Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Genesis 33 >> 

1యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు ఏశావు, అతనితో నాలుగువందల మంది మనుషులు వస్తూ ఉన్నారు.

2అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేలులకు, ఇద్దరు దాసీలకు అప్పగించాడు. అతడు ముందు దాసీలనూ వారి పిల్లలనూ, వారి వెనక లేయానూ ఆమె పిల్లలనూ, ఆ వెనక రాహేలునూ యోసేపునూ ఉంచాడు.

3తాను వారి ముందు వెళ్తూ తన సోదరుణ్ణి సమీపించే వరకు ఏడు సార్లు నేలపై సాగిలపడ్డాడు.

4అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కోడానికి పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడను కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.

5ఏశావు ఆ స్త్రీలనూ పిల్లలనూ చూసి, <<వీరు నీకేమౌతారు?>> అని అడిగాడు. అతడు <<వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే>> అని చెప్పాడు.

6అప్పుడు ఆ దాసీలూ వారి పిల్లలూ దగ్గరకు వచ్చి ఏశావు ఎదుట సాగిలపడ్డారు.

7లేయా ఆమె పిల్లలూ దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు. ఆ తరువాత యోసేపూ రాహేలూ దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు.

8ఏశావు, <<నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతా ఎందుకు?>> అని అడిగాడు. అతడు, <<నా ప్రభువు దయ నా మీద కలగడానికే>> అని చెప్పాడు.

9అప్పుడు ఏశావు, <<తమ్ముడూ, నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో>> అని చెప్పాడు.

10అప్పుడు యాకోబు, <<అలా కాదు, నీ అనుగ్రహం నా మీద ఉంటే దయచేసి ఈ కానుకను అంగీకరించు. దేవుని ముఖం చూసినట్టుగా నీ ముఖం చూశాను. నీ దయ నా మీద ఉంది కదా.

11నేను నీ కోసం తెచ్చిన కానుకను దయచేసి అంగీకరించు. దేవుడు నన్ను కనికరించాడు. పైగా, నాకు కావలసినంత ఉంది>> అని చెప్పి అతన్ని బలవంతం చేశాడు కాబట్టి అతడు దానిని పుచ్చుకొని

12<<మనం వెళదాం, నేను నీకు ముందుగా సాగిపోతాను>> అని చెప్పగా

13అతడు <<నాదగ్గర ఉన్న పిల్లలు పసిపిల్లలనీ, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చేవి అనీ నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వాటిని వేగంగా తోలితే ఈ మంద అంతా చస్తుంది.

14నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళాలి. నేను నా ప్రభువు దగ్గరకు శేయీరుకు వచ్చేవరకూ, ముందున్న మందలూ, ఈ పిల్లలూ నడవగలిగిన కొలదీ వాటిని మెల్లగా నడిపించుకొని వస్తాను>> అని అతనితో చెప్పాడు.

15అప్పుడు ఏశావు <<నీ కిష్టమైతే నా దగ్గర ఉన్న ఈ మనుషుల్లో కొందరిని నీ దగ్గర విడిచిపెడతాను>> అనగా అతడు, <<అదెందుకు? నా ప్రభువు కటాక్షం నా మీద ఉంది. అది చాలు>> అన్నాడు.

16ఆ రోజునే ఏశావు తన దారిలో శేయీరుకు తిరిగి వెళ్ళిపోయాడు.

17అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై వెళ్లి తమకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించాడు. అందుకు ఆ చోటికి సుక్కోతు అనే పేరు వచ్చింది.

18ఆ విధంగా యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందు తన గుడారాలు వేశాడు.

19అతడు గుడారాలు వేసిన పొలంలోని భాగాన్ని షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల దగ్గర నూరు వెండి నాణాలకు కొన్నాడు.

20అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి <<ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు>> అని పేరు పెట్టాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Genesis 33 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran