Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Job 28 >> 

1వెండికి గని ఉంది. బంగారం పుటం వేసే స్థలం ఉంది.

2ఇనుమును భూమిలోనుండి తీస్తారు. రాళ్లు కరగించి రాగి తీస్తారు.

3మనిషి చీకటిని అంతమొందిస్తాడు. సుదూర స్థలాల్లో అన్వేషిస్తాడు. గాఢాంధకారంలో అంతు తెలియని తావుల్లో విలువైన రాళ్ళను వెతుకుతాడు.

4మనుషుల నివాసాలకు, మనిషి పాదాలు సంచరించే స్థలాలకు దూరంగా అతడు సొరంగం తవ్వుతాడు. అక్కడ అతడు మానవులకు దూరంగా ఇటు అటు తిరుగులాడుతుంటాడు.

5భూమి విషయానికొస్తే అందులోనుండి ఆహారం పుడుతుంది. భూగర్భం అగ్నిమయం.

6దాని రాళ్లు నీలరతనాల పుట్టిల్లు. దాని ధూళిలో బంగారం ఉంది.

7వేటాడే ఏ పక్షికైనా ఆ దారి తెలియదు. డేగ కళ్ళు దాన్ని చూడలేదు.

8గర్వంగా సంచరించే మృగాలు ఆ దారి తొక్కలేదు. క్రూర సింహం ఆ దారిలో నడవలేదు.

9మనిషి చెకుముకి రాళ్ళను పట్టుకుంటాడు. పర్వతాలను వాటి కుదుళ్లతో సహా బోర్లా పడదోస్తాడు.

10శిలల్లో అతడు కాలువలు ఏర్పరుస్తాడు. అతని కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తుంది.

11నీళ్లు పొర్లి పోకుండా జలధారలకు ఆనకట్ట కడతాడు. అగోచరమైన వాటిని అతడు వెలుగులోకి తెస్తాడు.

12అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?

13మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు.

14అగాధం <<అది నాలో లేదు>> అంటుంది. <<నా దగ్గర లేదు>> అని సముద్రం అంటుంది.

15బంగారం దానికి సాటి కాదు. దాని వెల కట్టడానికి వెండిని తూచడం పనికి రాదు.

16అది ఓఫీరు బంగారంతోగానీ ప్రశస్తమైన గోమేధికంతో, నీలంతోగానీ కొనగలిగింది కాదు.

17సువర్ణమైనా స్ఫటికమైనా దానితో సాటిరావు. ప్రశస్తమైన బంగారు నగలు ఇచ్చి దాన్ని తీసుకోలేము.

18పగడాల, ముత్యాల పేర్లు దాని ఎదుట అసలు ఎత్తకూడదు. నిజంగా జ్ఞానానికున్న విలువ కెంపులకన్నా గొప్పది.

19కూషు దేశపు పుష్యరాగం దానికి సాటి రాదు. మేలిమి బంగారంతో దానికి వెల కట్టలేము.

20అలాగైతే జ్ఞానం ఎక్కడనుండి వస్తుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?

21అది జీవులందరి కన్నులకు కనిపించదు. ఆకాశ పక్షులకు అది అగమ్యగోచరం.

22<<మేము మా చెవులతో దాన్ని గురించి విన్నాము>> అని నాశనం, మరణం అంటాయి.

23దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు. దాని స్థలం ఆయనకే తెలుసు.

24ఆయన భూమి కొనల వరకూ చూస్తున్నాడు. ఆకాశం కింద ఉన్న దానినంతటినీ చూస్తున్నాడు.

25గాలికి ఇంత వేగం ఉండాలని ఆయన నియమించినప్పుడు, జలరాసుల కొలత నిర్ణయించినప్పుడు,

26వర్షానికి అదుపాజ్ఞలు ఏర్పరచినప్పుడు, ఉరుము మెరుపులకు దోవ చూపినప్పుడు,

27ఆయన జ్ఞానాన్ని చూసి దాన్ని ప్రకటించాడు. దాన్ని స్థాపించి దాన్ని పరిశోధించాడు.

28యెహోవాా పట్ల భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Job 28 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran