Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Esther 5 >> 

1మూడో రోజున ఎస్తేరు రాణివస్త్రాలు ధరించుకుని రాజభవనం ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలబడింది. రాజనగరు ద్వారానికి ఎదురుగా ఉన్న ఆవరణంలో రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు.

2ఎస్తేరురాణి ఆవరణంలో నిలబడి ఉండడం రాజు చూశాడు. అతనికి ఆమెపై ఇష్టం పుట్టింది. రాజు తన చేతిలోని బంగారపు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు. ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం కొనను తాకింది.

3రాజు <<రాణివైన ఎస్తేరూ, నీకేమి కావాలి? నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యం కోరినా సరే, నీకు ఇచ్చేస్తాను>> అన్నాడు.

4అప్పుడు ఎస్తేరు <<రాజుకు సమంజసం అనిపిస్తే నేను రాజు కోసం ఏర్పాటు చేయించిన విందుకు రాజైన మీరూ హామానూ ఈ రోజు రావాలని నా కోరిక>> అంది.

5అప్పుడు రాజు <<ఎస్తేరు అడిగిన ప్రకారం జరిగేలా హామానును కూడా త్వరగా తెండి>> అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు, హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చారు.

6విందులో ద్రాక్షారసం పోస్తుండగా రాజు ఎస్తేరుతో <<నీ కోరిక ఏమిటి? దానిని తీరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే, నీకు ఇస్తాను>>అని చెప్పాడు.

7ఎస్తేరు ఇలా బదులు ఇచ్చింది, <<రాజైన మీకు నాపై అనుగ్రహం కలిగితే, నా మనవి ప్రకారం చేయడం రాజైన మీకు అనుకూలమైతే,

8రాజైన మీరూ హామానూ రేపు కూడా మీ కోసం నేను చేయించబోయే విందుకు రావాలి. మీ ప్రశ్నకు జవాబు అప్పుడు ఇస్తాను.>>

9ఆ రోజు హామాను సంతోషంగా ఉల్లాసంగా బయలుదేరాడు. రాజు భవన ద్వారం దగ్గర ఉన్న మొర్దెకై తనను చూసి లేచి నిలబడక పోవడం, అసలు ఎలాటి భయం చూపకపోవడం చూసి మొర్దెకై మీద మండిపడ్డాడు.

10అయితే అతడు కోపం అణచుకుని ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య జెరెషును పిలిపించాడు.

11తన ఐశ్వర్య వైభవాల గురించి, తనకున్న చాలామంది కొడుకుల గురించి, రాజు తనని రాజోద్యోగులందరి కంటే, రాజసేవకులందరి కంటే ఎలా ఉన్నత స్థాయిలో ఉంచాడో వారికి వివరించాడు.

12ఇంకా అతడు <<ఎస్తేరు రాణి తాను చేయించిన విందుకు రాజును నన్ను తప్ప మరి ఎవరినీ పిలవ లేదు. రేపు కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు ఆహ్వానం అందింది>> అని చెప్పాడు.

13<<అయితే యూదుడైన మొర్దెకై రాజభవన ద్వారం దగ్గర కూర్చుని ఉండడం నేను చూస్తున్నంత కాలం ఈ పదవి అంతటి వలనా నాకు ప్రయోజనమేముంది?>> అని అతడు అన్నాడు.

14అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరూ <<50 మూరల ఎత్తున్న ఉరికొయ్య ఒకటి చేయించు. దాని మీద మొర్దెకైని ఉరి తీసేలా రేపు రాజుకు మనవి చెయ్యి. ఆపైన సంతోషంగా రాజుతో కలిసి విందుకు పోవచ్చు>> అని అతనితో చెప్పారు. ఈ సంగతి హామానుకు సముచితంగా తోచింది. అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Esther 5 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran