Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Leviticus 21 >> 

1యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<యాజకులైన అహరోను కొడుకులతో ఇలా చెప్పు. మీలో ఎవరూ మీ ప్రజల్లో శవాన్ని ముట్టుకుని తనను అపవిత్రం చేసుకోకూడదు.

2అయితే తన రక్త సంబంధులు, అంటే తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, సోదరుడు,

3తన ఇంట్లో నివసిస్తున్న పెండ్లి కానీ కన్య అయిన సోదరి గానీ చనిపోతే ఆ శవాన్ని తాకడం వల్ల తనను అపవిత్ర పరచుకోవచ్చు.

4యాజకుడు తన ఇతర బంధువుల కోసం తనను అపవిత్ర పరచుకుని మైల పడకూడదు.

5యాజకులు బోడిగుండు చేసుకోకూడదు. గడ్డం పక్కలను క్షవరం చేసుకో కూడదు. కత్తితో శరీరాన్ని గాట్లు పెట్టుకోకూడదు.

6వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండాలి. తమ దేవుని నామాన్ని అప్రదిష్ట పాలు చెయ్యకూడదు. ఎందుకంటే వారు తమ దేవునికి <నైవేద్యం> అంటే యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించే వారు. కాబట్టి వారు పవిత్రంగా ఉండాలి.

7వారు వేశ్యను గానీ చెడిపోయిన దాన్ని గానీ పెళ్లాడకూడదు. భర్త విడాకులు ఇచ్చిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.

8అతడు నీ దేవుడికి <నైవేద్యం> అర్పించేవాడు గనక నీవు అతణ్ణి పరిశుద్ధపరచాలి. మిమ్మల్ని పరిశుద్ధ పరిచే యెహోవా అనే నేను పవిత్రుణ్ణి గనక అతడు మీ దృష్టికి పవిత్రుడుగా ఉండాలి.

9యాజకుని కూతురు వేశ్యగా తనను అపవిత్రపరచు కున్నట్టైతే ఆమె తన తండ్రికి అప్రదిష్ట తీసుకువస్తుంది. ఆమెను సజీవ దహనం చెయ్యాలి.

10సోదరుల్లో ప్రధాన యాజకుడు కావడానికి ఎవరి తలమీద అభిషేక తైలం పోస్తారో, ప్రధాన యాజక దుస్తులు ధరించడానికి ఎవరు ప్రతిష్ట అవుతారో అతడు తన జుట్టు విరబోసుకోకూడదు. తన బట్టలు చింపుకోకూడదు.

11అతడు శవం ఉన్న చోటికి పోకూడదు. తన తండ్రి శవం మూలంగా గానీ తన తల్లి శవం మూలంగా గానీ మైల పడకూడదు.

12ప్రధానయాజకుడు పరిశుద్ధమందిరాన్ని విడిచి వెళ్లకూడదు. తన దేవుని పరిశుద్ధ మందిరాన్ని మైల పడేలా చెయ్యకూడదు. ఎందుకంటే తన దేవుని అభిషేక తైలం వల్ల అతడు ప్రధాన యాజకునిగా అభిషేకం పొందాడు. నేను యెహోవాను.

13అతడు కన్యను మాత్రమే పెళ్ళాడాలి.

14వితంతువును గానీ విడాకులు తీసుకున్న స్త్రీని గానీ వేశ్యను గానీ అలాటి వారిని కాక తన ప్రజల్లోని కన్యనే పెళ్లాడాలి.

15అతడు ఈ నియమాలు పాటించాలి. యెహోవా అనే నేను అతణ్ణి పవిత్రపరిచే వాణ్ణి గనక అతడు తన ప్రజల్లో తన సంతానాన్ని అపవిత్ర పరచకూడదు.>>

16యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.

17<<నీవు అహరోనుతో ఇలా చెప్పు. నీ సంతానంలో ఎవరికైనా కళంకమేదైనా కలిగితే అతడు తన దేవుడికి నైవేద్యం అర్పించడానికి సమీపించ కూడదు.

18ఎందుకంటే ఎవరిలో కళంకం ఉంటుందో, అంటే వాడు గుడ్డి వాడైనా, కుంటివాడైనా, వికృత రూపి అయినా,

19కాలు గానీ చెయ్యి గానీ అవిటితనం ఉన్నా,

20గూనివాడైనా, మరుగుజ్జువాడైనా, కంటి దోషం లేక జబ్బు ఉన్నవాడైనా, గజ్జి, పక్కు ఉన్నవాడైనా వృషణాలు నలిగినవాడైనా అలాటివాడు సమీపించకూడదు.

21యాజకుడైన అహరోను సంతానంలో అవిటితనం గలవారెవరూ యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించడానికి దగ్గరికి రాకూడదు. అతడు అవిటి వాడు. అలాటి వాడు తన దేవునికి నైవేద్యం పెట్టడానికి దగ్గరికి రాకూడదు.

22అతి పరిశుద్ధమైనవిగాని, పరిశుద్ధమైనవిగాని, తన దేవునికి అర్పించే ఏ ఆహార వస్తువులైనా అతడు తినొచ్చు.

23మొత్తం మీద అతడు అవిటితనం గలవాడు గనక అడ్డతెర ఎదుటికి అతడు రాకూడదు. బలిపీఠం సమీపించ కూడదు.

24నా పరిశుద్ధ స్థలాలను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధ పరిచే యెహోవాను నేనే అని వారితో చెప్పు.>> మోషే ఈ విధంగా అహరోనుతో, అతని కొడుకుల తో ఇశ్రాయేలీయులందరితో ఈ విషయాలు చెప్పాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Leviticus 21 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran