Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Genesis 35 >> 

1దేవుడు యాకోబుతో, <<నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏశావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు>> అని చెప్పాడు.

2యాకోబు తన ఇంటివారితో, తన దగ్గర ఉన్న వారందరితో, <<మీ దగ్గర ఉన్న అన్యదేవతలను పారవేసి, మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకొని, మీ వస్త్రాలు మార్చుకోండి.

3మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి, నేను వెళ్ళిన అన్ని చోట్లా నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను>> అని చెప్పాడు.

4వారు తమ దగ్గర ఉన్న అన్యదేవతలన్నిటినీ తమ చెవి పోగులనూ యాకోబుకు అప్పగించారు. యాకోబు వాటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టాడు.

5వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు, వారి చుట్టూ ఉన్న పట్టణాల వారికి దేవుడు భయం పుట్టించాడు కాబట్టి వారు యాకోబు కుటుంబాన్ని తరమ లేదు.

6యాకోబు, అతడితో ఉన్నవారంతా కనానులో లూజుకు, అంటే బేతేలుకు వచ్చారు.

7అతడు తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతడికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి వారు అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ ప్రదేశానికి ఏల్‌ బేతేలు అని పేరు పెట్టారు.

8రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయినప్పుడు ఆమెను బేతేలుకు దిగువన ఉన్న సింధూరవృక్షం కింద పాతిపెట్టి, దానికి అల్లోన్ బాకూత్‌ అనే పేరు పెట్టారు.

9యాకోబు పద్దనరాము నుండి వస్తూ ఉండగా దేవుడు అతడికి మళ్ళీ ప్రత్యక్షమై అతణ్ణి ఆశీర్వదించాడు.

10అప్పుడు దేవుడు అతనితో, <<నీ పేరు యాకోబు. కానీ ఇప్పటినుండి అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు>> అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.

11దేవుడు, <<నేను సర్వశక్తిగల దేవుణ్ణి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. ఒక జనాంగం, జనాంగాల గుంపు నీనుండి కలుగుతాయి. రాజులు నీ సంతానంలో నుండి వస్తారు.

12నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను. నీ తరువాత నీ సంతానానికి కూడా ఈ దేశాన్ని ఇస్తాను>> అని అతనితో చెప్పాడు.

13దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి పరలోకానికి వెళ్ళాడు.

14దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం, అంటే ఒక రాతి స్తంభం నిలబెట్టి దానిమీద పానార్పణం చేసి దాని మీద నూనె పోశాడు.

15తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు.

16వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. దారిలో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి.

17ఆమె ప్రసవం వలన తీవ్రంగా ప్రయాసపడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో, <<భయపడ వద్దు, ఈ సారి కూడా నీకు కొడుకే పుడతాడు>> అంది.

18రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె, <<వీడి పేరు బెనోని>> అంది. కాని అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.

19ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచే ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు.

20యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది ఈ రోజు వరకు రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది.

21ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్‌ ఏదెరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు.

22ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలిసింది.

23యాకోబు కొడుకులు పన్నెండు మంది. యాకోబు జ్యేష్ఠకుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కొడుకులు.

24యోసేపు, బెన్యామీను. వీరు రాహేలు కొడుకులు.

25రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి.

26లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు.

27అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన మమ్రేలోని కిర్యతర్బాలో తన తండ్రి ఇస్సాకు దగ్గరకు యాకోబు వచ్చాడు. అదే హెబ్రోను.

28ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు.

29ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Genesis 35 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran