Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Genesis 38 >> 

1ఆ కాలంలో యూదా తన సోదరులను విడిచిపెట్టి హీరా అనే ఒక అదుల్లాము వాడితో నివసించాడు.

2అక్కడ షూయ అనే ఒక కనానీ యువతిని చూసి ఆమెను వివాహమాడి ఆమెతో కాపురం చేశాడు.

3ఆమె గర్భవతి అయ్యి ఒక కొడుకును కన్నప్పుడు వాడికి ఏరు అని పేరు పెట్టారు.

4ఆమె మళ్ళీ గర్భం ధరించి మరొక కొడుకును కని వాడికి ఓనాను అని పేరు పెట్టింది.

5ఆమె మళ్ళీ గర్భం ధరించి మూడవ కొడుకును కని వాడికి షేలా అని పేరు పెట్టింది. వారు కజీబులో ఉన్నప్పుడు ఆమె వాణ్ణి కన్నది.

6యూదా తన పెద్ద కొడుకు ఏరుకి తామారు అనే యువతిని పెళ్ళి చేశాడు.

7యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి దుష్టుడు కాబట్టి యెహోవా అతణ్ణి చంపాడు.

8అప్పుడు యూదా ఓనానుతో, <<నీ అన్నభార్య దగ్గరకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకి సంతానం కలిగించు>> అని చెప్పాడు.

9ఓనాను ఆ సంతానం తనది కాబోదని తెలిసి ఆమెతో పండుకున్నప్పుడు తన అన్నకి సంతానం కలగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు.

10అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కాబట్టి ఆయన అతణ్ణి కూడా చంపాడు.

11అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల్లాగా చనిపోతాడేమో అని భయపడి, <<నా కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకూ నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు>> అని తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంటిలో నివసించింది.

12చాలా రోజుల తరువాత యూదా భార్య అయిన షూయ కూతురు చనిపోయింది. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అనే తన స్నేహితుడితో కలిసి తిమ్నాతులో తన గొర్రెల బొచ్చు కత్తిరించే వారి దగ్గరకు వెళ్ళాడు.

13తన మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతుకు వెళ్తున్నాడని తామారుకు తెలిసింది.

14షేలా పెద్దవాడైనప్పటికీ తనను అతనికి భార్యగా తీసుకోకుండా ఉండడం చూసి తామారు తన విధవరాలి బట్టలు తీసివేసి, ముసుగు వేసుకుని, శరీరమంతా కప్పుకొని, తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఏనాయిము అనే ద్వారం దగ్గర కూర్చుంది.

15యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకొని ఉండడం వలన ఆమె వేశ్య అనుకొని,

16ఆమె దగ్గరకు వెళ్ళి, ఆమె తన కోడలని తెలియక, <<నీతో సుఖిస్తాను, రా>> అని పిలిచాడు. అందుకు ఆమె <<నువ్వు నాతో సుఖించినందుకు నాకేమిస్తావు?>> అని అడిగింది.

17అందుకు అతడు, <<నా మందలో నుండి ఒక మేక పిల్లను పంపుతాను>> అన్నాడు. ఆమె, <<అది పంపే వరకు ఏమైనా తాకట్టు పెడితే సరే>> అని అంది.

18అతడు, <<ఏమి తాకట్టు పెట్టమంటావ్?>>అని ఆమెను అడిగాడు. ఆమె, <<నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర>> అని చెప్పింది. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో వెళ్ళాడు. ఆమె అతని వలన గర్భవతి అయ్యింది.

19అప్పుడామె లేచి వెళ్లిపోయి ముసుగు తీసేసి తన విధవరాలి వస్త్రాలు ధరించింది.

20తరవాత యూదా ఆ స్త్రీ దగ్గర నుండి ఆ తాకట్టు వస్తువులను తీసుకోడానికి తన స్నేహితుడయిన అదుల్లామీయుడి ద్వారా మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు.

21కాబట్టి అతడు <<ఆ మార్గంలో ఏనాయిము దగ్గర కనిపించిన ఆ వేశ్య ఎక్కడ ఉంది?>> అని అక్కడి మనుషుల్ని అడిగాడు. అయితే వారు, <<ఇక్కడ వేశ్య ఎవరూ లేదు>> అని అతనికి చెప్పారు.

22కాబట్టి అతడు యూదా దగ్గరకు తిరిగి వెళ్ళి, <<ఆమె నాకు కనబడలేదు. అంతేగాక, అక్కడి మనుషులు ఇక్కడికి వేశ్య ఎవరూ రాలేదని చెప్పారు>> అన్నాడు.

23యూదా, <<మనల్ని అపహాస్యం చేస్తారేమో, ఆమె వాటిని ఉంచుకోనీ. నేను నీతో ఈ మేక పిల్లను పంపాను, ఆమె నీకు కనబడలేదు>> అని అతనితో అన్నాడు.

24సుమారు మూడు నెలలైన తరువాత, <<నీ కోడలు తామారు జారత్వం జరిగించింది. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయ్యింది>> అని యూదాకు కబురొచ్చింది. అప్పుడు యూదా, <<ఆమెను తీసుకు రండి, ఆమెను సజీవ దహనం చెయ్యాలి>> అని చెప్పాడు.

25ఆమెను బయటికి తీసుకు వచ్చినప్పుడు, ఆమె తన మామ దగ్గరకు అతని వస్తువులను పంపి, <<ఇవి ఎవరివో ఆ మనిషి వలన నేను గర్భవతి నయ్యాను. ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తు పట్టండి>> అని చెప్పించింది.

26యూదా వాటిని గుర్తు పట్టి, <<నేను నా కుమారుడు షేలాను ఆమెకు ఇయ్యలేదు కాబట్టి ఆమె నాకంటె నీతి గలది>> అని చెప్పి ఇంకెప్పుడూ ఆమెతో పండుకోలేదు.

27నెలలు నిండినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.

28ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాపాడు. మంత్రసాని ఒక ఎర్ర దారం వాడి చేతికి కట్టి, <<వీడు మొదట బయటికి వచ్చాడు>> అని చెప్పింది.

29వాడు తన చెయ్యి వెనక్కి తీయగానే అతని సోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడామె, <<నువ్వెందుకురా చొచ్చుకు వచ్చావు?>> అంది. అందుచేత వాడికి పెరెసు అని పేరు పెట్టారు.

30ఆ తరువాత చేతికి దారం కట్టి ఉన్న అతని సోదరుడు బయటికి వచ్చాడు. అతనికి జెరహు అని పేరు పెట్టారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Genesis 38 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran