Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Job 22 >> 

1అప్పుడు తేమాను వాడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు.

2మానవమాత్రులు దేవునికి ప్రయోజనకారులౌతారా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులు.

3నువ్వు నీతిమంతుడివై ఉండడం సర్వశక్తుడైన దేవునికి సంతోషమా? నువ్వు యథార్థవంతుడివై ప్రవర్తించడం ఆయనకు లాభకరమా?

4ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నందువల్ల ఆయన నిన్ను గద్దిస్తాడా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడుతాడా?

5నీ చెడుతనం గొప్పది కాదా? నీ దోషాలు మితి లేనివి కావా?

6ఏమీ ఇవ్వకుండానే నీ సోదరుల దగ్గర నువ్వు తాకట్టు పెట్టుకున్నావు. వస్త్ర హీనుల బట్టలు తీసుకున్నావు.

7దాహంతో సొమ్మసిల్లిన వారికి నీళ్లియ్యలేదు. ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టలేదు.

8బాహుబలం గల వాడికే భూమి లభిస్తుంది. గొప్పవాడు అనిపించుకున్న వాడు దానిలో నివసిస్తాడు.

9వితంతువులను వట్టి చేతులతో పంపివేశావు. తండ్రి లేనివారి చేతులు విరగ్గొట్టావు.

10అందుకే బోనులు నిన్ను చుట్టుముడుతున్నాయి. అకస్మాత్తుగా కలిగే భీతి నిన్ను హడలగొడుతున్నది.

11నిన్ను చిక్కించుకొన్న అంధకారాన్ని నువ్వు చూడడం లేదా? నిన్ను ముంచెత్తబోతున్న ప్రళయ జలాలను నువ్వు చూడడం లేదా?

12దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రాల ఔన్నత్యాన్ని చూడు. అవి ఎంత ఎత్తులో ఉన్నాయి!

13<<దేవుడికి ఏమి తెలుసు? గాఢాంధకారంలోనుండి ఆయన న్యాయం కనుగొంటాడా?

14దట్టమైన మేఘాలు ఆయనకు అడ్డుగా ఉన్నాయి. ఆయన మనల్ని చూడలేడు. ఆకాశ గోపురంలో ఆయన తిరుగుతున్నాడు>> అని నీవనుకుంటావు.

15పూర్వకాలం నుండి దుష్టులు అనుసరించిన మార్గాన్ని నువ్వు అనుసరిస్తావా?

16తమ కాలం రాకముందే వారు హటాత్తుగా నిర్మూలమైపోయారు. వారి పునాదులు నదీ ప్రవాహలవలె కొట్టుకు పోయాయి.

17<<మా దగ్గర నుండి తొలగి పో>> అని దేవునితో అంటారు. <<సర్వశక్తుడు మాకు ఏమి చేస్తాడులే>> అంటారు.

18అయినా ఆయన మంచి పదార్థాలతో వారి ఇళ్ళు నింపాడు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరం అగు గాక.

19నీతిమంతులు దాని చూసి సంతోషిస్తారు. నిర్దోషులు వారిని హేళన చేస్తారు.

20<<మన విరోధులు నిశ్చయంగా నిర్మూలమైపోయారు. వారి సంపదను అగ్ని కాల్చివేసింది>> అంటారు.

21ఆయనతో సహవాసం చేస్తే నీకు శాంతిసమాధానాలు కలుగుతాయి. ఆ విధంగా నీకు మేలు కలుగుతుంది.

22ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అవలంబించు. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో.

23సర్వశక్తునివైపు తిరిగి నీ నివాసాల్లో నుండి దుర్మార్గాన్ని దూరంగా తొలగిస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు.

24మట్టిలో నీ సిరిసంపదలను, సెలయేటి నీటిలో ఓఫీరు బంగారాన్ని పారవెయ్యి.

25అప్పుడు సర్వశక్తుడు నీకు సువర్ణంగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు.

26అప్పుడు సర్వశక్తునిలో నువ్వు ఆనందిస్తావు. దేవుని వైపు నీ ముఖం ఎత్తుతావు.

27నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. నీ మొక్కుబళ్లు నువ్వు చెల్లిస్తావు.

28నువ్వు దేనినైనా ఆలోచన చేస్తే అది నీకు స్థిరపడుతుంది. నీ మార్గాలపై వెలుగు ప్రకాశిస్తుంది.

29దేవుడు గర్విష్టులను వంచుతాడు. కళ్ళు దించుకునే వారిని కాపాడతాడు.

30నిర్దోషి కానివాడినైనా ఆయన విడిపిస్తాడు. అతడు నీ చేతుల శుద్ధి మూలంగా విడుదల పొందుతాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Job 22 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran