Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Leviticus 1 >> 

1యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనితో ఇలా అన్నాడు.

2<<నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తేవాలంటే దాన్ని తన పశువుల్లో నుండి గానీ, మేకల, గొర్రెెల మందల్లో నుండి గానీ తీసుకు రావాలి.

3ఒకవేళ అతడు దహనబలిగా పశువుల్లో నుండి ఒక దానిని అర్పించాలనుకుంటే లోపం లేని మగ పశువును తీసుకు రావాలి. యెహోవా సమక్షంలో అది అంగీకారం పొందాలంటే దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర అర్పించాలి.

4దహనబలిగా అర్పించే పశువు తల మీద అతడు తన చెయ్యి ఉంచాలి. అప్పుడు అతనికి ప్రాయశ్చిత్తం కలగడానికి అతని పక్షంగా అది ఆమోదం పొందుతుంది.

5తరువాత అతడు యెహోవా సమక్షంలో ఆ కోడె దూడని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు దాని రక్తాన్ని తీసుకు వచ్చి ప్రత్యక్ష గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉన్న బలిపీఠం పైన చిలకరిస్తారు.

6తరువాత అతడు దహనబలి పశువు చర్మాన్ని ఒలిచి దాన్ని ముక్కలుగా కోయాలి.

7తరువాత యాజకుడైన అహరోను కొడుకులు బలిపీఠం పైన కట్టెలు పేర్చి మంట పెట్టాలి.

8అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు ఆ పశువు శరీర భాగాలనూ, తలనూ, కొవ్వునూ ఒక పద్ధతి ప్రకారం ఆ కట్టెలపైన పేర్చాలి.

9కానీ దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని బలిపీఠం పైన దహనబలిగా దహించాలి. అప్పుడు అది నాకు కమ్మని సువాసననిస్తుంది.

10గొర్రెెల, మేకల మందల్లో నుండి దేన్నైనా దహనబలిగా అర్పించాలనుకుంటే లోపం లేని పోతును తీసుకు రావాలి.

11బలిపీఠం ఉత్తరం వైపు యెహోవా సమక్షంలో దాన్ని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం అన్ని వైపులా దాని రక్తాన్ని చిలకరించాలి.

12అప్పుడు దాన్ని తలా, కొవ్వుతో పాటు ఏ భాగానికి ఆ భాగంగా ముక్కలు చేయాలి. తరువాత వాటిని బలిపీఠంపై ఉన్న మంటపై అమర్చిన కట్టెలపై ఒక పద్ధతిలో పేర్చాలి.

13దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని బలిపీఠం పై దహించాలి. ఇది దహనబలి. ఇది యెహోవాకు కమ్మని సువాసన కలుగజేస్తుంది.

14ఒక వ్యక్తి యెహోవాకు దహనబలిగా పక్షిని అర్పించాలనుకుంటే ఒక గువ్వని గానీ పావురం పిల్లని గానీ తీసుకురావాలి.

15యాజకుడు దాన్ని బలిపీఠం దగ్గరకు తీసుకువచ్చి దాని తలను చేతితో తుంచివేయాలి. తరువాత దాన్ని బలిపీఠం పైన కాల్చాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కనే పిండాలి.

16తరువాత దాని పొట్టను తీసివేసి బలిపీఠం తూర్పు వైపున బూడిద పోసే చోట పారెయ్యాలి.

17అతడు దాని రెక్కల సందులో చీల్చాలి గానీ రెండు ముక్కలుగా చేయకూడదు. యాజకుడు దాన్ని బలిపీఠం పైన ఉన్న కట్టెలపై కాల్చాలి. ఇది దహనబలి, అంటే ఇది యెహోవాకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది.>>


  Share Facebook  |  Share Twitter

 <<  Leviticus 1 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran