోతో ఇలా అన్నాడు, <<యెహోవా చెప్పింది ఏమిటంటే, అర్థరాత్రి నేను బయలుదేరి ఐగుప్తు దేశంలోకి వెళ్తాను.

5ఐగుప్తు దేశంలో మొదట పుట్టిన సంతానమంతా చనిపోతారు. సింహాసనంపై ఉన్న ఫరో మొదటి సంతానం మొదలుకుని తిరగలి విసిరే పనిమనిషి మొదట పుట్టిన సంతానం దాకా, పశువుల్లో కూడా మొదట పుట్టినవన్నీ చనిపోతాయి.

6అప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి చోటా గొప్ప విలాపం ఉంటుంది. అలాంటి ఏడుపు ఇంతవరకూ ఎన్నడూ పుట్టలేదు, ఇకపై ఎన్నడూ పుట్టదు.

7యెహోవా ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుస్తాడని మీరు తెలుసుకొనేలా ఇశ్రాయేలు ప్రజలపై గానీ జంతువులపై గానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరి మీదా కుక్క అయినా నాలుక ఆడించదు.

8అప్పుడు నీ సేవకులైన వీరంతా నా దగ్గరికి వస్తారు. నా ఎదుట సాష్టాంగపడి, <నువ్వు, నిన్ను అనుసరించే వాళ్ళంతా ఈ దేశం విడిచి బయలుదేరండి> అని చెబుతారు. అప్పుడు నేను నా ప్రజలతో వెళ్ళిపోతాను>> అని చెప్పి మోషే ఫరో దగ్గర మండిపడుతూ వెళ్ళిపోయాడు.

9అప్పుడు యెహోవా <<ఐగుప్తు దేశంలో నేను చేసే అద్బుత క్రియలు అధికం అయ్యేలా ఫరో మీ మాట వినడు>> అని మోషేతో చెప్పాడు.

10మోషే అహరోనులు ఫరో సమక్షంలో ఈ అద్బుతాలు చేశారు. అయినప్పటికీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనియ్యలేదు.


  Share Facebook  |  Share Twitter

 <<  Exodus 11 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran