Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Daniel 11 >> 

1మాదీయుడైన దర్యావేషు మొదటి సంవత్సరంలో మిఖాయేలును స్థిరపరచడానికి, బలపరచడానికి నేను అతని దగ్గర నిలబడ్డాను.

2ఇప్పుడు సత్యాన్ని నీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే ఇంకా ముగ్గురు రాజులు పారసీకంపై రాజ్యం చేసిన తరవాత అందరికంటే ఐశ్వర్యం కలిగిన నాలుగవ రాజొకడు వస్తాడు. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకుల రాజ్యానికి విరోధంగా రేపుతాడు.

3అంతలో శూరుడైన ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యాన్ని ఏలి యిష్టానుసారంగా జరిగిస్తాడు.

4అతడు రాజైన తరవాత అతని రాజ్యం శిథిలమైపోయి ఆకాశం నలుదిక్కులకూ ముక్కలైపోతుంది. అది అతని వంశికులకు గానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేసేవారికి గానీ దక్కదు. అతని ప్రభుత్వం కూకటి వేళ్ళతో పెరికి వేయబడుతుంది. అతని వంశంవారు దాన్ని పొందరు. పరాయివాళ్ళు పొందుతారు.

5అయితే దక్షిణదేశం రాజు, అతని అధిపతుల్లో ఒకడు బలం పుంజుకుని ఇతనికంటే గొప్పవాడై మరింత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలుతాడు.

6కొన్ని సంవత్సరాలైన తరువాత సమయం వచ్చినప్పుడు వారు సంధి చేసుకోవాలని కలుసుకుంటారు. దక్షిణదేశం రాజకుమార్తె ఆ ఒప్పందాన్ని స్థిర పరచడం కోసం ఉత్తరదేశం రాజు దగ్గరికి వస్తుంది. అయినా ఆమె తన బలం కోల్పోయి దిక్కులేనిదిగా విడువబడుతుంది. ఆమె, ఆమెను తీసుకు వచ్చినవారు, ఆమె తండ్రి, ఆమెకు ఆసరాగా ఉన్నవారు అలానే అవుతారు.

7ఆమె స్థానంలో ఆమె వంశాంకురం ఒకడు లేస్తాడు. అతడు దాడి చేసి ఉత్తర దేశపురాజు కోటలో చొరబడి యుద్ధమాడి వారిని ఓడిస్తాడు.

8అతడు వారి దేవుళ్ళను పోతపోసిన బొమ్మలను విలువగల వారి వెండి బంగారు వస్తువులను చెరపట్టి ఐగుప్తుకు తీసుకుపోతాడు. అతడు కొన్ని సంవత్సరాలు ఉత్తర దేశపురాజు జోలికి పోడు.

9ఉత్తర దేశపురాజు దక్షిణ దేశపురాజు రాజ్యంలో చొరబడి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు.

10అతని కుమారులు యుద్ధ సన్నద్ధులై మహా సైన్యాలను సమకూర్చుకుంటారు. అతడు నది లాగా ముంచుకు వచ్చి కట్టలు తెంచుకుని ప్రవహిస్తాడు. యుద్ధం చేయబూని కోట దాకా వస్తాడు.

11అంతలో దక్షిణదేశం రాజు ఆగ్రహంతో బయలుదేరి ఉత్తరదేశపు రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తర దేశం రాజు గొప్పసైన్యంతో వచ్చినప్పటికీ అతడు ఓడిపోతాడు.

12ఆ గొప్ప సైన్యం ఓడిపోయినందుకు దక్షిణదేశం రాజు మనస్సులో గర్విస్తాడు. వేలకొలది శత్రు సైనికులను హతం చేసినా అతనికి జయం కలగదు.

13ఎందుకంటే ఉత్తర దేశంరాజు మొదటి సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని మళ్ళీ వస్తాడు. ఆ కాలాంతంలో, అంటే కొన్ని సంవత్సరాలైన తరువాత అతడు గొప్ప సైన్యాన్ని విశేషమైన యుద్ధ పరికరాలను సమకూర్చి నిశ్చయంగా వస్తాడు.

14ఆ కాలాల్లో చాలా మంది దక్షిణదేశపు రాజుతో యుద్ధం చేయడానికి వస్తారు. నీ ప్రజల్లో క్రూరులైన వారు దర్శనాన్ని నెరవేర్చడం కోసం బయలు దేరుతారు గానీ వారు తొట్రుపడతారు.

15ఉత్తరదేశపురాజు వచ్చి కోట చుట్టూ ముట్టడి దిబ్బ వేసి కోటను పట్టుకుంటాడు. దక్షిణ దేశపు రాజు బలగం నిలవలేక పోతుంది. అతని వీరయోధులు సైతం శౌర్యంతో నిలదొక్కుకోలేక పోతారు.

16ఉత్తర దేశపు రాజును ఎవరూ ఎదిరించి నిలవలేక పోయినందువల్ల అతడు దక్షిణ రాజుకు వ్యతిరేకంగా తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అతడు రమ్యదేశంలో స్థిరపడి సర్వనాశనం జరిగిస్తాడు.

17అతడు తన రాజ్య సంబంధమైన సంపూర్ణ బలాన్ని సమీకరించుకుని రావాలని ఉద్దేశించగా అతనితో సంధి ఒప్పందం చెయ్యాలని ప్రయత్నాలు జరుగుతాయి. అతడు ఒక కుమార్తెను దక్షిణ రాజుకు ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా అతణ్ణి నాశనం చేయాలనుకుంటాడు. అయితే ఆ పథకం నెరవేరదు.

18అతడు ద్వీపాల్లో నివసించే జాతుల వైపు దృష్టి సారించి వాటిలో చాలా రాజ్యాలను పట్టుకుంటాడు. అయితే ఒక సేనాని అతని అహంకారానికి అడ్డుకట్ట వేస్తాడు. అతని అవమానం అతని మీదికే మళ్ళీ వచ్చేలా చేస్తాడు.

19అప్పుడతడు తన దేశాలోని కోటల వైపు దృష్టి సారిస్తాడు గాని తొట్రుపడి కూలి, లేకుండా పోతాడు.

20అతని స్థానంలో మరొకడు లేచి రాజ్య వైభవం కోసం బలవంతంగా పన్నులు వసూలు చేస్తాడు. కొద్ది దినాలకే అతడు నాశనమౌతాడు గానీ ఈ నాశనం ఆగ్రహం వల్ల గానీ యుద్ధం వల్ల గానీ జరగదు.

21అతనికి బదులుగా నీచుడొకడు వస్తాడు. అతనికి ప్రజలు రాజ్య ఘనత ఇవ్వరు. అతడు చాప కింద నీరు లాగా వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు.

22వరద ప్రవాహం వంటి గొప్ప సైన్యం అతని ఎదుట కొట్టుకు పోతుంది. ఒడంబడిక చేసిన అధిపతి అతని సైన్యంతోబాటు నాశనమై పోతాడు.

23అతడు తాత్కాలికంగా సంధి చేస్తాడు గానీ కుటిలంగా ప్రవర్తిస్తాడు. అతడు కొద్దిమంది అనుచరులతో బలం పొందుతాడు.

24అతడు హటాత్తుగా సంపన్న ప్రాంతానికి వచ్చి, తన పూర్వీకుడుగానీ తన పూర్వీకుల పూర్వీకులు గాని చేయని దాన్ని చేస్తాడు. అక్కడ ఆస్తిని, దోపుడుసొమ్మును, సంపదను తన వారికి పంచిపెడతాడు. అంతట కొంతకాలం ప్రాకారాలను పట్టుకోడానికి కుట్ర చేస్తాడు.

25అతడు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని, దక్షిణదేశపు రాజుతో యుద్ధం చేయడానికి తన బలం పుంజుకుని, ధైర్యం కూడగట్టుకుంటాడు. కాబట్టి దక్షిణదేశపు రాజు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని మహా బలంతో యుద్ధానికి సన్నద్ధుడౌతాడు. కానీ అతడు తనకు వ్యతిరేకంగా తలపెట్టిన పన్నాగాల మూలంగా నిలవ లేక పోతాడు.

26ఎందుకంటే అతని బల్ల దగ్గర భోజనం చేసే వారే అతన్ని నాశనం చేయ జూస్తారు. అతని సైన్యం తుడిచిపెట్టుకు పోతుంది. చాలా మంది హతం అవుతారు.

27ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కీడు తలపెట్టి ఆ యిద్దరు రాజులు కలిసి భోజనానికి కూర్చుని ఒకరితో ఒకరు అబద్ధాలాడతారు. అయితే దీనివల్ల ఏమీ ఫలితం ఉండదు. ఎందుకంటే నిర్ణయ కాలానికి అంతం వస్తుంది.

28అటు తరువాత ఉత్తర దేశపు రాజు గొప్ప ధనరాసులతో తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. అతని మనస్సు మాత్రం పరిశుద్ధ నిబంధనకు విరోధంగా ఉంటుంది. అతడు ఇష్టానుసారంగా జరిగించి తన దేశానికి తిరిగి వస్తాడు.

29అనుకున్న సమయంలో అతడు తిరిగి దక్షిణరాజ్యం పై దండెత్తుతాడు. అయితే ఈ సారి మొదట ఉన్నట్టుగా ఉండదు.

30అంతట కిత్తీయుల ఓడలు అతని మీదికి రావడం వలన అతడు ధైర్యం చెడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడై, పరిశుద్ధ నిబంధనను విడిచి పెట్టిన వారి పట్ల పక్షపాతం చూపుతాడు.

31అతని శూరులు లేచి, పరిశుద్ధస్థలాన్ని, కోటను మైల పడేలా చేసి, అనుదిన దహన బలి తీసివేసి, నాశనం కలగజేసే హేయమైన వస్తువును నిలబెడతారు.

32అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించే వారిని తన వైపు తిప్పుకుంటాడు. అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు.

33ప్రజల్లో జ్ఞానం గల వారు ఆనేకులకు అవగాహన కలిగిస్తారు గాని వారు చాలా రోజులు కత్తి వల్ల, అగ్ని వల్ల కూలి, చెరసాల పాలవుతారు. వారికున్నదంతా దోచుకోవడం జరుగుతుంది.

34వారి కష్టకాలంలో వారికి కొద్దిపాటి సహాయం మాత్రం దొరుకుతుంది. చాలా మంది వారి వైపు చేరతారు గానీ వారివన్నీ శుష్క ప్రియాలే.

35కొందరు జ్ఞానవంతులు తొట్రుపడతారుగానీ అది వారు అంతం వచ్చేలోపు మరింత మెరుగు పడేందుకు, శుభ్రం అయేందుకు, పవిత్రులయేందుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నియమించిన కాలం ఇంకా రాలేదు.

36ఆ రాజు ఇష్టానుసారముగా ప్రవర్తిస్తాడు. తన్ను తానే హెచ్చించుకుంటూ, విర్రవీగుతూ దేవాధిదేవునికి వ్యతిరేకంగా నిర్ఘాంతపోయేలా చేసే మాటలు వదరుతాడు. ఉగ్రత ముగిసే దాకా అతడు వర్ధిల్లుతాడు. ఆపైన జరగవలసింది జరుగుతుంది.

37అతడు తన పితరుల దేవుళ్ళను లెక్క చెయ్యడు. స్త్రీలు కోరుకునే దేవుణ్ణిగానీ, ఏ ఇతర దేవుళ్ళనుగానీ లక్ష్య పెట్టడు.

38అతడు కోట గోడల దేవుణ్ణి ఘన పరుస్తాడు. అతడు తన పితరులకు తెలియని దేవుణ్ణి వెండి బంగారాలను, వెలగల రాళ్ళను అర్పించి కొలుస్తాడు.

39ఈ అపరిచిత దేవుడి సహాయంతో అతడు అతి బలిష్ఠమైన దుర్గాలపై దాడి చేస్తాడు. తనను అంగీకరించిన గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. అనేకుల మీద తన వారిని పరిపాలకులుగా చేస్తాడు. ప్రభుత్వ మిస్తాడు. దేశాన్ని వెల కట్టి పంచిపెడతాడు.

40చివరి రోజుల్లో దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేస్తాడు. ఉత్తరదేశపు రాజు రథాలను గుర్రపురౌతులను అసంఖ్యాకంగా ఓడలను సమకూర్చుకుని, తుఫానువలె అతని మీద పడి అనేక దేశాలను ముంచెత్తుతాడు.

41అతడు మహిమ దేశంలో ప్రవేశించగా చాలా మంది కూలి పోతారు గానీ ఎదోమీయుల, మోయాబీయుల, అమ్మోనీయుల నాయకులు అతని చేతిలోనుండి తప్పించుకుంటారు.

42అతడు ఇతర దేశాల మీదికి తన సేన పంపిస్తాడు. ఐగుప్తు సైతం తప్పించుకోలేదు.

43అతడు విలువగల వెండి బంగారు వస్తువులను ఐగుప్తులోని విలువ గల వస్తువులన్నిటిని వశపరచుకుంటాడు. లూబీయులు, ఇతియోపియా వారు అతనికి దాసోహం అవుతారు.

44అప్పుడు తూర్పు నుండి, ఉత్తరం నుండి, వర్తమానాలు వచ్చి అతన్ని కలవర పరుస్తాయి. అతడు గొప్ప ఆగ్రహంతో అనేకులను పాడుచేసి నాశనం చేయడానికి బయలుదేరుతాడు.

45కాబట్టి తన శిబిరం డేరాను సముద్రానికి, పరిశుద్ధానంద పర్వతానికి మధ్య వేస్తాడు. అయితే అతనికి నాశనం వచ్చినప్పుడు ఎవరూ అతనికి సహాయం చేయడానికి రారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Daniel 11 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran