Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Job 37 >> 

1దీన్ని బట్టి నా హృదయం వణకుతున్నది. దాని చోటి నుండి అది కదలి పోతున్నది.

2ఆయన స్వర గర్జనం వినండి. ఆయన నోటి నుండి వెలువడే శబ్దం వినండి.

3ఆకాశ వైశాల్యమంతటి కింద ఆయన దాన్ని వినిపిస్తాడు. భూమి కొనల దాకా తన మెరుపును పంపిస్తాడు.

4దాని తరువాత గొప్ప స్వరం గర్జిస్తుంది. ఆయన తన గంభీరమైన స్వరంతో సింహనాదం చేస్తాడు. ఆయన ధ్వని వినబడేటప్పుడు ఆయన మెరుపును అడ్డగించడు.

5దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చేస్తాడు. మనం గ్రహించలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు.

6నువ్వు భూమి మీద పడమని మంచుకు, వర్షానికి, జడివానకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు.

7మనుషులందరూ ఆయన సృష్టికార్యాన్ని తెలుసుకునేలా ఆయన ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు.

8జంతువులు వాటి గుహల్లో దూరి దాక్కుంటాయి.

9దక్షిణాన తుఫాను దాని ఆవాసం నుండి వస్తుంది ఉత్తర దిక్కు నుండి చెదరగొట్టే చలి గాలులు వీస్తాయి.

10దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది. జల విశాలమంతా ఘనీభవిస్తుంది.

11ఆయన దట్టమైన మేఘాన్ని జలంతో నింపుతాడు. తన మెరుపుల మేఘాన్ని వ్యాపింపజేస్తాడు.

12ఆయన పంపించగా మనుషులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపు, మేఘాలు సంచారం చేస్తాయి. ఆయన వాటికి ఆజ్ఞాపించేది అంతా అవి నెరవేరుస్తాయి.

13ఇదంతా ఆయన శిక్ష కోసం గాని, తన భూలోకం కోసం గాని కృపా భరితమైన నమ్మకత్వం కోసం గాని నెరవేరుస్తాడు.

14యోబు, ఈ మాట ఆలకించు. మౌనం వహించి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు.

15దేవుడు తన మేఘం మెరుపు ప్రకాశించాలని ఎలా తీర్మానం చేస్తాడో నీకు తెలుసా?

16మేఘాలను తేలజేయడం పరిపూర్ణ జ్ఞానం గలవాడి మహా కార్యమని నీకు తెలుసా?

17దక్షిణపుగాలి వీయడం వలన ఉక్క పోసేటప్పుడు నీ బట్టలు ఎలా వెచ్చబడ్డాయో నీకు తెలుసా?

18పోత పోసిన అద్దమంత దట్టమైన ఆకాశాన్ని ఆయన వ్యాపింప జేసినట్టు నువ్వు వ్యాపింపజేయగలవా?

19మేము ఆయనతో ఏమి పలకాలో అది మాకు నేర్పు. మా మనసుల్లో చీకటి వల్ల మా వాదాలు ఎలా వినిపించాలో తోచడం లేదు.

20నేను పలుకుతానని ఎవరైనా ఆయనతో చెప్పవచ్చా? ఎవరైనా తాను నాశనమై పోవాలని కోరతాడా?

21ఎత్తుగా ఉన్న మేఘంలో ప్రకాశించే ఎండ ఇప్పుడు కనబడకపోయినా గాలి మేఘాలను పోగొట్టి దాన్ని తేటగా కనపరుస్తుంది.

22ఉత్తర దిక్కున బంగారు కాంతి పుడుతుంది. దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు.

23సర్వశక్తుడైన దేవుడు మహాత్మ్యం గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయాన్ని, నీతిని ఆయన ఏమాత్రం చెరపడు. అందువలన మనుషులు ఆయనపట్ల భయభక్తులు కలిగి ఉంటారు.

24తాము జ్ఞానులం అనుకునే వారిని ఆయన ఏమాత్రం లక్ష్యపెట్టడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Job 37 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran