Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Leviticus 15 >> 

1యెహోవా మోషే అహరోనులతో మాట్లాడి ఇలా చెప్పాడు.

2<<మీరు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి శరీరంలో ఎక్కడన్నా ఏదన్నా స్రావం జరుగుతుంటే ఆ స్రావం కారణంగా అతడు అశుద్ధుడు అవుతాడు.

3అతని అశుద్ధతకు కారణం రోగ కారకమైన స్రావమే. అతని శరీరంలో ఆ స్రావాలు కారినా, నిలిచి పోయినా అది అశుద్ధమే.

4అతడు పడుకునే పడకా, కూర్చునే ప్రతిదీ అశుద్ధమే అవుతుంది.

5అతని పడకని తాకే ఎవడైనా తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడు గానే ఉంటాడు.

6శరీరంలో స్రావం అవుతున్న వాడు కూర్చున్న దానిపై ఎవరైనా కూర్చుంటే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. వాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

7రోగ కారకమైన స్రావం అవుతున్న వాణ్ణి తాకిన వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

8అలాంటి స్రావం జరిగే వాడు ఎవరైనా శుద్ధుడి పైన ఉమ్మి వేస్తే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

9స్రావం జరిగేవాడు జీను పై కూర్చుంటే అదీ అశుద్ధం అవుతుంది.

10అతడు కూర్చున్న ఏ వస్తువునైనా తాకితే, ఆ తాకినవాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఆ వస్తువుల్ని మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

11స్రావం జరిగే వాడు నీళ్ళతో చేతులు కడుక్కోకుండా ఎవరినైనా తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

12స్రావం జరిగే వాడు తాకిన మట్టిపాత్రను పగలగొట్టాలి. అది చెక్క పాత్ర అయితే దాన్ని నీళ్ళతో కడగాలి.

13స్రావం జరిగే వాడు స్రావం మానిన తరువాత శుద్ధుడు కావడానికి ఏడు రోజులు లెక్క పెట్టుకోవాలి. ఆ తరువాత తన బట్టలు ఉతుక్కోవాలి. పారే నీటిలో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడు అవుతాడు.

14ఎనిమిదో రోజు అతడు రెండు గువ్వల్ని గానీ రెండు పావురం పిల్లల్ని గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి.

15యాజకుడు వాటిలో ఒక దాన్ని పాపం కోసం బలిగా రెండోదాన్ని దహనబలిగా అర్పించాలి. స్రావం జరిగే వాడి విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి.

16ఒక వ్యక్తికి అప్రయత్నంగా వీర్యస్కలనం జరిగితే అతడు నీళ్ళలో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

17అతని వీర్యం ఏదన్నా బట్టలపైనో, తోలు వస్తువు పైనో పడితే ఆ బట్టనీ, తోలునూ నీళ్ళతో ఉతకాలి. అవి సాయంత్రం వరకూ అశుద్ధమై ఉంటాయి.

18స్త్రీ పురుష సంపర్కంలో వీర్యస్కలనమైతే వాళ్ళిద్దరూ స్నానం చేయాలి. వాళ్ళు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు.

19ఒక స్త్రీ శరీరంలో బహిష్టు సమయంలో రక్తస్రావం జరిగితే ఆమె అశుద్ధత ఏడు రోజులుంటుంది. ఆ సమయంలో ఆమెని తాకిన వాళ్ళు ఆ రోజు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు.

20ఆ సమయంలో ఆమె పండుకున్న ప్రతిదీ అశుద్ధంగా ఉంటుంది. ఆమె దేనిపైన కూర్చుంటుందో అది అశుద్ధంగా ఉంటుంది.

21ఆమె మంచాన్ని తాకిన ప్రతి వాడూ తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

22ఆమె దేనిపైన కూర్చుంటుందో దాన్ని తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

23ఆమె మంచాన్నీ లేదా ఆమె కూర్చున్నదాన్నీ తాకితే ఆ వ్యక్తి సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

24ఒక వ్యక్తి స్త్రీతో సంభోగించినప్పుడు ఆమె అశుచి అతనికి తగిలితే అతడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు. అతడు పండుకునే ప్రతి పడకా అశుద్ధమవుతుంది.

25ఒక స్త్రీకి తన బహిష్టు సమయంలో కాకుండా అనేకరోజులు రక్త స్రావం జరుగుతూ ఉన్నా, లేదా బహిష్టు సమయం దాటిన తరువాత కూడా స్రావం జరుగుతూనే ఉన్నా స్రావం జరిగినన్ని రోజులూ ఆమెకు బహిష్టు సమయం లానే ఉంటుంది. ఆమె అశుద్ధురాలుగానే ఉంటుంది.

26ఆమెకు స్రావం జరుగుతున్న రోజులన్నీ ఆమె పండుకునే మంచం ఆమె బహిష్టు సమయంలో పండుకునే మంచం లాగే ఉంటుంది. ఆమె దేని పైన కూర్చుంటుందో ఆమె బహిష్టు సమయంలో జరిగినట్టే అది అశుద్ధం అవుతుంది.

27వీటిని ముట్టుకునే వాడు అశుద్ధుడు. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

28ఆమె స్రావం నిలిచిపోయి ఆమె శుద్ధురాలైతే దానికి ఏడు రోజులు పడుతుంది. ఆమె ఆ ఏడు రోజుల్ని లెక్క పెట్టుకోవాలి. అవి గడచిన తరువాత ఆమె శుద్ధురాలు అవుతుంది.

29ఎనిమిదో రోజు ఆమె రెండు గువ్వల్ని గానీ రెండు పావురం పిల్లల్ని గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారంలో యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి.

30యాజకుడు వాటిలో ఒక దాన్ని పాపం కోసం బలిగా రెండోదాన్ని దహనబలిగా అర్పించాలి. ఆమెకు జరిగిన మలినకరమైన రక్త స్రావం విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి.

31నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నాను. తమ అశుద్ధతతో వాళ్ళు నా నివాస స్థలాన్ని పాడుచేయకూడదు. వాళ్ళు తమ అశుద్ధతతో నా నివాస స్థలాన్ని పాడు చేసి చనిపోకుండా మీరు వారి అశుద్ధతని వాళ్ళకి దూరం చేయాలి.

32శరీరంలో స్రావం జరిగే వాణ్ణి గూర్చీ, వీర్యస్కలనమై అశుద్ధుడయ్యే వాణ్ణి గూర్చీ,

33బహిష్టుగా ఉన్న స్త్రీ గూర్చీ, స్రావం జరిగే స్త్రీ పురుషులను గూర్చీ, అశుద్ధంగా ఉన్న స్త్రీతో సంభోగించే వాణ్ని గూర్చీ విధించిన నిబంధనలు ఇవి.>>


  Share Facebook  |  Share Twitter

 <<  Leviticus 15 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran