Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Proverbs 25 >> 

1ఇవికూడా సొలొమోను సామెతలే. యూదారాజు హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసారు.

2విషయాన్ని గోప్యంగా ఉంచడం దేవునికి ఘనత. సంగతిని పరిశోధించడం రాజులకు ఘనత.

3ఆకాశాల ఎత్తు, భూమి లోతు, రాజుల అభిప్రాయం అగమ్యగోచరం.

4వెండిలోని కల్మషం తీసేస్తే లోహకారుడు తన పనితనంతో వస్తువు తయారు చేస్తాడు.

5రాజు సముఖం నుండి దుష్టుల్ని తొలగించ గలిగితే అతని సింహాసనం నీతిమూలంగా స్థిరం అవుతుంది.

6రాజు ఎదుట నీ గొప్ప చెప్పుకోకు. గొప్పవారికి కేటాయించిన చోట ఉండవద్దు.

7నీవు గమనించి చూసిన ప్రధాని ఎదుట ఎవరైనా నిన్ను తగ్గించడం కంటే <<ఈ పైచోటికి రా>>అని అతడు నీతో చెప్పడం మంచిది కదా.

8అనాలోచితంగా న్యాయ స్థానానికి పోవద్దు. చివరికి నీ పొరుగువాడు నిన్ను అవమాన పరచి <<ఇక నువ్వేమి చేస్తావు?>> అని నీతో అంటాడు కదా.

9నీ పొరుగువాడితో నీవు వాదులాడ వచ్చు గానీ ఎదుటి వ్యక్తి గుట్టు నలుగురిలో రట్టు చెయ్యవద్దు.

10అలా చేస్తే వినేవాడు నిన్ను అవమానపరుస్తాడేమో. ఆ విధంగా నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి మాసిపోదు.

11సమయోచితంగా పలికిన మాట వెండి పళ్ళెంలో పొదిగిన బంగారు పండ్ల వంటిది.

12బంగారు చెవిపోగులు ఎలాటివో స్వర్ణాభరణాలు ఎలాటివో వినే వాడి చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అలాటి వాడు.

13నమ్మకమైన దూత తనను పంపిన వారిపాలిట కోతకాలపు మంచు చల్లదనం వంటి చల్లదనం గలవాడు. వాడు తన యజమానుల హృదయానికి ఆహ్లాదం కలిగిస్తాడు.

14ఏమీ ఇవ్వకుండానే ఇచ్చానని సొంత డబ్బా వాయించుకునే వాడు వర్షం లేని మబ్బుతో గాలితో సమానం.

15సహనంతో న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టగలదు.

16నీకు తేనె దొరికితే మితంగా తిను. మితిమీరి తింటే ఒకవేళ కక్కి వేస్తావేమో.

17మాటిమాటికి నీ పొరుగువాడి ఇంటికి వెళ్లకు. అతడు విసికిపోయి నిన్ను ద్వేషిస్తాడేమో.

18తన పొరుగువాడిపై అబద్ధ సాక్ష్యం పలికేవాడు యుద్ధంలో వాడే గదలాంటి వాడు, కత్తిలాంటి వాడు. వాడియైన బాణం వంటివాడు.

19కష్టకాలంలో విశ్వాసఘాతకుణ్ణి ఆశ్రయించడం విరిగిన పన్నుతో, కీలు వసిలిన కాలుతో సమానం.

20దుఃఖితుడి ఎదుట పాటలు వినిపించేవాడు చలి రోజున పైబట్ట తీసివేసే వాడితోను సూరేకారం మీద చిరక పోసే వాడితోను సమానం.

21నీ పగవాడు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టు. దాహంతో ఉంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వు.

22అలా చేస్తే వాడి తలపై నిప్పులు కుప్పగా పోసిన వాడివౌతావు. యెహోవాా అందుకు నీకు ప్రతిఫలమిస్తాడు.

23ఉత్తర వాయువు వాన తెస్తుంది. అలానే గుట్టు బయట పెట్టేవాడి ముఖం గంభీరంగా ఉంటుంది.

24గయ్యాళితో పెద్ద భవంతిలో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలన ఉండడమే హాయి.

25దప్పిగొన్నవాడికి చల్లని నీరు ఎలాగో దూరదేశం నుండి వచ్చిన శుభసమాచారం అలా.

26కలకలు అయిపోయిన ఊట, చెడిపోయిన నీటిబుగ్గ, ఉత్తముడు దుష్టుడికి లోబడి ఉండడం ఒకటే.

27తేనె మితిమీరి తినడం మంచిది కాదు. గొప్ప కోసం అదే పనిగా పాకులాడడం అలాటిదే.

28ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సు అదుపు చేసుకోలేని వాడు అంతే.


  Share Facebook  |  Share Twitter

 <<  Proverbs 25 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran