Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Job 9 >> 

1అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు.

2నిజమే, ఆ విషయం అలాగే ఉంటుందని నాకు తెలుసు. మనిషి దేవుని దృష్టిలో లోపం లేనివాడుగా ఎలా ఉండగలడు?

3మనిషి ఆయనతో వివాదం పెట్టుకుంటే ఆయన అడిగే వెయ్యి ప్రశ్నల్లో ఒక్కదానికైనా జవాబు చెప్పలేడు.

4ఆయన అత్యంత వివేకం, బల ప్రభావాలు గలవాడు. ఆయనతో పోరాడాలని తెగించిన వాళ్ళు తప్పక కీడు పాలవుతారు.

5పర్వతాలను వాటికి తెలియకుండానే ఆయన తొలగిస్తాడు. కోపంతో వాటిని బోర్లాపడేలా చేస్తాడు.

6భూమిని కూడా అది ఉన్న స్థలం నుండి కదిలించివేస్తాడు. భూమి పునాదులు ఊగిపోయేలా చేస్తాడు.

7ఆయన సూర్యుడికి ఉదయించ వద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాలను కనబడకుండా దాచివేస్తాడు.

8ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలం చేస్తాడు. సముద్ర అలల మీద ఆయన నడుస్తున్నాడు.

9స్వాతి, మృగశీర్షం, కృత్తిక అనే నక్షత్రాలను, దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే కలగజేశాడు.

10ఎవరికీ అంతు చిక్కని మహిమ గల కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడు.

11ఇదిగో, ఆయన నా సమీపంలో ఉంటున్నాడు, కానీ నేను ఆయనను గుర్తించలేదు. నా పక్కనుండి నడుస్తూ వెళ్తున్నాడు కానీ ఆయన నాకు కనబడడు.

12ఆయన తీసుకువెళ్తుంటే ఆయనను అడ్డగించేవాడెవడు? <<నువ్వేం చేస్తున్నావు?>> అని ఆయనను అడగ గలిగేవాళ్ళు ఎవరు?

13దేవుని కోపం చల్లారదు. రాహాబుకు సహాయం చేసిన వాళ్ళు ఆయనకు లొంగిపోయారు.

14కాబట్టి ఆయనకు జవాబివ్వడానికి నేనేపాటి వాణ్ణి? సూటియైన మాటలు పలుకుతూ ఆయనతో వాదించడానికి నేనెంతటి వాణ్ణి?

15నేను న్యాయవంతుణ్ణి అయినా ఆయనకు జవాబు చెప్పలేను. నా న్యాయాధిపతిని కరుణించమని వేడుకోవడం మాత్రమే చేయగలను.

16నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు జవాబిచ్చినా ఆయన నా మాట వింటాడని నాకు నమ్మకం లేదు.

17ఆయన నా మొర వినకుండా నన్ను తుఫాను చేత నలగగొడుతున్నాడు. కారణం లేకుండా నా గాయాలను రేగగొడుతున్నాడు.

18ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడు. చేదు పదార్థాలు నాకు తినిపిస్తాడు.

19బలవంతుల శక్తిని గూర్చి ప్రశ్న వస్తే <<నేనే ఉన్నాను>> అని ఆయన అంటాడు. న్యాయ నిర్ణయం గూర్చి వివాదం రేగినప్పుడు <<నాకు విరోధంగా వాదించేది ఎవరు?>> అని ఆయన అడుగుతాడు.

20నేను చేసే వాదన న్యాయంగా ఉన్నప్పటికీ నా మాటలే నా మీద నేరం మోపుతాయి. నేను న్యాయవంతుడినైప్పటికీ దోషినని నా మాటలు రుజువు చేస్తాయి.

21నేను నిర్దోషిని అయినప్పటికీ నా మీద నాకు ఇష్టం పోయింది. నా ప్రాణం అంటే నాకు లెక్క లేదు.

22తేడా ఏమీ లేదు. అందుకే అంటున్నాను, ఆయన నీతిమంతులు, దుర్మార్గులు అనే భేదం లేకుండా అందరినీ నాశనం చేస్తున్నాడు.

23ఆకస్మాత్తుగా సమూల నాశనం సంభవిస్తే నిరపరాధులు పడే అవస్థను చూసి ఆయన నవ్వుతాడు.

24భూమి దుర్మార్గుల ఆధీనంలో ఉంది. ఆయన న్యాయాధిపతులకు మంచి చెడ్డల విచక్షణ లేకుండా చేస్తాడు. ఇవన్నీ చేయగలిగేది ఆయన గాక ఇంకెవరు?

25పరుగు తీసే వాడి కంటే వేగంగా, ఎలాంటి మంచీ లేకుండానే నా రోజులు గడిచిపోతున్నాయి.

26రెల్లుతో కట్టిన పడవలు సాగిపోతున్నట్టు, గరుడపక్షి ఎరను చూసి హటాత్తుగా దానిపై వాలినట్టు నా రోజులు దొర్లిపోతున్నాయి.

27నా బాధలు మరచిపోతాననీ, నా దుఃఖం పోయి సంతోషంగా ఉంటాననీ నేను అనుకొన్నానా?

28నాకు వచ్చిన బాధలన్నిటిని బట్టి భయపడుతున్నాను. నువ్వు నన్ను నిర్దోషిగా ఎంచవన్న విషయం నాకు స్పష్టంగా తెలిసిపోయింది.

29నేను దోషిని అని నిర్ణయం అయిపొయింది గదా. ఇక నాకెందుకు ఈ వృథా ప్రయాస?

30నన్ను నేను మంచులాగా శుభ్రం చేసుకున్నా, సబ్బుతో నా చేతులు తోముకున్నా,

31నువ్వు నన్ను గుంటలో పడేస్తావు. అప్పుడు నేను వేసుకున్న బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.

32ఆయనకు జవాబు చెప్పడానికి దేవుడు నాలాగా మనిషి కాదు. ఆయనతో వాదించడానికి మేమిద్దరం కలసి న్యాయస్థానానికి వెళ్ళడం ఎలా?

33మా ఇద్దరి మీద చెయ్యి ఉంచి తీర్పు చెప్పగలిగే వ్యక్తి మాకు లేడు.

34ఆయన శిక్షాదండం నా మీద నుండి తొలగించాలి. ఆయన భయంకర చర్యలు నాలో వణుకు పుట్టించకుండా ఉండాలి.

35అప్పుడు నేను భయం లేకుండా ఆయనతో మాట్లాడతాను, అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను అలా చెయ్యలేను.


  Share Facebook  |  Share Twitter

 <<  Job 9 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran